Last Updated:
PM Modi: తమిళనాడు పట్టణ రవాణా రంగంలో సరికొత్త మైలురాయి ఆవిష్కృతం కానుంది. చెన్నై మెట్రో రైల్ ఫేజ్ 2 నెట్‌వర్క్‌లోని తొలి మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం (అక్టోబర్ 11) లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌తో కలిసి ప్రధాని మోదీ మెట్రో రైలులో ప్రయాణించనున్నారు. ఈ ప్రాజెక్టు కింద పూనమల్లి నుంచి వడపళని వరకు గల 15 కిలోమీటర్ల మేర తొలి మార్గాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ, సీఎం విజయ్ కలిసి పూనమల్లి నుంచి పోరూర్ బైపాస్ వరకు మెట్రోలో ప్రయాణించనున్నారు. ఉదయం 11:30 గంటల ప్రాంతంలో జెండా ఊపి ఈ సేవలను ప్రారంభించనుండగా, అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఐఐటీ మద్రాస్‌లో జరిగే కార్యక్రమంలో మెట్రో ఫేజ్ 2తో పాటు పలు ఇతర అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేస్తారు. ఈ కార్యక్రమాలు ముగిసిన తర్వాత, సాయంత్రం 4 గంటల నుంచి సామాన్య ప్రయాణికులకు ఈ మార్గంలో సేవలు అందుబాటులోకి వస్తాయి.
ప్రస్తుతం ఫేజ్ 1లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రైళ్లు నడుస్తుండగా, కొత్తగా ప్రారంభమయ్యే పూనమల్లి-వడపళని మార్గంలో ప్రారంభ దశలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే సేవలు అందిస్తారు. ఈ మార్గంలో చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (CMRL) ప్రాథమికంగా 15 రైళ్లను నడపనుంది. రద్దీ సమయాల్లో (పీక్ అవర్స్) ప్రతి 10 నిమిషాలకు ఒక రైలు, సాధారణ సమయాల్లో (నాన్-పీక్ అవర్స్) ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు నడుస్తాయి ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు; సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు.
ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు; ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు; రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు. పోరూర్ జంక్షన్ నుంచి వడపళని మధ్య గల ఆరు స్టేషన్లలో—ఆలపాక్కం, కారంబాక్కం, వలసరవాక్కం, ఆళ్వార్ తిరునగర్, సాలిగ్రామం వేర్‌హౌస్, సాలిగ్రామంలలో నిర్మాణ పనులు కొనసాగుతున్నందున రైళ్ల రాకపోకల వేళలను ప్రస్తుతానికి పరిమితం చేశారు. ఈ స్టేషన్ల పనులు పూర్తయిన తర్వాత రైళ్ల ఫ్రీక్వెన్సీ మరింత పెరగనుంది.
మొత్తం 118.9 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఫేజ్ 2 ప్రాజెక్టు పనులు దాదాపు ఆరేళ్ల క్రితం ప్రారంభమయ్యాయి. జనవరి 2019లో తమిళనాడు ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. నవంబర్ 2020లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా శంకుస్థాపన చేయగా, జూలై 2021లో ఆర్కాట్ రోడ్డు వెంట ఎలివేటెడ్ పనులు ప్రారంభమయ్యాయి.
అక్టోబర్ 2024లో కేంద్ర కేబినెట్ చెన్నై మెట్రో ఫేజ్ 2కు పూర్తి ఆమోదం తెలపగా, అదే సమయంలో పూనమల్లి డిపోకు తొలి డ్రైవర్‌లెస్ మెట్రో రైలు చేరుకుంది. మార్చి 2025లో వయాడక్ట్ నిర్మాణం పూర్తవగా, ఏప్రిల్ 2025లో ట్రయల్ రన్స్ చేపట్టారు. డిసెంబర్ 2025లో రైల్వే బోర్డు సిగ్నలింగ్ వ్యవస్థకు అనుమతి మంజూరు చేసింది. జనవరి 2026లో పోరూర్ నుంచి వడపళని వరకు ట్రయల్ రన్ పూర్తి చేశారు. ఫిబ్రవరి 2026లో కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ పరిశీలన అనంతరం షరతులతో కూడిన అనుమతి ఇవ్వగా, మే 2026లో పూర్తిస్థాయి ఆపరేషన్లకు తుది అనుమతులు లభించాయి. అన్ని అనుమతులు పూర్తి చేసుకుని నేడు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.












