Tirumala News: గూగుల్‌లో తిరుమల టికెట్స్ అని సెర్చ్ చేస్తున్నారా? ఒక్క నిమిషం.. ఈ పచ్చి నిజం తెలుసుకోండి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

Tirumala


Last Updated:

తిరుమల వెంకన్న దర్శన టికెట్లు, రూమ్ బుకింగ్‌లపై టీటీడీ కీలక ప్రకటన.. భక్తులు వెంటనే ఈ విషయం తెలుసుకోవాల్సిందే!

+

Tirumala News: గూగుల్‌లో తిరుమల టికెట్స్ అని సెర్చ్ చేస్తున్నారా? ఒక్క నిమిషం.. ఈ పచ్చి నిజం తెలుసుకోండి!

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. అయితే ఇదే అదనుగా భావించి కొందరు సైబర్ నేరగాళ్లు, దళారులు అమాయక భక్తులను మోసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి కీలక సూచనలు చేశారు. దర్శన టికెట్లు, వసతి గదులు తదితర సేవలను పొందే క్రమంలో ఎలాంటి మోసాలకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. భక్తుల మనోభావాలను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదుల బుకింగ్‌ల కోసం భక్తులు కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే వినియోగించాలని అదనపు ఈవో విజ్ఞప్తి చేశారు. పారదర్శకమైన విధానంలో ఆన్‌లైన్ ద్వారా భక్తులకు నేరుగా టికెట్లు అందించేలా టీటీడీ పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. అధికారిక పోర్టల్ ద్వారా బుక్ చేసుకుంటే ఎవరికీ అదనంగా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు. ఆన్‌లైన్ బుకింగ్ సమయంలో ఏవైనా సందేహాలు తలెత్తితే వాటిని నివృత్తి చేసుకునేందుకు టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ కాల్ సెంటర్ నంబర్ 155257 ను సంప్రదించాలని భక్తులకు సూచించారు.

ఇది కూడా చదవండి: New Business Idea: రూ.30 వేలతో మొదలై రూ.10 కోట్లకు.. అదిరే బిజినెస్ ఐడియా!

ఇటీవల కాలంలో కొందరు సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి భక్తులను బురిడీ కొట్టిస్తున్నారని అధికారులు గుర్తించారు. సోషల్ మీడియా వేదికల్లో, అనధికారిక వెబ్‌సైట్లలో తప్పుడు ప్రచారాలు చేస్తూ దర్శనం ఇప్పిస్తామని నమ్మబలుకుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని వెంకయ్య చౌదరి హెచ్చరించారు. మధ్యవర్తులు, దళారులను నమ్మి మోసపోవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి ఆన్‌లైన్ ద్వారా డబ్బులు బదిలీ చేయవద్దని సూచించారు. స్వామివారి సేవలను సులభంగా పొందవచ్చనే అత్యాశతో అనధికారిక వ్యక్తులను ఆశ్రయిస్తే ఆర్థికంగా నష్టపోవడంతో పాటు మానసిక ఆందోళన కూడా తప్పదని స్పష్టం చేశారు. భక్తుల భద్రతకు టీటీడీ అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, అధికారిక మార్గాల్లోనే సేవలు పొందాలని కోరారు.

ఇది కూడా చదవండి: Rain Forecast: ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు చల్లటి కబురు.. ఈ జిల్లాల్లో నేటి నుంచి వర్షాలు!

టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో భక్తులకు అవసరమైన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందుపరుస్తున్నట్లు అదనపు ఈవో వెల్లడించారు. శ్రీవారి దర్శన టికెట్ల విడుదలకు సంబంధించిన తేదీలు, వసతి గదుల ఖాళీల వివరాలు, విభిన్న సేవలకు సంబంధించిన నిబంధనలు అధికారిక సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. అలాగే ఏవైనా కారణాలతో రద్దు అయిన టికెట్ల లభ్యత, వివిధ దర్శనాలకు వేచి ఉండే సమయం తదితర వివరాలను కూడా వెబ్‌సైట్‌లో సులభంగా తెలుసుకోవచ్చని వివరించారు. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్స్ కోసం టీటీడీ సోషల్ మీడియా అధికారిక ఖాతాలను, వెబ్‌సైట్‌ను మాత్రమే ఫాలో కావాలని, ఇతర అనధికారిక గ్రూపుల్లో వచ్చే సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోవద్దని ఆయన సూచించారు.

టికెట్లు ఇప్పిస్తామంటూ ఎవరైనా మధ్యవర్తులు, దళారులు లేదా అనధికారిక వ్యక్తులు సంప్రదిస్తే ఏమాత్రం భయపడకుండా వెంటనే టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేయాలని వెంకయ్య చౌదరి కోరారు. ఇలాంటి మోసాలకు పాల్పడే వారి గురించి టీటీడీ విజిలెన్స్ విభాగానికి సంబంధించిన ఫోన్ నంబర్ 98668 98630 కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అక్రమ మార్గాల్లో దర్శనాలకు ప్రయత్నించే వారిపై, భక్తులను మోసం చేసే దళారులపై తక్షణమే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. తిరుమల యాత్రను ప్రశాంతంగా ముగించుకునేందుకు ప్రతి భక్తుడు టీటీడీ నిర్దేశించిన నియమ నిబంధనలను పాటించి అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆయన అభ్యర్థించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *