Last Updated:
ఇప్పటివరకు వెండితెరపై నటుడిగా, గాయకుడిగా, గేయ రచయితగా సత్తా చాటిన రామ్, ఇప్పుడు మెగాఫోన్ పట్టి దర్శకుడిగా కొత్త అవతారం ఎత్తుతున్నారు. ఆ వివరాలు చూద్దామా..
టాలీవుడ్ ‘ఎనర్జిటిక్ స్టార్’ రామ్ పోతినేని తన పుట్టినరోజున అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. ఇప్పటివరకు వెండితెరపై నటుడిగా, గాయకుడిగా, గేయ రచయితగా సత్తా చాటిన రామ్, ఇప్పుడు మెగాఫోన్ పట్టి దర్శకుడిగా కొత్త అవతారం ఎత్తుతున్నారు. ఆయన కెరీర్లో 23వ చిత్రంగా (RAPO23) రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌కు ఆయనే స్వయంగా దర్శకత్వం వహిస్తుండటం విశేషం.
ఒంటరి తోడేలు కథ: ఈ సినిమాను ఒక పవర్ఫుల్ ‘సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్’గా రూపొందిస్తున్నారు. ఇందులో రామ్ ‘వీర’ అనే విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్లో రామ్ లెదర్ జాకెట్ ధరించి, వెనక వైపు నుంచి స్టైలిష్‌గా కనిపిస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. “ఒంటరి తోడేలు కథ” (A Lone Wolf’s Tale) అనే ట్యాగ్‌లైన్ ఈ సినిమా ఇంటెన్సిటీని తెలియజేస్తోంది. ఈ కథను కూడా రామ్ స్వయంగా సిద్ధం చేసుకోవడం ఆయన సృజనాత్మకతకు నిదర్శనం.
భారతీయ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలు మెగాఫోన్ పట్టడం ఒక ఆసక్తికరమైన ట్రెండ్‌గా మారుతోంది. గతంలో తెలుగులో పవన్ కళ్యాణ్ (జానీ), విశ్వక్ సేన్ (ఫలక్‌నుమా దాస్), అడివి శేష్ (కర్మ) వంటి వారు తమ సినిమాలకు తామే దర్శకత్వం వహించి ప్రయోగాలు చేశారు. కోలీవుడ్‌లో ధనుష్ కూడా ‘పా పాండి’, ‘రాయన్’ వంటి చిత్రాలతో దర్శకుడిగా సత్తా చాటారు. ఇప్పుడు రామ్ పోతినేని కూడా ఈ జాబితాలో చేరి, తన విజన్‌ను వెండితెరపై ఎలా ఆవిష్కరిస్తారోనని ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
ఈ చిత్రాన్ని ‘రాపో సినిమాటిక్స్’ (RaPO Cinematics) బ్యానర్‌పై కృష్ణ పోతినేని నిర్మిస్తున్నారు. జూన్ నెలలో ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి, ఈ ఏడాది డిసెంబర్లో సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. రామ్ పోతినేని గత రెండు దశాబ్దాలుగా ‘దేవదాసు’ నుంచి ‘ఇస్మార్ట్ శంకర్’ వరకు ఎన్నో విభిన్న పాత్రలతో మెప్పించారు. ఇప్పుడు డైరెక్టర్‌గా ఆయన ప్రయాణం ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana
May 15, 2026 12:50 PM IST













