Last Updated:
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుని, ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు పలు భాషల్లో నటిగా, వ్యాపారవేత్తగా రాణిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ‘రైజింగ్ భారత్ సమ్మిట్’లో పాల్గొని తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం, వ్యాపార రంగంలో అడుగులు, తెలుగు పరిశ్రమపై ఉన్న అభిమానాన్ని పంచుకున్నారు.
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుని, ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు పలు భాషల్లో నటిగా, వ్యాపారవేత్తగా రాణిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ‘రైజింగ్ భారత్ సమ్మిట్’లో పాల్గొని తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం, వ్యాపార రంగంలో అడుగులు, తెలుగు పరిశ్రమపై ఉన్న అభిమానాన్ని పంచుకున్నారు. పెళ్లి తర్వాత జీవితంలో వచ్చిన మార్పులు, ఫిట్నెస్, ఓటీటీ ప్రభావం, కెరీర్లో తీసుకున్న నిర్ణయాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఆకట్టుకున్నాయి.
పెళ్లై రెండున్నరేళ్లు అయినా తమ జీవితంలో పెద్దగా మార్పు అనిపించలేదని రకుల్ తెలిపారు. తాను, జాకీ భగ్నానీ చాలా సహజంగా కొత్త జీవితంలోకి అడుగుపెట్టామని, ఒకరి కెరీర్ నిర్ణయాల్లో మరొకరు జోక్యం చేసుకోమని చెప్పారు. ఇద్దరికీ ఒకే ఆలోచనలు ఉండటంతో కొన్ని వ్యాపారాలను కలిసి నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
నటిగా మాత్రమే కాకుండా వ్యాపారవేత్తగా కూడా తన ప్రయాణం చాలా ఏళ్ల క్రితమే మొదలైందని రకుల్ చెప్పారు. 2015లో హైదరాబాద్‌లో F45 జిమ్‌తో తన తొలి వ్యాపారాన్ని ప్రారంభించానని తెలిపారు. ఆ తర్వాత వెల్బీయింగ్ న్యూట్రిషన్ వంటి సంస్థల్లో పెట్టుబడులు పెట్టడంతో పాటు, ఆరోగ్యకరమైన మిల్లెట్ ఆహారాన్ని అందించే ‘ఆరంభం’ రెస్టారెంట్‌ను ప్రారంభించినట్లు చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 40కి పైగా బ్రాంచ్‌లతో ఆ సంస్థ విజయవంతంగా కొనసాగుతోందన్నారు. అలాగే జాకీ భగ్నానీతో కలిసి ‘నువానా’ పేరుతో వెల్నెస్ క్లినిక్‌ను కూడా ప్రారంభించామని వివరించారు.
ఫిట్‌నెస్‌పై మాట్లాడిన రకుల్.. సరైన జీవనశైలి ఉంటే అనేక ఆరోగ్య సమస్యలను నియంత్రించవచ్చని అన్నారు. నేటి ఒత్తిడి, కాలుష్యం, జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని, శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు. ‘చీట్ డే’ అనే పదం తనకు నచ్చదని, దాన్ని ‘ట్రీట్ డే’గా భావిస్తానని చెప్పారు. ఆ రోజూ కూడా ఆరోగ్యకరమైన ఆహారాన్నే ఎక్కువగా తీసుకుంటానని వెల్లడించారు.
సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ.. తన మొదటి సినిమా కన్నడలో వచ్చిందని, అప్పటికి తాను కాలేజీలో చదువుతున్నానని గుర్తు చేసుకున్నారు. మొదట కారు కొనాలనే ఉద్దేశంతో సినిమా ఒప్పుకున్నానని నవ్వుతూ చెప్పారు. అయితే ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యాక నటనే తన జీవితమని అర్థమైందని.. అయినప్పటికీ ముందుగా డిగ్రీ పూర్తి చేసి తర్వాతే పూర్తిస్థాయిలో సినిమాల్లోకి వచ్చానని తెలిపారు. చదువు కారణంగా ఆ సమయంలో చాలా తెలుగు సినిమాలను కూడా వదులుకోవాల్సి వచ్చిందన్నారు.
తెలుగు పరిశ్రమ గురించి మాట్లాడిన రకుల్ భావోద్వేగానికి గురయ్యారు. తెలుగు సినీ పరిశ్రమే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని, హైదరాబాద్‌లో గడిపిన ఏడు, ఎనిమిదేళ్లు తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయని చెప్పారు. “తెలుగు ఇండస్ట్రీ నా హోమ్ గ్రౌండ్. నా ఆత్మలో సగం తెలుగు ఉంది” అంటూ తెలుగు అభిమానులపై తనకున్న ప్రేమను వ్యక్తం చేశారు. వేదికపైనే తెలుగులో మాట్లాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఓటీటీ, థియేటర్ల గురించి మాట్లాడుతూ.. కంటెంట్‌ను చూసే విధానం మారుతున్నా, థియేటర్లకు ఉన్న ప్రత్యేకత ఎప్పటికీ తగ్గదన్నారు. పెద్ద హీరోల సినిమాలు, భారీ విజువల్స్, యాక్షన్ చిత్రాలు పెద్ద తెరపైనే నిజమైన అనుభూతిని ఇస్తాయని చెప్పారు. అదే సమయంలో ఓటీటీ వల్ల కొత్త కథలు, కొత్త నటులకు మంచి అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆడని సినిమాలు కూడా ఓటీటీలో ప్రేక్షకులను సంపాదిస్తున్నాయని, చివరికి ప్రతి సినిమా ప్రేక్షకులకు చేరుకోవడమే ముఖ్యమని అభిప్రాయపడ్డారు.
తన కెరీర్లో ప్రత్యేకమైన సినిమా ‘జయ జానకి నాయక’ గురించి కూడా రకుల్ ప్రస్తావించారు. 2017లో విడుదలైన ఈ సినిమా ఏడేళ్ల తర్వాత యూట్యూబ్‌లో ఏకంగా బిలియన్ వ్యూస్ సాధించడం తనకూ ఆశ్చర్యమేనని చెప్పారు. మొదట ఆ వార్త నిజమేనా అని తానే యూట్యూబ్‌లో చూసుకున్నానని, ప్రపంచంలోనే బిలియన్ వ్యూస్ సాధించిన తొలి సినిమా కావడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడించారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana












