PM Modi: నాడు అమెరికా నుంచి గింజలు.. నేడు 80 కోట్ల మందికి ఉచిత రేషన్.. ఆహార భద్రతలో భారత్ చారిత్రక ప్రస్థానం | | ACTPnews

News18


Last Updated:

పరాయి దేశాల సాయం పైంచి సొంతంగా ఎదిగిన భారత్, నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత ఆహార భద్రతా పథకాన్ని నడుపుతోంది. నెహ్రూ నాటి కొరత నుంచి మోదీ కాలపు రికార్డు పంపిణీ వరకు దేశం సాధించిన చారిత్రక విజయమిది.

News18
News18

ఒకప్పుడు సొంత ప్రజల ఆకలి తీర్చడం కోసం విదేశీ నౌకల వైపు చూసిన భారతదేశం, స్వాతంత్ర్యం వచ్చిన ఏడు దశాబ్దాల తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార భద్రతా కార్యక్రమాన్ని విజయవంతంగా నడుపుతోంది. దేశంలోని 80 కోట్లకు పైగా జనాభాకు ఉచితంగా ఆహార ధాన్యాలను అందిస్తూ అగ్రగామిగా నిలిచింది. నెహ్రూ హయాంలో విదేశీ సాయంపై ఆధారపడిన స్థితి నుంచి, ప్రస్తుత మోదీ ప్రభుత్వ కాలంలో భారీ ఎత్తున సాగుతున్న ప్రజా సంక్షేమ పంపిణీ వ్యవస్థ వరకు జరిగిన ఈ పరిణామం స్వతంత్ర భారత్‌లో అత్యంత నాటకీయమైన మార్పు అనవచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ 2026 జూన్ 10న తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నిరంతర పాలనా రికార్డును అధిగమించబోతున్న తరుణంలో, ఈ రెండు విభిన్న యుగాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని దేశ ఆహార భద్రతా ప్రస్థానం స్పష్టంగా చూపిస్తోంది.

నెహ్రూ కాలంలో విదేశీ ధాన్యంపై ఎందుకు ఆధారపడాల్సి వచ్చింది?

జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న రోజుల్లో భారతదేశం అల్ప వ్యవసాయ ఉత్పాదకత, పరిమిత నీటిపారుదల వసతులు, రుతుపవనాలపై మితిమీరిన ఆధారపడటం, నిరంతర ఆహార కొరత వంటి సమస్యలతో కొట్టుమిట్టాడేది. వలసపాలన ముగిసి, దేశ విభజన జరిగిన కొత్తలో దేశంలోని పేద ప్రజల ఆకలి తీర్చడం అతిపెద్ద సవాలుగా ఉండేది. వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం 1950-51లో దేశ ఆహార ధాన్యాల ఉత్పత్తి కేవలం 50.82 మిలియన్ టన్నులు మాత్రమే. ఈ కొరత కారణంగా అమెరికా నుంచి పి.ఎల్-480 (PL-480) చట్టం కింద వచ్చే గోధుమల సాయంపై భారత్ ఆధారపడాల్సి వచ్చింది. విదేశాల నుంచి నౌక రాగానే గింజలు నోట్లోకి వెళ్లే పరిస్థితిని అప్పట్లో ‘షిప్-టు-మౌత్’ అని పిలిచేవారు. ఈ పరాధేయత 1960ల వరకు కొనసాగింది.

కొరత నుంచి స్వయం సమృద్ధి వైపు హరిత విప్లవం

నెహ్రూ యుగం ముగిసిన తర్వాత భారత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. భారత హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్. స్వామినాథన్ నేతృత్వంలో దేశం స్వయం సమృద్ధి వైపు అడుగులు వేసింది. అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పరిశోధనల ద్వారా వరి, గోధుమల ఉత్పత్తిని ఆయన రికార్డు స్థాయిలో పెంచారు. ఈ ప్రస్థానంలో నీటిపారుదల విస్తరణతో పాటు 1965లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) ఏర్పాటు కావడం పెద్ద మలుపు. కొరతగా ఉన్న ధాన్యాన్ని సేకరించడం, బఫర్ స్టాక్ నిల్వ చేయడం, ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా పేదలకు చేర్చడం లాంటి పటిష్టమైన పునాది అప్పుడే పడింది.

