Last Updated:
తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్‌పై ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ విరుచుకుపడ్డాడు. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందంటూ ఎద్దేవా చేశాడు. విజయ్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
Tamil Nadu: తమిళనాడులో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజలకు రక్షణ కరువైందని రాష్ట్ర ప్రతిపక్ష నేత, డీఎంకే (DMK) నాయకుడు ఉదయనిధి స్టాలిన్ సోమవారం తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం నేరాలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. గత 15 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 25 హత్యలు, 4 జంట హత్యలు, 19 లైంగిక నేరాలు జరగడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు.
ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ‘X’లో ఉదయనిధి స్టాలిన్ సుదీర్ఘమైన పోస్ట్‌ను పెడుతూ ముఖ్యమంత్రి విజయ్‌పై తీవ్రస్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “ఎన్నికలకు ముందు ‘మార్పు.. మార్పు..’ అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వారి పాలనలో.. ఇప్పుడు నేరాల రేటు ఏ స్థాయిలో పెరిగిందో ఈ ఘోరాలే సాక్ష్యాలు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారూ.. అసలు ఇది తమిళనాడా? లేక ఉత్తర ప్రదేశా?” అంటూ స్టాలిన్ ఘాటుగా ప్రశ్నించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఇటీవల జరిగిన కొన్ని ఘోరమైన నేరాలను ఉదయనిధి స్టాలిన్ తన పోస్టులో ప్రస్తావించారు.
మదురై మీనాక్షి అమ్మన్ ఆలయ పార్కింగ్ ప్రాంతంలో నిద్రిస్తున్న 17 ఏళ్ల కుబేంద్రన్ అనే బాలుడిని ఐదుగురు వ్యక్తుల ముఠా దారుణంగా హత్య చేసి, శవాన్ని మొదటి అంతస్తు నుంచి కిందకు పడేసింది. గత చిత్తిరై ఉత్సవాల్లో జరిగిన పాత కక్షల వల్లే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
కోయంబత్తూరు సమీపంలోని సూలూర్ (కన్నంపాళయం)లో 10 ఏళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన మరువక ముందే విల్లుపురం జిల్లాలో మరో బాలికపై లైంగిక దాడి జరిగిందని స్టాలిన్ ఆరోపించారు. సూలూర్ ఘటనలో బాధితురాలి తల్లికి కూడా సరైన సమాచారం ఇవ్వకుండా పోలీసులు హడావుడిగా అంత్యక్రియలు పూర్తి చేశారని ఆయన మండిపడ్డారు.
కోయంబత్తూరులో ఒక యువతి ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి జరగడం, అలాగే సీఎం విజయ్ సొంత నియోజకవర్గమైన పెరంబూర్‌లో డ్రగ్స్ బానిసలు పబ్లిక్ ఆస్తులను ధ్వంసం చేయడం వంటి ఘటనలు భయాందోళనలు కలిగిస్తున్నాయన్నారు.
ప్రజలు భయంతో వణికిపోతుంటే, సీఎం ఈ రోజు ఉదయం పోలీసు అధికారులతో కంటితుడుపుగా సమీక్షా సమావేశాలు నిర్వహించి, రొటీన్ ప్రకటనలు విడుదల చేస్తే సరిపోదని.. మహిళలు, పిల్లలపై నేరాల నివారణకు ఖచ్చితమైన చర్యలు చేపట్టాలని స్టాలిన్ డిమాండ్ చేశారు.
ఈ విషయంలో బీజేపీ (BJP) కూడా సీఎం విజయ్ ప్రభుత్వంపై విరుచుకుపడింది. సీనియర్ బీజేపీ నేత కె. అన్నామలై మాట్లాడుతూ.. తమిళనాడులో డ్రగ్స్ విక్రేతలకు, లైంగిక నేరగాళ్లకు, హంతకులకు పూర్తి స్వేచ్ఛ లభించిందని ఆరోపించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ కూడా దోషులకు కఠిన శిక్షలు పడేలా చేయాలని డిమాండ్ చేశారు.
విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ స్పందించారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలను ఎంతమాత్రం సహించబోమని, దోషులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సూలూర్ ఘటనను ఆయన “మానవత్వ రహితమైనది, క్షమించరానిది”గా అభివర్ణించారు.
“కోయంబత్తూరు ఘటన నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి, వేదనకు గురిచేసింది. ఇలాంటి నేరాలను సమాజం అంగీకరించదు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశాం. ఈ కేసులపై త్వరితగతిన నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి, తక్షణమే కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించాను. బాధితులకు న్యాయం జరిగేలా, నేరగాళ్లకు చట్టప్రకారం గరిష్ట శిక్షలు పడేలా తమిళనాడు ప్రభుత్వం గట్టిగా వ్యవహరిస్తుంది” అని సీఎం విజయ్ స్పష్టం చేశారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













