Top 10 News: టూడే టాప్ 10 న్యూస్.. తెలుగు రాష్ట్రాల ప్రధాన వార్తలు | | ACTPnews

Top 10 News: టూడే టాప్ 10 న్యూస్.. తెలుగు రాష్ట్రాల ప్రధాన వార్తలు |


పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ను కలిసిన సురేఖ, కడియంపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. తనకు సమాచారం ఇవ్వకుండా దేవాదాయ శాఖలో సమీక్ష నిర్వహించారని ఆరోపిస్తూ, అది శాఖను హైజాక్ చేసినట్టేనని వ్యాఖ్యానించారు. గతంలో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి ఇప్పుడు నీతి గురించి మాట్లాడటం సరికాదని విమర్శించారు.

2.పరిశ్రమలన్నీ ఓఆర్‌ఆర్‌ బయటికి తరలిస్తాం

2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. షాబాద్ మండలం సీతారాంపురంలో నెక్స్ట్-జెన్ సోలార్ మాడ్యూల్ యూనిట్‌ను ప్రారంభించిన ఆయన, యువత నైపుణ్యాభివృద్ధికి స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓఆర్‌ఆర్ లోపలున్న పరిశ్రమలను బయటకు తరలించి, పెరి అర్బన్ ప్రాంతాల్లో ప్రత్యేక తయారీ జోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌ను కాలుష్య రహిత, పరిశ్రమలకు అనుకూల నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు.

3.బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న నిధులు స్వచ్ఛమైనవి కావు

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత, బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో ఉన్న రూ.1,400 కోట్ల నిధులపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆ నిధులు క్విడ్ ప్రోకో ద్వారా వచ్చాయని ఆరోపిస్తూ, వాటిని తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు పంచాలని కోరారు. సింగరేణి కార్మికుల హక్కుల కోసం చేపట్టిన ‘సింగరేణి బాయి బాట’ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, సంస్థ ఆర్థిక సంక్షోభం కారణంగా కార్మికులకు అవసరమైన పరికరాలు కూడా కొనలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు.

4.భూ వివాద రహిత ఏపీనే లక్ష్యం

ఆంధ్రప్రదేశ్‌ను భూవివాద రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో రైతులకు కొత్త పట్టాదారు పాస్‌బుక్‌లు పంపిణీ చేశారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను నల్ల చట్టంగా అభివర్ణిస్తూ, దానిని రద్దు చేసి రాష్ట్ర రాజముద్రతో భద్రతా ఫీచర్లున్న కొత్త పాస్‌బుక్‌లు అందిస్తున్నామని చెప్పారు. 2027 మార్చి నాటికి 72.70 లక్షల పాస్‌బుక్‌ల పంపిణీ పూర్తి చేస్తామని వెల్లడించారు.

5.రావణ్ మీ వాడే!

వైసీపీ నేత కొడాలి నానిపై టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు రాజకీయంగా అవకాశం కల్పించడంతోనే కొడాలి నాని ఎమ్మెల్యే అయ్యారని వ్యాఖ్యానించారు. హిందూ దేవుళ్లను కించపరిచిన జోసెఫ్ రావణ్‌కు వైసీపీ మద్దతు ఇస్తోందని ఆరోపిస్తూ, యూఏపీఏ చట్టాన్ని హేళన చేసిన కొడాలి నానిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

6.కలర్స్ స్వాతి రెండో పెళ్లి

‘కలర్స్’ స్వాతి దర్శకుడు శ్రీకాంత్ నాగోతి‌ను వివాహం చేసుకున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ‘మంత్ ఆఫ్ మధు’ సినిమా సందర్భంగా పరిచయమైన వీరిద్దరూ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. గతంలో వికాస్ వాసుతో వివాహం జరిగిన స్వాతి, అనంతరం విడిపోయారు. కొత్త జీవితాన్ని ప్రారంభించిన స్వాతికి సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

7.జన నాయగన్‌ రిలీజ్

కెనడాకు చెందిన యార్క్ సినిమాస్, దళపతి విజయ్ నటించిన ‘జన నాయగన్’ చిత్రాన్ని జులై 24న కెనడాలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. టికెట్ బుకింగ్స్ త్వరలో ప్రారంభం కానున్నాయి. సెన్సార్ సూచించిన మార్పులకు చిత్రబృందం అంగీకరించగా, త్వరలో సర్టిఫికెట్ రానుంది. అనంతరం కేవీఎన్ ప్రొడక్షన్స్ అధికారిక విడుదల తేదీని ప్రకటించనుంది.

8.అలాంటి వారిని కలిసేందుకు ఇష్టపడను

తాను, తన కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులకు కపిల్ దేవ్ కూడా కారణమన్న యోగ్‌రాజ్ వ్యాఖ్యలపై కపిల్ స్పందించారు . యోగ్‌రాజ్ ఇప్పటికీ తన స్నేహితుడేనని, అయితే అలాంటి వ్యక్తులను కలవడానికి ఆసక్తి చూపనని అన్నారు. యోగ్‌రాజ్ సింగ్ వ్యాఖ్యలకు యువరాజ్ సింగ్ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని కపిల్ దేవ్ అన్నారు. యువరాజ్ గొప్ప క్రికెటర్ అని, దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని ప్రశంసించారు.

9.పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ప్రధాని మోదీ ఆందోళన

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, ప్రపంచ ఘర్షణలకు చర్చల ద్వారానే పరిష్కారమని పేర్కొన్నారు. ఆంథోనీ ఆల్బనీస్‌తో అణుశక్తి ఒప్పందం సహా కీలక అంశాలపై చర్చించి, భారత్‌కు యురేనియం సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఇండో-పసిఫిక్‌లో శాంతి, సుస్థిరత కోసం కలిసి పనిచేస్తామని వెల్లడించారు.

10.ట్రంప్‌ నోటమళ్లీ పాత పాట

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య జరిగిన సైనిక ఉద్రిక్తతలపై మరోసారి అత్యంత సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. గతంలో భారత్-పాక్ మధ్య జరిగిన ఘర్షణల సమయంలో దాదాపు 11 యుద్ధ విమానాలు కూలిపోయాయని, ఆ యుద్ధం అణు యుద్ధంగా మారే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. ఆ సమయంలో తాను ఇరు దేశాలపై 200 శాతం టారిఫ్‌లు (పన్నులు) విధిస్తానని గట్టిగా హెచ్చరించడం వల్లే ఇరు దేశాలు వెనక్కి తగ్గాయని ట్రంప్ చెప్పుకొచ్చారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed