Onion price: మొన్న రూ.20, ఇప్పుడు రూ.60.. తెలుగు రాష్ట్రాల్లో కొండెక్కిన ఉల్లి.. సెంచరీ దాటేస్తోందా..! onion prices shock again reach rs 60. | విజయవాడ వార్తలు (Vijayawada News) | ACTPnews

Onion price: మొన్న రూ.20, ఇప్పుడు రూ.60.. తెలుగు రాష్ట్రాల్లో కొండెక్కిన ఉల్లి.. సెంచరీ దాటేస్తోందా..! onion prices shock again reach rs 60. | విజయవాడ వార్తలు (Vijayawada News)


ఉల్లి ధరలు పెరగడానికి పంట దిగుబడి తగ్గడం, తెగుళ్ల ప్రభావం, మార్కెట్లకు సరిపడా సరఫరా లేకపోవడం వంటి కారణాలు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా సరుకు అందుబాటులో లేకపోవడంతో ధరపై ప్రభావం పడుతోందని అంటున్నారు. గతంలోనూ ఉల్లి ధరలు ఒక్కసారిగా సెంచరీ దాటిన సందర్భాలు ఉండటంతో.. ఇప్పుడు కూడా కిలో రూ.100 మార్క్‌కు చేరుతుందేమోనన్న ఆందోళన వినిపిస్తోంది.

హైదరాబాద్‌లోని రైతు బజార్లలో ప్రస్తుతం కిలో ఉల్లి ధర సుమారు రూ.54గా ఉంది. ఇతర కూరగాయల ధరలు చూస్తే.. టమాట రూ.17, వంకాయ రూ.28, బెండకాయ రూ.35, పచ్చిమిర్చి రూ.40, క్యాలీఫ్లవర్ రూ.21, క్యాబేజీ రూ.15, క్యారెట్ రూ.50గా పలుకుతున్నాయి. దొండకాయ రూ.35, బంగాళదుంప రూ.17, సొరకాయ రూ.9, పొట్లకాయ రూ.15, బీన్స్ రూ.60, గోరుచిక్కుడు రూ.28, చిక్కుడుకాయ రూ.40, దోసకాయ రూ.28, బీరకాయ రూ.32, కాకరకాయ రూ.32 వరకు విక్రయిస్తున్నారు.

విజయవాడ మార్కెట్లలోనూ ఉల్లి ధరలు దాదాపు ఇదే స్థాయిలో ఉన్నాయి. అక్కడ కిలో ఉల్లి రూ.55కు లభిస్తోంది. వంకాయలు రూ.22, టమాట రూ.26, బెండకాయ రూ.18, పచ్చిమిర్చి రూ.30, కాకరకాయ రూ.32, బీరకాయ రూ.30, క్యాలీఫ్లవర్ రూ.35, క్యాబేజీ రూ.24, క్యారెట్ రూ.48 వరకు ఉన్నాయి. దొండకాయ రూ.24, బంగాళదుంప రూ.24, గోరుచిక్కుడు రూ.28, దోసకాయ రూ.22, పొట్లకాయ రూ.13, చామదుంప రూ.34 వరకు ధర పలుకుతున్నాయి.

రైతు బజార్లతో పోలిస్తే రిటైల్ మార్కెట్లలో ఉల్లి ధర మరింత ఎక్కువగా ఉంది. ప్రస్తుతం కిలోకు సుమారు రూ.70 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. కొద్ది నెలల క్రితం రోడ్డు పక్కన ట్రాలీ వాహనాల్లో రూ.100కే 4 కిలోల ఉల్లి ఇచ్చిన పరిస్థితి ఉండగా.. ఇప్పుడు అదే తరహాలో రూ.200కు 3 కిలోలు మాత్రమే అందిస్తున్నారని వినియోగదారులు చెబుతున్నారు. మరోవైపు మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి ధరలను పెంచుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌ మలక్‌పేట మార్కెట్లో క్వింటాల్‌ ఉల్లి ధర సుమారు రూ.5,500 వరకు పలుకుతోంది.

ఉల్లి ధరల పెరుగుదలతో సామాన్యులపై భారం పడకుండా ప్రభుత్వాలు కూడా చర్యలు చేపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రైతు బజార్ల ద్వారా కిలో ఉల్లిని రూ.35కే అందించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి కింద 1.21 లక్షల టన్నుల బఫర్‌ స్టాక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో మార్కెట్లో సరఫరా పెంచి ధరలను నియంత్రించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం పెరిగిన ఉల్లి ధరలు ఎప్పుడు తగ్గుతాయన్నది సరఫరా, దిగుబడి పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports