జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే ఉద్యమం భారత నిఘా వర్గాల కళ్ల ముందే బలపడింది. అప్పట్లో అకాలీదళ్ పార్టీని దెబ్బతీయడానికి కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఆయన్ను ఒక సాధనంగా వాడుకున్నారు. 1982 జూలై నాటికి ఆయన స్వర్ణ దేవాలయ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించారు. ఆ ఏడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం ఆయన్ను అరెస్ట్ చేసినా, బలమైన సాక్ష్యాలు, నెట్వర్క్ లేకపోవడంతో రెండు రోజులకే విడుదల చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆలయం లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడంలో నిఘా విభాగాలు పూర్తిగా విఫలమయ్యాయి. కోర్టు మార్షల్ ఎదుర్కొన్న మాజీ మిలిటరీ అధికారి మేజర్ జనరల్ షాబేగ్ సింగ్ నేతృత్వంలో ఉగ్రవాదులు అకాల్ తఖ్త్‌ను ఒక బలమైన సైనిక కోటగా మార్చారు.
ఆలయం చుట్టూ ఉన్న పదిహేడు ఇళ్లను తమ ఆధీనంలోకి తీసుకుని వైర్లెస్ కమాండ్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నారు. ఆధునిక ఆయుధాలు, రాకెట్ లాంచర్లతో వారు సిద్ధమవుతున్నా నిఘా సంస్థలు ఆ సమాచారాన్ని సేకరించలేకపోయాయి. కమాండో శిక్షణ కోసం డూన్ వ్యాలీలో ఏర్పాటు చేసిన ఆలయ నమూనా ప్లాన్ కూడా ముందే లీక్ కావడం నాటి వ్యవస్థ బలహీనతను చూపిస్తుంది.
1984 జూన్ 5 రాత్రి 1వ పారా రెజిమెంట్ సైనికులు హర్మందిర్ సాహిబ్‌లోకి ప్రవేశించే ముందు తమ బూట్లను బయటే విప్పేశారు. ఒక పవిత్రమైన ప్రార్థనా స్థలంలో, గురు అర్జన్ దేవ్ అమరవీరుల దినోత్సవం రోజున వేలాది మంది సామాన్య భక్తులు లోపల చిక్కుకున్న సమయంలో ఈ ఆపరేషన్ నిర్వహించాల్సి రావడం సైన్యానికి పెద్ద సవాలుగా మారింది. లోపల ఉన్న రక్షణ ఏర్పాట్లను తక్కువగా అంచనా వేయడం వల్ల ప్రధాన ద్వారం గుండా లోపలికి వెళ్లిన సైనికులు ఉగ్రవాదుల వ్యూహాత్మక దాడులకు బలయ్యారు.
చివరికి అకాల్ తఖ్త్ భవనాన్ని బద్దలు కొట్టడానికి ట్యాంకులను రంగంలోకి దించాల్సి వచ్చింది. ప్రభుత్వ శ్వేతపత్రం ప్రకారం ఈ ఆపరేషన్ లో 554 మంది ఉగ్రవాదులు, పౌరులు మరణించారు. అకాల్ తఖ్త్ తీవ్రంగా దెబ్బతింది. దీని పరిణామాల వల్లే 1984 అక్టోబర్ 31న ప్రధాని ఇందిరా గాంధీ తన స్వంత సిక్కు బాడీగార్డుల చేతిలోనే హత్యకు గురయ్యారు. ఉగ్రవాది భింద్రన్‌వాలేను అంతమొందించాలనే సైనిక లక్ష్యం నెరవేరినా, దాని చుట్టూ ఉన్న వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది.
బ్లూ స్టార్ ఆపరేషన్ లోపాలను విశ్లేషించిన తర్వాత, భవిష్యత్తులో ఇలాంటి సున్నితమైన ప్రాంతాల్లో ఉగ్రవాద నిర్మూలన కోసం 1984 అక్టోబర్ 16న నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (NSG) విభాగాన్ని ఏర్పాటు చేశారు. బ్రిటన్ సాస్ (SAS), జర్మనీ జిఎస్జి-9 (GSG-9) నమూనాలో దీనికి చట్టబద్ధత కల్పించారు. అలాగే జమ్మూ కాశ్మీర్లో సుదీర్ఘ కాలం ఉంటూ స్థానిక నిఘా నెట్వర్క్ నిర్మించడం కోసం 1990లో రాష్ట్రీయ రైఫిల్స్ (RR) విభాగాన్ని తీసుకొచ్చారు.
