Last Updated:
తెలంగాణ చిత్ర పరిశ్రమలో థియేటర్ల యజమానులు, నిర్మాతల మధ్య మొదలైన వివాదం ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోంది.
తెలంగాణ చిత్ర పరిశ్రమలో థియేటర్ల యజమానులు, నిర్మాతల మధ్య మొదలైన వివాదం ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోంది. అద్దె పద్ధతిని పూర్తిగా పక్కన పెట్టి కేవలం వసూళ్లలో వాటా (రెవెన్యూ షేర్) ఇస్తేనే సింగిల్ స్క్రీన్లలో సినిమాలు ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్లు తెగేసి చెప్పడం ఒక సంచలనంగా మారింది. దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి, సునీల్ నారంగ్ వంటి ప్రముఖులు ఒక ప్రెస్ మీట్ ద్వారా దీన్ని జారీ చేశారు. దీనికి కౌంటర్‌గా మైత్రీ మూవీస్ రవిశంకర్, సితార నాగవంశీ, సాహు గారపాటి వంటి అగ్ర నిర్మాతలు విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రవిశంకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో, ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
రవిశంకర్ తన ప్రసంగంలో శిరీష్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన ప్రశ్నలు సంధించారు. గత కొంతకాలంగా వరుసగా పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు ఈ సమస్య ఎందుకు గుర్తుకు రాలేదని ఆయన నిలదీశారు. గతేడాది పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సమయం ప్రారంభమైన ఈ గొడవ, ఆ తర్వాత శిరీష్ తన సొంత పంపిణీలో సినిమాలు రిలీజ్ చేసినప్పుడు ఎందుకు ఆగిపోయిందని ప్రశ్నించారు. ‘వార్ 2’, ‘కూలీ’, ‘OG’, ‘అఖండ’, ‘మన శంకర వర ప్రసాద్’, ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి క్రేజీ ప్రాజెక్టులు విడుదలైనప్పుడు ఎగ్జిబిటర్ల కష్టాలు శిరీష్‌కు కనిపించలేదా అని సూటిగా అడిగారు.
ముఖ్యంగా ‘పెద్ది’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న ఈ తరుణంలోనే ఇలాంటి డిమాండ్లు రావడం వెనుక ‘బ్లాక్ మెయిల్’ రాజకీయాలు ఉన్నాయా అనే అనుమానాన్ని రవిశంకర్ వ్యక్తపరిచారు. తన సినిమా లేనప్పుడు ఇతరుల పెద్ద సినిమాలు వచ్చే టైమ్ చూసి ఇలాంటి నిబంధనలు పెట్టడం విడ్డూరంగా ఉందని ఆయన మండిపడ్డారు. ఒకవేళ శిరీష్ గారు తన పెద్ద సినిమా రిలీజ్ సమయంలోనే ఎగ్జిబిటర్లకు స్వచ్ఛందంగా వాటా ఇచ్చి ఉంటే, ఫిల్మ్ నగర్‌లో ఆయనకు ఒక విగ్రహం పెట్టేవాళ్లమంటూ సెటైర్లు వేశారు.
వసూళ్లలో వాటా అడుగుతున్న ఎగ్జిబిటర్లు ముందుగా థియేటర్లలో కనీస సౌకర్యాలు కల్పిస్తున్నారా అని నిర్మాతలు ప్రశ్నిస్తున్నారు. సింగిల్ స్క్రీన్లలో ముక్కు మూసుకోకుండా టాయిలెట్‌కి వెళ్లగలిగే పరిస్థితులు ఎన్ని థియేటర్లలో ఉన్నాయని రవిశంకర్ ప్రశ్నించడం గమనార్హం. ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే కేవలం సినిమాల్లో సత్తా ఉంటే సరిపోదు, అక్కడ కనీస వసతులు, అప్డేటెడ్ టెక్నాలజీ, సౌండ్ సిస్టమ్ బాగుండాలని ఆయన సూచించారు.
తమ పర్యవేక్షణలో నడుస్తున్న విమల్ థియేటర్‌ను సాంకేతికంగా అభివృద్ధి చేయడం వల్లే అక్కడ జనం బాగా వస్తున్నారని రవిశంకర్ చెప్పారు. థియేటర్లను అప్‌గ్రేడ్ చేస్తే ప్రేక్షకులు ఆటోమేటిక్‌గా వస్తారని, అప్పుడు అద్దె వ్యవస్థ వల్ల ఎవరికీ నష్టం ఉండదని అభిప్రాయపడ్డారు. దశాబ్దాల కాలంగా నడుస్తున్న అద్దె పద్ధతిని రాత్రికి రాత్రే మార్చాలనడం సమంజసం కాదని నిర్మాతలు స్పష్టం చేస్తున్నారు.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













