Last Updated:
దేశంలోని 10 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 24 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుండి నాలుగు స్థానాలు ఇందులో ఉండగా, ప్రముఖ జాతీయ నేతలు ఈ విడతలోనే పదవీ విరమణ చేయనున్నారు.
దేశంలోని 10 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 24 రాజ్యసభ స్థానాలకు జూన్ 18వ తేదీన ద్వైవార్షిక ఎన్నికలు నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం (ECI) శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. జూన్, జూలై నెలల్లో పదవీకాలం ముగిసి రిటైర్ కానున్న సభ్యుల స్థానాలను భర్తీ చేయడానికి ఈ ప్రక్రియ చేపడుతున్నారు. ఈ ఎన్నికల నోటిఫికేషన్ జూన్ 1న వెలువడనుండగా, నామినేషన్ల దాఖలుకు జూన్ 8 చివరి తేదీగా నిర్ణయించారు. జూన్ 9న నామినేషన్ల పరిశీలన, జూన్ 11 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. జూన్ 18 ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
జూన్ 20 నాటికి ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగియనుంది. ఓటింగ్ సమయంలో రిటర్నింగ్ అధికారి సరఫరా చేసే ప్రత్యేక వైలెట్ రంగు స్కెచ్ పెన్నులను మాత్రమే ప్రాధాన్యతలను గుర్తించడానికి ఉపయోగించాలని, ఇతర పెన్నులు వాడితే ఓటు చెల్లదని స్పష్టం చేశారు. మల్లికార్జున ఖర్గే, హెచ్.డి. దేవెగౌడ, దిగ్విజయ్ సింగ్ లాంటి ప్రముఖ నేతలు ఈ విడతలో రిటైర్ అవుతున్న వారిలో ఉన్నారు.
ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుండి నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఏపీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వానీల పదవీకాలం జూన్ 21తో ముగియనుండటంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుతమున్న బలాల ఆధారంగా ఈ స్థానాల భర్తీ జరగనుంది.
మిగిలిన స్థానాల్లో గుజరాత్, కర్ణాటకల నుండి చెరో నాలుగు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుండి మూడు చొప్పున, జార్ఖండ్ నుండి రెండు స్థానాలకు పోలింగ్ జరగనుంది. మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల నుండి ఒక్కో స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడానికి ప్రత్యేక పరిశీలకులను రంగంలోకి దించుతున్నట్లు ఈసీ వెల్లడించింది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
May 22, 2026 11:16 AM IST