ఈ మార్పుల వల్ల పంజాబ్, కాశ్మీర్ లలో ఉగ్రవాదంపై పట్టు సాధించడం సాధ్యమైంది. 2014 నాటికి దేశ రక్షణ వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. పంజాబ్ ఉగ్రవాద రోజుల్లో ఐబీ ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేసిన అజిత్ దోవల్‌ను ప్రధాని మోదీ జాతీయ భద్రతా సలహాదారు (NSA)గా నియమించారు. పుస్తకాల్లో చదవడం కంటే మైదానంలో నిఘా వైఫల్యాలు ఎలా ఉంటాయో చూసిన అనుభవం ఆయనకు ఉండటం దేశ రక్షణ విధానానికి ఒక బలమైన పునాదిగా మారింది.
గత ప్రభుత్వాలు రక్షణ సామర్థ్యాలను పెంచితే, మోదీ ప్రభుత్వం ఆ సామర్థ్యాలను శత్రువులపై ముందస్తు దాడులు చేయడానికి ఉపయోగించింది. 2016 సెప్టెంబర్‌లో ఉరీ సైనిక స్థావరంపై జరిగిన దాడికి ప్రతికారంగా పారా స్పెషల్ ఫోర్సెస్ నియంత్రణ రేఖ దాటి వెళ్లి నాలుగు ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేశాయి. గతంలో ఇలాంటి దాడులు రహస్యంగా జరిగేవి, కానీ మోదీ ప్రభుత్వం మొదటిసారి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించి రక్షణ విధానాన్ని మార్చింది.
ఆ తర్వాత 2019 బాలకోట్ వైమానిక దాడుల ద్వారా పాకిస్తాన్ లోపలికి వెళ్లి జైషే మహమ్మద్ శిబిరాలను ధ్వంసం చేశారు. ఇక 2025 మే నెలలో జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ దీనికి పరాకాష్ట. పహల్గామ్ లో 26 మంది పౌరుల మరణానికి కారణమైన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ స్థావరాలపై కేవలం ముప్పై నిమిషాల్లో ముందస్తు దాడులు జరిపారు. పాక్ సైనిక ఆస్తులకు నష్టం కలిగించకుండా కేవలం ఉగ్రవాదులనే టార్గెట్ చేయడం, దాడి జరిగిన వెంటనే అంతర్జాతీయంగా ప్రచార లబ్ధి పొందడం ఈ సరికొత్త రక్షణ సిద్ధాంతానికి నిదర్శనం.
ఇంతటి బలమైన రక్షణ వ్యూహాలు ఉన్నప్పటికీ రక్షణ వ్యవస్థలో ఇంకా కొన్ని లోపాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి బుర్హాన్ వాని ఉదంతం, పహల్గామ్ దాడులే ఉదాహరణ. 2015 నుండి బుర్హాన్ వాని సోషల్ మీడియా ద్వారా కాశ్మీర్ యువతను బహిరంగంగానే ఉగ్రవాదం వైపు ఆకర్షించినా, ఆ ముప్పును ముందే అడ్డుకోవడంలో వ్యవస్థ విఫలమైంది. 2016లో ఆయన మరణం తర్వాత కాశ్మీర్ లో నెలల తరబడి కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది, ఎందరో ప్రాణాలు కోల్పోయారు.
అలాగే 2025 ఏప్రిల్ లో పహల్గామ్ పర్యాటకులపై జరిగిన దాడి కూడా నిఘా లోపాన్ని చూపిస్తోంది. కాశ్మీర్ లోకి ఉగ్రవాదులు వస్తున్నారనే సమాచారం ఉన్నా దాన్ని అడ్డుకోలేకపోయారు. నిఘా సమాచారమే రక్షణకు ప్రధాన మూలమని 1984 బ్లూ స్టార్ ఆపరేషన్ నేర్పిన పాఠం. నిరంతర నిఘా, అప్రమత్తత లోపిస్తే ఎంతటి రక్షణ సిద్ధాంతాలు ఉన్నా మళ్లీ పాత లోపాలు పునరావృతమవుతాయని ఈ పరిణామాలు హెచ్చరిస్తున్నాయి.












