Last Updated:
Tirupati: విషం చిమ్మే పాములు, రక్తం తాగే క్రూరమృగాలు కూడా చేయనంత దారుణాలకు ఒడిగడుతున్నారు కొందరు మానవ మృగాలు. తండ్రి వయసున్న ఓ కామాంధుడు కన్నబిడ్డ వరసయ్యే బాలికపై తన కామవాంఛ తీర్చుకున్నాడు.
Tirupati: విషం చిమ్మే పాములు, రక్తం తాగే క్రూరమృగాలు కూడా చేయనంత దారుణాలకు ఒడిగడుతున్నారు కొందరు మానవ మృగాలు. తండ్రి వయసున్న ఓ కామాంధుడు కన్నబిడ్డ వరసయ్యే బాలికపై తన కామవాంఛ తీర్చుకున్నాడు. వేసవి సెలవులకు ఇంటికొచ్చిన అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి, భయపెట్టి తన మృగత్వాన్ని ప్రదర్శించాడు. మనిషిగా పుట్టి పశువులు కూడా చేయనంత దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి అరాచకాన్ని బయటపెట్టడంతో అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు హైదరాబాద్ పోలీసులు. బాబాయ్ అంటూ ఆప్యాయంగా పలకరించే అమ్మాయిని ప్రైవేట్ ఫోటోలు చూపించి బ్లాక్ మెయిల్ చేసిన కామోన్మాది నిజస్వరూపం బయటపడటంతో ప్రజాసంఘాలు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. నిందితుడు తిరుపతికి చెందిన వ్యక్తి కావడం మరో విశేషం.
పవిత్రమైన తిరుపతి పట్టణంలో ఓ కామోన్మాది సొంత బంధువుపైనే అరాచకానికి పాల్పడ్డాడు. హైదరాబాద్లో నివాసముంటున్న సాయిలక్ష్మి, రమేష్ దంపతుల 16 ఏళ్ల కుమార్తె ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తయ్యాక వేసవి సెలవుల కోసం తిరుపతిలో నివసిస్తున్న తన మేనత్త మానస ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో బాలికకు బంధువైన రామమూర్తి ఆమెకు సంబంధించిన కొన్ని నగ్న ఫొటోలు తన సెల్ఫోన్లో ఉన్నాయని చెప్పి బ్లాక్మెయిల్ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేసి తనతో అక్రమ సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడు. అదే అవకాశంగా మార్చుకొని మైనర్ బాలికను బెదిరించి పలుమార్లు లైంగికంగా వేధించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలిక నుంచి సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా కేసు వెలుగులోకి వచ్చింది.
తిరుపతి జిఎస్టి ఆఫీసులో పనిచేస్తున్న నిందితుడు రామమూర్తికి బాధితురాలు స్వయాన బాబాయి అవుతాడు. ఈ ఘటనపై హైదరాబాద్లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో తొలుత ఫిర్యాదు నమోదైంది. అనంతరం కేసును తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. ఈ మేరకు పోలీసులు పోక్సో కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నిందితుడు రామమూర్తి పరారీలో ఉన్నాడని, అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు తెలిపారు. త్వరలోనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు.
తిరుపతిలో మైనర్ బాలికపై బంధువే అఘాయిత్యానికి పాల్పడిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. నగ్న ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరించి బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిపై తిరుపతి ఈస్ట్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా, త్వరలోనే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తామని పోలీసులు తెలిపారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు మైనర్ బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు ఈ కేసును అత్యంత ప్రాధాన్యంతో దర్యాప్తు చేస్తున్నారు. మైనర్ బాలికలను ఇతర ప్రాంతాలకు పంపేటప్పుడు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, పిల్లల భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
Hyderabad,Telangana
May 15, 2026 12:25 PM IST













