Last Updated:
హర్యానాలోని ఫరీదాబాద్‌లో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్‌ను ముసుగు వేసుకున్న గుర్తుతెలియని దుండగుడు పట్టపగలే కత్తితో పొడిచి చంపాడు. పోలీస్ ఔట్‌పోస్టుకు కూతవేటు దూరంలోనే ఈ దారుణం జరగడం తీవ్ర కలకలం రేపుతోంది.
హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని సిక్రోనా గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న సంధ్య అనే మహిళా ఉపాధ్యాయురాలిని ఓ ముసుగు దుండగుడు అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. పాఠశాల లాబీలో ముందుగానే కాపు కాసిన ఆ కిరాతకుడు.. ఆమె లోపలికి అడుగుపెట్టగానే బలవంతంగా బయటకు లాక్కెళ్లి దాడికి తెగబడ్డాడు. పోలీస్ ఔట్‌పోస్టుకు కేవలం కొన్ని మీటర్ల దూరంలోనే పట్టపగలు ఈ దారుణ హత్య జరగడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఉదయం విధులకు హాజరయ్యేందుకు పాఠశాలకు చేరుకున్న వెంటనే ఈ ఘాతుకం చోటుచేసుకుంది.
స్కూల్ గేటు వద్దకు రాగానే నిందితుడు ఆమె మెడపై విచక్షణారహితంగా పలుమార్లు కత్తితో దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిన బాధితురాలు ప్రాణాలు విడిచింది. విద్యాబుద్ధులు నేర్పే బడిలోనే ఉపాధ్యాయురాలిని ఇంత క్రూరంగా చంపడం అందరినీ కలచివేస్తోంది. స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ భయానక దృశ్యాలు చూసి తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
Faridabad – A woman teacher was stabbed to death in broad daylight in Sikrona village of Faridabad, just a few metres from a police outpost. The victim worked as a teacher at a private school in the village, shortly after she arrived at the school, a masked man came looking for… pic.twitter.com/f9cS8vAS3x
— NextMinute News (@nextminutenews7) August 3, 2026
హఠాత్తుగా జరిగిన ఈ దాడితో పాఠశాల ప్రాంగణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బాధితురాలి అరుపులు విన్న తోటి ఉపాధ్యాయులు, సిబ్బంది వెంటనే ఆమెను రక్షించేందుకు పరుగులు తీశారు. అయితే వారిని గమనించిన హంతకుడు, వారిపై కూడా కత్తితో దాడి చేసేందుకు యత్నించాడు. ప్రాణభయంతో సిబ్బంది వెనక్కి తగ్గడంతో నిందితుడు అక్కడి నుంచి సులభంగా పరారయ్యాడు.
న్యూస్18 కథనం ప్రకారం.. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుడు ముందుగానే పక్కా పథకం ప్రకారం ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పాఠశాల ప్రాంగణంలోనే కాపు కాసి ఇంత దారుణంగా హత్య చేయడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. వ్యక్తిగత కక్షలా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులు, తోటి సిబ్బందిని విచారించి వివరాలు సేకరిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవడానికి పలు ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షిస్తామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Aug 03, 2026 10:10 PM IST














