Last Updated:
PM Modi: జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించిన సరికొత్త సంస్కరణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
అరెస్ట్ నిబంధనల తొలగింపు, పెద్దఎత్తున డీక్రిమినలైజేషన్, ప్రక్రియలను సరళతరం చేయడం వంటి మార్పులు వ్యవస్థపై “ఎంతో సానుకూల ప్రభావం” చూపుతాయని ఆయన పేర్కొన్నారు. అక్టోబర్ 8, 2026న న్యూఢిల్లీలో జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ సంస్కరణలకు ఆమోదం లభించింది. జీఎస్టీ ఎన్ఫోర్స్మెంట్, ప్రాసిక్యూషన్, జరిమానాలు, నోటీసులు, వ్యాజ్యాలకు సంబంధించిన పలు కీలక నిబంధనల్లో మార్పులు చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. “జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించిన కొత్త విడత సంస్కరణలను నేను స్వాగతిస్తున్నాను” అని తెలిపారు. కౌన్సిల్ చేసిన సిఫార్సులైన అరెస్ట్ నిబంధనల రద్దు, నిబంధనల సరళీకరణ వ్యాపార వర్గాలకు మేలు చేస్తాయని అన్నారు. “వేగవంతమైన నిర్ణయాలు”, “తగ్గిన నిబంధనల భారం (కంప్లయన్స్ కాస్ట్స్)”, “ఆటోమేటెడ్ రీఫండ్లు”, “విశ్వాస ఆధారిత పాలన”లపైనే ఈ సంస్కరణలు ప్రధానంగా దృష్టి సారించాయని వివరించారు. జీఎస్టీని మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా, ప్రజానుకూలంగా మార్చేందుకు తాము చేస్తున్న నిరంతర ప్రయత్నాలకు ఇవి అనుగుణంగా ఉన్నాయని చెప్పారు. ఈ సంస్కరణలు రిజిస్ట్రేషన్, రిటర్న్‌లు, రీఫండ్లు, వివాదాల పరిష్కారం, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC), రవాణాలో ఉన్న సరుకులు, ఎగుమతులతో సహా విస్తృత ప్రక్రియలలో మార్పులను కలిగి ఉన్నాయి.
జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత కీలకమైనది జీఎస్టీ కింద ఉన్న అరెస్ట్ అధికారాలను రద్దు చేయాలని ప్రతిపాదించడం. అలాగే ప్రాసిక్యూషన్ పరిమితిని రూ.1 కోటి నుంచి రూ.5 కోట్లకు పెంచనున్నారు. కనీస శిక్ష నిబంధనను తొలగించి, జరిమానా, జైలు శిక్ష లేదా రెండింటికి సంబంధించిన నిర్ణయాన్ని న్యాయస్థానాల విచక్షణకే వదిలివేయనున్నారు. నిర్దిష్ట జరిమానా వర్తించని కేసుల్లో విధించే సాధారణ పెనాల్టీని రూ.25,000 నుంచి రూ.10,000కు తగ్గించనున్నారు. ఆలస్యంగా ఫైల్ చేసేవారు, పొరపాట్లు చేసేవారు లేదా చెల్లింపుల్లో వెనుకబడిన పన్ను చెల్లింపుదారులు పన్ను రికవరీ, వడ్డీ, దామాషా ప్రకారం జరిమానా మాత్రమే ఎదుర్కొంటారని, అంతకుమించి అదనపు కఠిన చర్యలు ఉండవని కౌన్సిల్ స్పష్టం చేసింది.
జీఎస్టీ వ్యవస్థ ఇప్పుడు విక్రేత, కొనుగోలుదారుల ఇన్వాయిస్లను సరిపోల్చగలదని, నకిలీ క్రెడిట్‌ను వెంటనే గుర్తించగలదని కౌన్సిల్ తెలిపింది. చట్టం రూపొందించిన సమయంలో ఈ సాంకేతికత లేదని, ఇప్పుడు భయపెట్టడం కంటే సాంకేతిక ఆధారిత గుర్తింపు ద్వారానే ఎన్ఫోర్స్మెంట్ సాధ్యమవుతుందని పేర్కొంది.
జీఎస్టీ వివాదాలకు ఉమ్మడి ప్రమాణాన్ని కౌన్సిల్ ప్రతిపాదించింది. రూ.10,000 కంటే తక్కువ మొత్తం ఉన్న లావాదేవీలకు సంబంధించి ఇకపై ఎలాంటి నోటీసులు జారీ చేయరు.
సరైన ఇన్వాయిస్ కలిగి ఉండి, సరుకును పొంది, సరఫరాదారునికి పూర్తి చెల్లింపు చేసిన నిజాయితీ గల కొనుగోలుదారులను కాపాడే అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్ పరిశీలిస్తోంది. అధికారుల కమిటీ మూడు నెలల్లో దీనిపై అధ్యయనం చేసి, తదుపరి సమావేశంలో నివేదిక సమర్పించనుంది. రోజువారీ లావాదేవీలను సులభతరం చేస్తూ, వ్యాపార వ్యయాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ సంస్కరణలు అమల్లోకి రానున్నాయి.














