Evil Dead Burn: హారర్ నటికే చెమటలు పట్టించిన సినిమా.. థియేటర్‌లో ఒంటరిగా అదా శర్మ వైరల్ వీడియో! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

హారర్ సినిమాలకు పేరుగాంచిన అదా శర్మకు కూడా Evil Dead Burn సినిమా భయపెట్టింది. ఖాళీ థియేటర్‌లో ఒంటరిగా సినిమా చూసిన అనుభవాన్ని పంచుకున్న ఆమె స్పందన ఇప్పుడు వైరల్‌గా మారింది.

News18
News18

హారర్ సినిమాలంటే తనకు ప్రత్యేకమైన ఇష్టమని ఇప్పటికే పలుమార్లు చెప్పిన బాలీవుడ్ నటి అదా శర్మ.. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. ‘1920’ చిత్రంతో హారర్ జానర్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న అదా, ఇప్పుడు విడుదలకు సిద్ధమైన ‘ఈవిల్ డెడ్ బర్న్’ (Evil Dead Burn) సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ సాహసోపేతమైన ఛాలెంజ్‌ను స్వీకరించింది. అయితే ఆ ధైర్యం చివరకు భయంగా మారింది.

జూలై 10న భారతదేశంలో ఇంగ్లిష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానున్న ‘ఈవిల్ డెడ్ బర్న్’ చిత్రాన్ని రిలీజ్‌కు ముందే చూసే అవకాశం అదా శర్మకు లభించింది. అయితే దీనికి ఒక ప్రత్యేక షరతు విధించారు. ఖాళీగా ఉన్న థియేటర్‌లో ఆమె ఒక్కరే కూర్చుని మొత్తం సినిమాను చూడాల్సి వచ్చింది.

సోనీ పిక్చర్స్ ఇండియా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఆ వీడియోలో అదా శర్మ తనకు ఎంతో ఇష్టమైన సాఫ్ట్ టాయ్ ‘రాధా’ను వెంట తీసుకుని థియేటర్‌లోకి వెళ్లడం కనిపిస్తుంది. మొదట ఎంతో ధైర్యంగా కూర్చున్న ఆమె, సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

సినిమాలో వచ్చే భయానక సన్నివేశాలు ఒక్కొక్కటిగా తీవ్రంగా ప్రభావం చూపడంతో అదా శర్మ కుర్చీలో అసౌకర్యంగా కదలడం, ఉలిక్కిపడటం, మధ్యలో సీటు మార్చుకోవడం వంటి దృశ్యాలు వీడియోలో కనిపించాయి. హారర్ సన్నివేశాలు మరింత తీవ్రంగా మారడంతో ఆమె ముఖంలో స్పష్టంగా భయం కనిపించింది. ప్రారంభంలో సరదాగా మొదలైన ఈ ఛాలెంజ్ చివరకు ఆమెకు నిజంగానే టెన్షన్ కలిగించిన అనుభవంగా మారింది.

సినిమా పూర్తయ్యాక అదా శర్మ తన అనుభవాన్ని పంచుకుంది. ట్రైలర్ చూసినప్పుడే సినిమా భయంకరంగా ఉంటుందని అనుకున్నానని, కానీ పూర్తి సినిమా తన ఊహలకు మించి మరింత భయానకంగా ఉందని చెప్పింది. కొన్ని సన్నివేశాలు నిజంగానే తనను ఉలిక్కిపడేలా చేశాయని ఆమె వెల్లడించింది.

ఇప్పటికే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హారర్ సినిమాల అభిమానులు అదా శర్మ రియాక్షన్లను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. చాలామంది “హారర్ సినిమాల్లో నటించిన హీరోయిన్‌కే ఇంత భయం వేసిందంటే సినిమా ఎంత భయంకరంగా ఉంటుందో!” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక ‘ఈవిల్ డెడ్ బర్న్’ ప్రముఖ ‘ఈవిల్ డెడ్’ ఫ్రాంచైజీలో ఆరో చిత్రం. ఈ సినిమాకు ఫ్రెంచ్ దర్శకుడు సెబాస్టియన్ వానిచెక్ దర్శకత్వం వహించారు. ఈ ఫ్రాంచైజీకి ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమానులు ఉన్నారు. అతీంద్రియ శక్తులు, భయానక వాతావరణం, గోరీ హారర్, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ఈ సిరీస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది.

అంతర్జాతీయంగా ఇప్పటికే విడుదలైన ప్రారంభ స్పందనల ప్రకారం, ‘ఈవిల్ డెడ్ బర్న్’ ఇప్పటివరకు వచ్చిన సిరీస్‌లోనే అత్యంత భయానకమైన చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠలో ఉంచే కథ, భయపెట్టే విజువల్స్, ఊహించని ట్విస్టులు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు.

జూలై 10న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం హారర్ ప్రేమికులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తుందని చిత్రబృందం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. అదా శర్మ చేసిన ఈ ప్రత్యేక ఛాలెంజ్ కూడా సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports