Last Updated:
ఒకప్పుడు చిరంజీవి- శ్రీదేవి జోడీ కట్టి థియేటర్లను హౌస్‌ఫుల్ చేయడమే కాదు బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. ఇప్పుడు వారి పిల్లలు ఆ స్థానాన్ని ఆక్రమించారు. పెద్ది సినిమా కోసం రామ్ చరణ్- జాన్వీ కపూర్ జోడీ కట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
తెలుగు చలనచిత్ర చరిత్రలో కొన్ని కాంబినేషన్లు కేవలం రికార్డుల కోసం మాత్రమే కాదు, ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవడానికి పుడతాయి. అలాంటి ఒక క్లాసిక్, ఎప్పటికీ మర్చిపోలేని కాంబినేషన్… మెగాస్టార్ చిరంజీవి – అతిలోకసుందరి శ్రీదేవి. అప్పట్లో వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ థియేటర్లలో ఒక ఊపు ఊపింది. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘ఎస్.పి.పరశురామ్’ వంటి చిత్రాల్లో వీరి కెమిస్ట్రీ, ముఖ్యంగా సాంగ్స్‌లో వీరి డాన్స్ మూమెంట్స్ ఇప్పటికీ ఒక బెంచ్‌మార్క్.
అయితే ఇప్పుడు కాలం, తరం రెండూ మారాయి. ఆనాటి క్లాసిక్ మ్యాజిక్‌ను మళ్లీ వెండితెరపై పునరావృతం చేయడానికి సరికొత్త జోడీ సిద్ధమైంది. చిరంజీవి వారసుడిగా గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్, శ్రీదేవి నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న అందాల భామ జాన్వీ కపూర్ ఇప్పుడు జంటగా నటిస్తున్నారు. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న #RC16 చిత్రంతో ఈ క్రేజీ కాంబినేషన్ నిజం కాబోతోంది.
ఈ నేపథ్యంలో ఆనాటి క్రేజీ కాంబినేషన్ చిరంజీవి- శ్రీదేవి, ఈ నాటి స్పైసీ కాంబో రామ్ చరణ్- జాన్వీ కపూర్ మధ్య పోలికలు వివరిస్తూ సీనియర్ ఫిలిం క్రిటిక్ ధీరజ్ అప్పాజీ న్యూస్ 18 తెలుగుతో పలు విషయాలు పంచుకున్నారు. చిరంజీవి, శ్రీదేవిలది నటనతో పాటు డాన్స్‌లోనూ పోటీపడే తత్వం. ఇప్పుడు చరణ్ టాలీవుడ్ బెస్ట్ డాన్సర్లలో ఒకరు, జాన్వీ కూడా తన డాన్స్ స్కిల్స్‌తో ఇప్పటికే పలు సినిమాల్లో మెప్పించింది కాబట్టి వీరిద్దరి స్క్రీన్ కెమిస్ట్రీ విజువల్ ఫీస్ట్‌గా ఉండబోతోంది అని చెప్పారు. నాడు ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమా బాక్సాఫీస్‌ను ఎలాగైతే షేక్ చేసిందో, నేడు చరణ్-జాన్వీ సినిమాపై అంతకుమించిన అంచనాలు ఉన్నాయి. అప్పట్లో తలిదండ్రులు సృష్టించిన వండర్స్‌ని, ఇప్పుడు వారి పిల్లలు రీ-క్రియేట్ చేయడం పక్కా అని ఆయన అంచనా వేశారు. టాలీవుడ్ లో చిరంజీవి-శ్రీదేవిలది ఒక అద్భుతమైన అధ్యాయం అయితే… రామ్ చరణ్-జాన్వీ కపూర్‌లది సరికొత్త ట్రెండ్‌కు ఆరంభం అని అన్నారు. ఆనాటి మ్యాజిక్‌ను మనసులో పెట్టుకుని థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు ఈ లేటెస్ట్ జోడీ సరికొత్త అనుభూతిని పంచడం ఖాయమే అని ఇప్పటికే వదిలిన పెద్ది ప్రమోషన్స్ ద్వారా స్పష్టమవుతోందని చెప్పారు.
అంతేకాదు తెలుగులో జాన్వీ కపూర్ చేస్తున్న రెండో సినిమా పెద్ది అయినప్పటికీ.. ఇది ఆమె కెరీర్ లో ఓ మైల్ స్టోన్ కావడం అయితే పక్కా అని ధీరజ్ అప్పాజీ తెలిపారు. ఇందులో జాన్వీ పోషిస్తున్న అచ్చియమ్మ పాత్ర తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిలో నిలిచే అవకాశం అయితే ఉందని, అప్పట్లో ఎలాగైతే చిరంజీవితో శ్రీదేవి చేసిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ అంచనాలను మించి రెస్పాన్స్ అందుకుందో ఇప్పుడు పెద్ది సినిమా కూడా వారి వారసులకు అదే రేంజ్ పాపులారిటీ తీసుకురావడం పక్కా అని అంటున్నారు. రంగస్థలం తర్వాత రామ్ చరణ్ కి పెద్ది రూపంలోనే మరో సోలో హిట్ పడే అవకాశం ఉందని, అదే విధంగా టాలీవుడ్ లో జాన్వీ కపూర్ స్థానం పదిలం చేసే సినిమా కూడా పెద్దినే అవుతుందని ఆయన చెప్పారు.
నిజానికి జాన్వీ కపూర్ హీరోయిన్ గా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సీక్వల్ తీయాలని టాలీవుడ్ దిగ్గజ దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేసినా అది పట్టాలెక్కకపోవడంతో.. పెద్ది మూవీపైనే జాన్వీ బాగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోందని, ఈ సినిమాతో ఆమె తన తల్లి లాగానే టాలీవుడ్ లో పాగా వేయడం పక్కా అని అప్పాజీ పేర్కొన్నారు.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana
May 22, 2026 12:23 PM IST













