Last Updated:
Online Games: ఆన్లైన్ గేమ్‌లు, బెట్టింగ్‌ల రొంపిలో దిగి, రూ. కోట్లు నష్టపోయి ఆర్థికంగా చితికిపోయిన ఒక యువ పారిశ్రామికవేత్త ప్రాణాలు తీసుకున్న విషాద సంఘటన తీవ్ర కలకలం రేపింది.
పిన్న వయస్సులోనే ఒక కంపెనీకి సీఈఓగా (CEO) వ్యవహరిస్తూ ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న యువకుడు ఆన్లైన్ గ్యాంబ్లింగ్‌కు బానిసై తన జీవితాన్ని దారుణంగా ముగించుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని వర్గాలమ్మ గుడి సమీపంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది.
ఈనాడు కథనం ప్రకారం… సిద్దిపేట పట్టణంలోని మంగళపల్లి ప్రాంతానికి చెందిన గండూరి సంతోష్ (22) చార్టర్డ్ ఎకౌంటెంట్ (CA) చదివి, వృత్తిపరంగా రాణిస్తున్నాడు. విద్యావంతుడైన సంతోష్ తన ప్రతిభతో 2024లో ‘పిఎస్సి నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్’ (PSC Network Pvt Ltd) అనే స్టార్టప్ కంపెనీని స్థాపించి దానికి సీఈఓగా వ్యవహరిస్తున్నాడు. ఎంతో ప్రకాశవంతమైన భవిష్యత్తు ఉన్న సంతోష్, కొన్ని నెలల క్రితం మెల్లగా ఆన్లైన్ గేమిం, గ్యాంబ్లింగ్‌కు అలవాటు పడ్డాడు. ప్రారంభంలో సరదాగా మొదలైన ఈ అలవాటు, ఆ తర్వాత తీవ్రమైన వ్యసనంగా మారింది. గేమ్‌లలో గెలవాలనే తాపత్రయంతో వరుసగా డబ్బులు పందెం కాస్తూ, భారీ మొత్తంలో నష్టపోతూ వచ్చాడు.
హైదరాబాద్‌లోని హబ్సిగూడలో నివాసముంటున్న సంతోష్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వల్ల ఎదురైన నష్టాలను పూడ్చుకోవడానికి విపరీతంగా అప్పులు చేశాడు. చివరకు ఆ అప్పులు తీర్చలేక హైదరాబాద్‌లో ఉన్న తన సొంత ఇంటిని సైతం విక్రయించాల్సి వచ్చింది. అయినప్పటికీ అప్పుల భారం తీరకపోవడం, గేమింగ్ వ్యసనం నుంచి బయటపడలేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
ఈ క్రమంలో ఈ నెల 1వ తేదీన సిద్దిపేట శివారులోని ‘హరిత హోటల్’ నందు ఒక గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. విషయం గమనించిన కుటుంబ సభ్యులు అతనిని పరామర్శించి, నచ్చజెప్పి ఆ గదిని ఖాళీ చేయించారు.
అయితే ఆ తర్వాత సంతోష్ ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు, బంధువులు అతని కోసం గాలింపు చేపట్టారు. మంగళవారం రాత్రి వేళ సిద్దిపేట గుడి వెనుక ఉన్న నిర్జన ప్రాంతంలో సంతోష్ మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు, కుటుంబ సభ్యులు గమనించారు.
డెత్ నోట్ లభ్యం: సంఘటనా స్థలంలో సంతోష్ రాసిన 23 పేజీల సుదీర్ఘమైన డెత్ నోట్ లభ్యమైంది. ‘నా ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కారని, స్వయంకృతాపరాధంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు’ అందులో పేర్కొన్నాడు.
పోస్టుమార్టం: సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.
ఒక వైపు సీఈఓగా ఉన్నత స్థాయిలో ఉండి, మరోవైపు ఆన్లైన్ గేమింగ్ భూతానికి బానిసై 22 ఏళ్ల పిన్న వయస్సులోనే సంతోష్ ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబంలోనూ, స్థానికంగానూ తీవ్ర శోకాన్ని నింపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Hyderabad,Telangana














