Last Updated:
విధానాల రూపకల్పనలో యువత, విశ్వవిద్యాలయాల భాగస్వామ్యం పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీ అధికారులకు సూచించారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో భవిష్యత్ భారత్ నిర్మాణంపై ఆయన కీలక దిశానిర్దేశం చేశారు.
ఢిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్‌లో ఉన్న తన అధికారిక నివాసంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో మూడవ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మౌలిక సదుపాయాలు, భద్రత, విదేశీ వ్యవహారాలు, పాలనకు సంబంధించిన పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. విధానాల రూపకల్పనలో ఎప్పటికప్పుడు సరికొత్త కోణాలు ఆవిష్కృతం కావాలంటే ప్రభుత్వ విభాగాలు, యూనివర్సిటీలు, యువత మధ్య మరింత సమన్వయం పెరగాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. యువతతో మమేకం అవ్వడం వల్ల వినూత్నమైన ఆలోచనలు పుట్టుకొస్తాయని ఆయన ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.