కొరత నిర్వహణ నుంచి భారీ సంక్షేమ డెలివరీ వైపు

ప్రధాని మోదీ నాయకత్వంలో ఆహార భద్రత అనేది కేవలం కొరతను అధిగమించే స్థాయి దాటి, ప్రపంచంలోనే అతిపెద్ద సంక్షేమ పథకంగా రూపాంతరం చెందింది. కోవిడ్ మహమ్మారి సమయంలో పేదలను ఆదుకోవడానికి 2020 మార్చి 26న ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నా యోజన’ (PMGKAY) ప్రారంభించారు. దీని కింద జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోని 80 కోట్ల మంది లబ్ధిదారులకు నెలకు అదనంగా 5 కిలోల చొప్పున ఉచిత బియ్యం లేదా గోధుమలు అందించారు. అనంతరం 2023 జనవరి 1 నుండి రేషన్ ధాన్యాలను పూర్తిగా ఉచితం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని మరో ఐదేళ్ల పాటు అంటే 2028 డిసెంబర్ వరకు పొడిగించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5 లక్షలకు పైగా చౌకధరల దుకాణాల ద్వారా 81.35 కోట్ల మందికి ఈ లబ్ధి అందుతోంది.

డెలివరీ సంస్కరణలు, రికార్డు స్థాయి ఉత్పత్తి

మోదీ ప్రభుత్వ హయాంలో కేవలం ధాన్యం ఇవ్వడమే కాకుండా పంపిణీ వ్యవస్థలో కీలక సంస్కరణలు తెచ్చారు. అందులో భాగమే ‘వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్’ విధానం. ఉపాధి కోసం వలస వెళ్లే కార్మికులు దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా తమ రేషన్ పొందేలా ఈ విధానం పంపిణీని సులభతరం చేసింది. ప్రస్తుతం ఈ సదుపాయం ద్వారా 81 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. దీనికి తోడుగా ‘పోషణ్ అభియాన్’ ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలకు పోషకాహారాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం 2025-26 తాజా అంచనాల ప్రకారం దేశంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 376.563 మిలియన్ టన్నులకు చేరింది. ఇది అంతకుముందు ఏడాది కంటే దాదాపు 18.8 మిలియన్ టన్నులు ఎక్కువ కావడం విశేషం.

పరాధేయత నుంచి పరిపూర్ణ హక్కుగా మార్పు

గత ఏడు దశాబ్దాల ప్రస్థానాన్ని పరిశీలిస్తే రెండు యుగాల మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తుంది. నెహ్రూ కాలంలో దేశం ఆకలిని జయించడానికి, విదేశీ సాయం తగ్గించుకోవడానికి పోరాడింది. ఆ తర్వాత వచ్చిన హరిత విప్లవం దేశానికి అవసరమైన ఉత్పత్తి పునాదిని ఇచ్చింది. ప్రస్తుత మోదీ కాలంలో ఆ పునాదిని మరింత బలోపేతం చేస్తూ, 80 కోట్లకు పైగా ప్రజలకు ఆహారాన్ని ఒక హక్కుగా, ఉచితంగా అందించే సంక్షేమ సామ్రాజ్యాన్ని నిర్మించారు. నాడు విదేశీ ధాన్యం లభ్యత కోసం ఎదురుచూసిన దేశం, నేడు అంతర్గతంగా భారీ సంక్షేమ కార్యక్రమాన్ని నడుపుతూనే విదేశాలకు సైతం ఆహార ధాన్యాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదగడం విశేషం.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *