PM Modi: ప్రధాని మోదీకి స్లోవేకియా అత్యున్నత జాతీయ పురస్కారం.. నరేంద్రుడికి దక్కిన 33వ అంతర్జాతీయ గౌరవం! | | ACTPnews

ప్రధాని మోదీ


Last Updated:

స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో జరిగిన ఒక ప్రత్యేక అధికారిక కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని ఈ పురస్కారాన్ని మోదీకి ప్రదానం చేశారు. ప్రధాని మోదీకి ఒక విదేశీ ప్రభుత్వం నుండి ఇటువంటి అత్యున్నత పురస్కారం దక్కడం ఇది 33వ సారి కావడం విశేషం.

ప్రధాని మోదీ
ప్రధాని మోదీ

PM Modi: యూరప్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. స్లోవేకియా దేశపు అత్యున్నత జాతీయ పురస్కారమైన ‘ది ఆర్డర్ ఆఫ్ ద వైట్ డబుల్ క్రాస్’ (ఫస్ట్ క్లాస్) అవార్డు సోమవారం ప్రధాని మోదీకి లభించింది. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో జరిగిన ఒక ప్రత్యేక అధికారిక కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని ఈ పురస్కారాన్ని మోదీకి ప్రదానం చేశారు. ప్రధాని మోదీకి ఒక విదేశీ ప్రభుత్వం నుండి ఇటువంటి అత్యున్నత పురస్కారం దక్కడం ఇది 33వ సారి కావడం విశేషం.

ఈ పురస్కారం 140 కోట్ల మంది భారతీయులది: ప్రధాని మోదీ

అవార్డు అందుకున్న అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ (X) ద్వారా తన సంతోషాన్ని పంచుకున్నారు. “ఈ సాయంత్రం బ్రాటిస్లావాలో ‘ది ఆర్డర్ ఆఫ్ ద వైట్ డబుల్ క్రాస్’ (ఫస్ట్ క్లాస్) పురస్కారాన్ని అందుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఈ గౌరవాన్ని అందించిన స్లోవేకియా ప్రజలకు, ప్రభుత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ అవార్డు 140 కోట్ల మంది భారత ప్రజలకు దక్కిన గౌరవం. దీనిని భారత్-స్లోవేకియా దేశాల మధ్య ఉన్న చిరకాల స్నేహానికి అంకితం చేస్తున్నాను” అని మోదీ పేర్కొన్నారు.

రెండు దేశాల ప్రజల మధ్య ఉన్న నమ్మకం, ఆప్యాయతలకు ఈ అవార్డే నిదర్శనమని, ఈ గౌరవం రాబోయే తరాలకు ఇరు దేశాల ప్రత్యేక బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు స్ఫూర్తినిస్తుందని మోదీ ఆకాంక్షించినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఒక ప్రకటనలో తెలిపింది.

‘ఆర్డర్ ఆఫ్ ద వైట్ డబుల్ క్రాస్’ అంటే ఏమిటి?

ఇది స్లోవేకియా రిపబ్లిక్ అందించే అత్యున్నత పౌర పురస్కారం. స్లోవేకియా దేశంతో స్నేహపూర్వక సంబంధాల అభివృద్ధికి విశేష కృషి చేసిన, అలాగే ఆ దేశ విదేశాంగ విధాన ప్రయోజనాలకు, అంతర్జాతీయ ప్రతిష్టకు అసాధారణ మద్దతును అందించిన విదేశీ ప్రముఖులకు, పాలకులకు మాత్రమే స్లోవేకియా అధ్యక్షుడు ఈ అవార్డును ప్రదానం చేస్తారు.

చారిత్రాత్మక పర్యటన.. 11 కీలక ఒప్పందాలు

వారాల తరబడి సాగే తన ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ప్రస్తుతం స్లోవేకియాలో ఉన్నారు. స్లోవేకియా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆ దేశాన్ని సందర్శించిన తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీ కావడం గమనార్హం. అధ్యక్ష భవనానికి చేరుకున్న ప్రధాని మోదీకి అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని ఘనస్వాగతం పలికారు. అక్కడ మోదీ సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు.

ఆ తర్వాత ఇరు దేశాల అధినేతల మధ్య ప్రతినిధి స్థాయి చర్చలు జరిగాయి. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ.. వలసలు (Migration), డిజిటల్ టెక్నాలజీ, మరియు రక్షణ రంగాలతో పాటు పలు కీలక రంగాలలో సహకారాన్ని విస్తరించేందుకు గానూ 11 కీలక ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.

ఈ ద్వైపాక్షిక చర్చల్లో భారత ప్రతినిధి బృందం తరఫున విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి, విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి (పశ్చిమ) సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పూజా కపూర్ పాల్గొన్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed