PM Modi: భారత్‌ సెమికాన్ 2.0కు గ్రీన్ సిగ్నల్.. యువతకు భారీ ఉద్యోగాలపై మోదీ సర్కార్ ఫోకస్ | | ACTPnews

PM Modi: భారత్‌ సెమికాన్ 2.0కు గ్రీన్ సిగ్నల్.. యువతకు భారీ ఉద్యోగాలపై మోదీ సర్కార్ ఫోకస్ |


కేబినెట్ సమావేశంలో వారణాసిలో గంగా-వరుణ ఎలివేటెడ్ కారిడార్‌తో పాటు పలు కీలక ప్రాజెక్టులకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. వీటిలో అత్యంత ప్రాధాన్యం పొందింది సెమికాన్ 2.0 పథకమే. ఈ పథకంపై సుమారు రూ.1.27 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నారు. దీని ద్వారా భారత్‌ను ప్రపంచంలోనే ప్రముఖ సెమికండక్టర్ డిజైన్, తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, టెలికాం, రక్షణ, ఏరోస్పేస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి కీలక రంగాలకు మరింత బలం చేకూరనుంది.

సెమికండక్టర్ రంగంలో కొత్త తరం చిప్ డిజైన్ టెక్నాలజీ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించనుంది. ప్రస్తుతం దేశంలో 105 స్టార్టప్‌లు, MSME సంస్థలు చిప్ డిజైన్ రంగంలో పనిచేస్తుండగా, కొత్త పథకం ద్వారా వీటికి ఆధునిక డిజైన్ టూల్స్, సాంకేతిక సహాయం, పరిశోధనకు మద్దతు అందించనున్నారు. అంతేకాకుండా దేశీయ, అంతర్జాతీయ పరిశోధనా సంస్థలతో కలిసి మరింత ఆధునిక చిప్ టెక్నాలజీల అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నారు.

వ్యవసాయ రంగాన్ని దృష్టిలో ఉంచుకుని 2031 నాటికి కొత్త యూరియా ప్లాంట్ల స్థాపనకు ప్రోత్సాహం అందించే కొత్త పెట్టుబడి విధానాన్ని కూడా కేబినెట్ ఆమోదించింది. యూరియా సబ్సిడీ పథకాన్ని కొనసాగించడంతో పాటు, ఇప్పటికే ఉన్న యూరియా ప్లాంట్లకు కొత్త ఇంధన సామర్థ్య ప్రమాణాలను అమలు చేయనున్నారు. నాఫ్తా ఆధారిత యూరియా ప్లాంట్లను గ్యాస్ ఆధారిత వ్యవస్థలకు మార్చే నిర్ణయం కూడా తీసుకున్నారు. దీంతో తక్కువ వ్యయంతో, అధిక సామర్థ్యంతో యూరియా ఉత్పత్తి సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

మొబైల్ ఫోన్ తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు PLI 2.0 పథకానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా ప్రపంచ స్థాయి మొబైల్ తయారీ కేంద్రంగా భారత్‌ను మరింత బలపరచడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, కొత్త పరిశ్రమలు నెలకొల్పడం, ఉపాధి అవకాశాలను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

సెమికండక్టర్ తయారీకి అవసరమైన సిలికాన్ ఫ్యాబ్‌లు, కాంపౌండ్ సెమికండక్టర్ ఫ్యాబ్‌లు, డిస్‌ప్లే ఫ్యాబ్‌లు, ATMP, OSAT యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం ఇవ్వనున్నారు. అలాగే చిప్ తయారీలో ఉపయోగించే యంత్రాలు, రసాయనాలు, గ్యాస్‌లు, ఇతర కీలక ముడిసరుకుల దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకోనున్నారు. ప్రభుత్వం అంచనా ప్రకారం దేశంలోని మొదటి సెమికండక్టర్ ఫ్యాబ్ 2028 నాటికి ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉంది.

ఈ రంగానికి అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటివరకు 315 విశ్వవిద్యాలయాల్లో సుమారు 68 వేల మంది విద్యార్థులకు చిప్ డిజైన్ శిక్షణ అందించారు. ఇకపై ఫ్యాబ్‌లు, క్లీన్‌రూమ్‌లు, చిప్ తయారీకి సంబంధించిన ఇతర విభాగాల్లో కూడా శిక్షణను విస్తరించనున్నారు. దీంతో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, సెమికాన్ 1.0 కింద ఇప్పటివరకు 12 తయారీ ప్రాజెక్టులకు ఆమోదం లభించగా, వాటిలో రూ.1.64 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. మైక్రాన్, కేన్స్, సీజీ సెమీ వంటి సంస్థలు ఇప్పటికే వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించగా, మరో యూనిట్ 2026లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అదనంగా 24 స్టార్టప్‌లు, MSMEలకు ఆర్థిక సహాయం అందించగా, 105 సంస్థలకు ఆధునిక చిప్ డిజైన్ టూల్స్ అందించారు.

ఈ నిర్ణయాల ద్వారా భారత్‌ను సెమికండక్టర్ డిజైన్, తయారీ రంగంలో ప్రపంచ స్థాయిలో పోటీ చేసే దేశంగా తీర్చిదిద్దడం, సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, హైటెక్ తయారీ రంగాన్ని వేగవంతం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది. దీంతో రాబోయే సంవత్సరాల్లో పెట్టుబడులు, ఉత్పత్తి సామర్థ్యం, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *