Last Updated:
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు, ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఏపీ ఎఫ్డీసీ – APFDC) ప్రస్తుత డైరెక్టర్ వి. సముద్ర భూ దందాలకు పాల్పడుతున్న కేటుగాళ్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామంటూ కొందరు వ్యక్తులు తన పేరును, తన పదవిని వాడుకుని వసూళ్లకు పాల్పడుతుండటంపై ఆయన సీరియస్ అయ్యారు.
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు, ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఏపీ ఎఫ్డీసీ – APFDC) ప్రస్తుత డైరెక్టర్ వి. సముద్ర భూ దందాలకు పాల్పడుతున్న కేటుగాళ్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామంటూ కొందరు వ్యక్తులు తన పేరును, తన పదవిని వాడుకుని వసూళ్లకు పాల్పడుతుండటంపై ఆయన సీరియస్ అయ్యారు. “దీనితో నాకు ఎలాంటి సంబంధం లేదు… నా పేరును అక్రమంగా ఈ వ్యవహారంలోకి లాగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది” అంటూ పబ్లిక్ గా ఘాటు వార్నింగ్ ఇచ్చారు. తన ఇమేజ్ను, సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలో భాగంగానే కొందరు ఇలాంటి దుష్ప్రచారానికి తెరలేపారని ఆయన మండిపడ్డారు.
అసలు విషయం ఏమిటంటే, ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీ పేరుతో కొందరు మోసగాళ్లు అమాయకులైన సినీ కార్మికులకు వల వేస్తున్నారు. లైట్ బాయ్స్, జూనియర్ ఆర్టిస్టులు, ఇతర దినసరి సినీ కార్మికులకు తక్కువ ధరకే ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ల స్థలాలు ఇస్తామని నమ్మబలుకుతూ వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారం వెనుక ఏపీ ఎఫ్డీసీ డైరెక్టర్ సముద్ర ఉన్నారని, ఆయన అండతోనే ఇదంతా జరుగుతోందని ఆ కేటుగాళ్లు ప్రచారం చేయడంతో ఈ వివాదం ముదిరింది. సొంత ఇల్లు లేదా స్థలం కావాలనే కార్మికుల కలను ఆసరాగా చేసుకుని ఈ భూ దందాకు కొందరు అక్రమార్కులు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ నకిలీ ప్రచారంపై స్పందించిన సముద్ర.. ఏపీ ఎఫ్డీసీ తరపున కానీ, ప్రభుత్వ పరంగా కానీ ఎలాంటి ఇళ్ల స్థలాలను కేటాయించలేదని కుండబద్దలు కొట్టారు. కావాలనే కొందరు వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఏపీ ఎఫ్డీసీకి చెడ్డపేరు తీసుకురావాలనే దురుద్దేశంతో ఈ కుట్ర పన్నారని స్పష్టం చేశారు. సినీ కార్మికులను మోసం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. తన పేరును ఉపయోగించి వసూళ్లకు పాల్పడినా, ఆ వదంతులను సోషల్ మీడియా లేదా ఇతర మాధ్యమాల్లో వైరల్ చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దని, నేరుగా ఎఫ్డీసీ అధికారులను సంప్రదించి వాస్తవాలు తెలుసుకోవాలని ఆయన సూచించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా కొత్తగా ఏర్పాటైన ఏపీ ఎఫ్డీసీ ఎంతో పారదర్శకంగా, జవాబుదారీతనంతో పనిచేస్తోందని సముద్ర వివరించారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమను విశేషంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా విశాఖపట్నం (వైజాగ్), రాజమండ్రి వంటి సుందరమైన ప్రాంతాల్లో షూటింగ్లకు అనుకూలమైన వాతావరణం కల్పించి సినీ పరిశ్రమను మరింతగా విస్తరించే దిశగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఇళ్ల స్థలాలకు సంబంధించి భవిష్యత్తులో ఏదైనా నిర్ణయం ఉంటే, అది ప్రభుత్వమే అధికారికంగా ప్రకటిస్తుందని ఆయన కార్మికులకు భరోసా ఇచ్చారు.
ఒకప్పుడు ‘సింహరాశి’ సినిమాతో టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చిన సముద్ర.. ఆ తర్వాత శివరామరాజు, ఎవడైతే నాకేంటి, పంచాక్షరి, మహానంది, టైగర్ హరిశ్చంద్రప్రసాద్ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కాకతీయుడు, వైభవం వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, ప్రస్తుతం ఏపీ ఎఫ్డీసీ డైరెక్టర్గా ప్రభుత్వ బాధ్యతలు చేపట్టారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కార్మికుల పక్షాన నిలబడి సముద్ర ఇచ్చిన ఈ వార్నింగ్తో అయినా దళారుల దందాకు అడ్డుకట్ట పడుతుందేమో వేచి చూడాలి.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana
Jul 01, 2026 11:04 AM IST













