Shocking Video: పట్టపగలే దారుణం.. టీచర్‌ను 20 సార్లు కత్తితో పొడిచి చంపిన కిరాతకుడు! | | ACTPnews

News18


Last Updated:

హర్యానాలోని ఫరీదాబాద్‌లో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్‌ను ముసుగు వేసుకున్న గుర్తుతెలియని దుండగుడు పట్టపగలే కత్తితో పొడిచి చంపాడు. పోలీస్ ఔట్‌పోస్టుకు కూతవేటు దూరంలోనే ఈ దారుణం జరగడం తీవ్ర కలకలం రేపుతోంది.

News18
News18

హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని సిక్రోనా గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న సంధ్య అనే మహిళా ఉపాధ్యాయురాలిని ఓ ముసుగు దుండగుడు అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. పాఠశాల లాబీలో ముందుగానే కాపు కాసిన ఆ కిరాతకుడు.. ఆమె లోపలికి అడుగుపెట్టగానే బలవంతంగా బయటకు లాక్కెళ్లి దాడికి తెగబడ్డాడు. పోలీస్ ఔట్‌పోస్టుకు కేవలం కొన్ని మీటర్ల దూరంలోనే పట్టపగలు ఈ దారుణ హత్య జరగడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఉదయం విధులకు హాజరయ్యేందుకు పాఠశాలకు చేరుకున్న వెంటనే ఈ ఘాతుకం చోటుచేసుకుంది.

స్కూల్ గేటు వద్దకు రాగానే నిందితుడు ఆమె మెడపై విచక్షణారహితంగా పలుమార్లు కత్తితో దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిన బాధితురాలు ప్రాణాలు విడిచింది. విద్యాబుద్ధులు నేర్పే బడిలోనే ఉపాధ్యాయురాలిని ఇంత క్రూరంగా చంపడం అందరినీ కలచివేస్తోంది. స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ భయానక దృశ్యాలు చూసి తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

భయభ్రాంతులకు గురైన సిబ్బంది

హఠాత్తుగా జరిగిన ఈ దాడితో పాఠశాల ప్రాంగణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బాధితురాలి అరుపులు విన్న తోటి ఉపాధ్యాయులు, సిబ్బంది వెంటనే ఆమెను రక్షించేందుకు పరుగులు తీశారు. అయితే వారిని గమనించిన హంతకుడు, వారిపై కూడా కత్తితో దాడి చేసేందుకు యత్నించాడు. ప్రాణభయంతో సిబ్బంది వెనక్కి తగ్గడంతో నిందితుడు అక్కడి నుంచి సులభంగా పరారయ్యాడు.

రంగంలోకి దిగిన పోలీసులు

న్యూస్18 కథనం ప్రకారం.. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుడు ముందుగానే పక్కా పథకం ప్రకారం ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

హత్య వెనుక కారణాలేంటి?

పాఠశాల ప్రాంగణంలోనే కాపు కాసి ఇంత దారుణంగా హత్య చేయడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. వ్యక్తిగత కక్షలా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులు, తోటి సిబ్బందిని విచారించి వివరాలు సేకరిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవడానికి పలు ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షిస్తామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *