Last Updated:
Tirupati: తిరుపతి జిల్లా శ్రీసిటీలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఫ్యాక్టరీలో వాటర్ బాయిలర్ పేలి నలుగురు మృతి చెందిన ఘటన కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన సమాచారం అందిన వెంటనే సీఎం ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు, సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. శ్రీసిటీలోని ప్రైవేటు పరిశ్రమలో వాటర్ బాయిలర్ పేలిన సమయంలో తీవ్రత ధాటికి ఘటనా స్థలంలోనే ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన మరో వ్యక్తికి ప్రస్తుతం ఆసుపత్రిలో అత్యవసర చికిత్స కొనసాగుతోందని అధికారులు తెలిపారు. అతనికి మెరుగైన వైద్యం అందేలా పర్యవేక్షించాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు.
అకాల మరణం చెందిన కార్మికుల కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని, అవసరమైన సహాయ సహకారాలు తక్షణమే అందించాలని అధికారులను ఆదేశించారు.
శ్రీసిటీలోని ప్రైవేటు ఫ్యాక్టరీలో ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. బాయిలర్ పేలి కార్మికులు మృతి చెందడం, మరికొందరు గాయపడటం తీరని విషాదం. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. తమ వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.…
— Lokesh Nara (@naralokesh) October 3, 2026
ఇక ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ కూడా స్పందించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ‘శ్రీసిటీలోని ప్రైవేటు ఫ్యాక్టరీలో ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. బాయిలర్ పేలి కార్మికులు మృతి చెందడం, మరికొందరు గాయపడటం తీరని విషాదం. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. తమ వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరుతున్నాను. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది’ అని ఎక్స్ ద్వారా పేర్కొన్నారు.














