Shobha Reddy: గెస్ట్‌హౌస్‌కు రమ్మని వేధించాడు.. సీఎం సన్నిహితుడిపై మహిళా పారిశ్రామికవేత్త సంచలన కామెంట్స్! | తెలంగాణ వార్తలు | ACTPnews

ప్రతీకాత్మక చిత్రం


Last Updated:

Shobha Reddy: తెలంగాణ మున్సిపల్ శాఖలోని వ్యవహారాలు, ఓ కాంగ్రెస్ కీలక నేత తీరుపై మిధునా యాడ్స్ అధినేత కె. శోభారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

తన వ్యాపార సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే క్రమంలో ముఖ్యమంత్రికి సన్నిహితుడిగా భావించిన ఓ నేతను సంప్రదిస్తే, మాట్లాడేందుకు గెస్ట్‌హౌస్‌కు రావాలంటూ తనను తీవ్ర వేధింపులకు గురిచేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడంతో పాటు, తీవ్ర భావోద్వేగానికి లోనవుతూ ఓ వీడియోను కూడా విడుదల చేశారు.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గనుక తనకు ఒక్కసారి అపాయింట్‌మెంట్ కేటాయిస్తే, మున్సిపల్ శాఖలో జరుగుతున్న అక్రమాలు, భారీ అవినీతి బాగోతాన్ని అన్ని ఆధారాలతో సహా ఆయన ముందు ఉంచుతానని శోభారెడ్డి స్పష్టం చేశారు. అలాగే తనను గెస్ట్‌హౌస్‌కు పిలిచి ఇబ్బంది పెట్టిన ఆ వ్యక్తి ఎవరనే విషయాన్ని కూడా బహిరంగంగా కాకుండా, స్వయంగా ముఖ్యమంత్రికే ముఖాముఖి వివరిస్తానని తేల్చిచెప్పారు. బహిరంగ వేదికలపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం, పేర్లు బయటపెట్టడం తన ఉద్దేశం కాదని ఆమె స్పష్టతనిచ్చారు.

ఔట్‌డోర్ అడ్వర్టైజింగ్ రంగంలో గత మూడేళ్లుగా చట్టబద్ధంగా వ్యాపారం చేసుకునేందుకు అవకాశం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ తనకు తీవ్ర అన్యాయం జరుగుతోందని శోభారెడ్డి వాపోయారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో రెగ్యులర్ టెండర్లు పిలిచే వరకు రెవెన్యూ షేరింగ్ విధానంలో తమలాంటి వారికి తాత్కాలిక అవకాశం కల్పించాలని సర్కారుకు దరఖాస్తులు, ప్రతిపాదనలు సమర్పించినా ఎలాంటి స్పందనా రాలేదన్నారు. నిబంధనల ఉల్లంఘనలపై నోటీసులు అందుకున్న పలు ప్రకటనల నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని, మరికొన్ని పైలట్ ప్రాజెక్టులకు మాత్రం జీవో నంబర్ 68 కింద ప్రత్యేక మినహాయింపులు, సడలింపులు ఇచ్చారని ఆమె ఆరోపించారు. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే ప్రతిపాదనలు ఇస్తున్నా పట్టించుకోకుండా కొందరికే లాభం చేకూరుస్తున్నారని పేర్కొన్నారు.

నా వెనుక ఏ పార్టీ లేదు..

తాను విడుదల చేసిన వీడియోలో శోభారెడ్డి కన్నీరుమున్నీరవుతూ పలు విషయాలను పంచుకున్నారు. “నా వెనుక ఏ రాజకీయ పార్టీ లేదు. ఒక కాంగ్రెస్ నాయకుడి కారణంగా నేను ఇబ్బంది పడిన మాట వాస్తవమే. అడ్వర్టైజింగ్ కాంట్రాక్టు విషయంలో కాంగ్రెస్ నేతలు ఫయీం ఖురేషి, రోహిన్ రెడ్డిలను అన్నా అని పిలుచుకుంటూ వెళ్లి సాయం కోరాను. వాళ్లు కచ్చితంగా న్యాయం చేస్తామని నమ్మబలికారు కానీ చివరికి ఏ సాయం చేయలేదు. ఆ పరిస్థితుల్లోనే తప్పనిసరి పరిస్థితుల్లో సీఎంకు అత్యంత సన్నిహితుడైన మరో నేత దగ్గరకు వెళ్లాల్సి వచ్చింది. కానీ అక్కడ ఎదురైన చేదు అనుభవం నన్ను తీవ్రంగా కలచివేసింది” అని తెలిపారు.

దుష్ప్రచారం చేయవద్దు.. న్యాయం కావాలి

తాను చాలా సాధారణ, పేద కుటుంబం నుంచి పైకి వచ్చానని, ముగ్గురు పిల్లల బాధ్యత తనపై ఉందని ఆమె తెలిపారు. సోషల్ మీడియాలో తనపై నిరాధారమైన అసత్య ప్రచారాలు చేయొద్దని వేడుకున్నారు. మహిళా పారిశ్రామికవేత్తగా తనకు ఎలాంటి అక్రమ లేదా ప్రత్యేక ప్రయోజనాలు అవసరం లేదని, కేవలం చట్టబద్ధమైన వ్యాపార అవకాశం, సమానమైన ఆదరణ, గౌరవం మాత్రమే కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌లకు ఆమె తన పోస్టును ట్యాగ్ చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో, పోస్టు వైరల్‌గా మారడంతో రాష్ట్ర ప్రభుత్వ నిఘా వర్గాలు కూడా దీనిపై ఆరా తీయడం ప్రారంభించాయి. ఈ క్రమంలో ప్రభుత్వం లేదా సీఎం కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed