హైదరాబాద్ శివార్లలోని కోహెడ వద్ద దేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ సమీకృత మార్కెట్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తెలంగాణ రైజింగ్ విజన్-2047 లక్ష్యంగా పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.3,387.35 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలు, సాంకేతిక హంగులతో నిర్మించే ఈ మార్కెట్ మూడేళ్ల కాల వ్యవధిలో అందుబాటులోకి రానుంది. ఇక్కడ పండ్లు, పూలు, డెయిరీ, డ్రైఫ్రూట్స్, చేపలు, మాంసం వంటి అన్ని రకాల సదుపాయాలు లభిస్తాయి.
2. రాయలసీమ జిల్లాలను తాకిన నైరుతి రుతుపవనాలు
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాలను నైరుతి రుతుపవనాలు తాకినట్లు భారత వాతావరణశాఖ వెల్లడించింది. రాబోయే రెండు మూడు రోజుల్లో రాయలసీమ వ్యాప్తంగా పలుచోట్ల తొలకరి జల్లులు కురిసే అవకాశం ఉంది. జూన్ 10 నాటికి రాష్ట్రంలో సగానికి పైగా ప్రాంతాలకు ఈ రుతుపవనాలు విస్తరిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎండల తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షాలు ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయని భావిస్తున్నారు.
3. మన్యం జిల్లా పెదపెంకిలో పవన్ సమీక్ష
పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి గ్రామంలో అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య పరిస్థితులపై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గ్రామంలో పైలేరియా, ప్రమాదకర జ్వరాల నివారణకు అధికారులు తీసుకుంటున్న చర్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అక్రమణలు తొలగించి మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణం వేగంగా చేపడుతున్నట్లు అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. పారిశుద్ధ్య లోపాలు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు.
4. రేవంత్ సర్కార్‌పై కవిత తీవ్ర ఆరోపణలు
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పేదల కాలనీలను కూల్చుతూ, రూ.లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ భూములను పెద్దలకు అప్పగిస్తోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. సీఎం కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ ప్రతినిధులు ఈ పెద్ద భూదందాలో భాగస్వాములుగా ఉన్నారని ఆమె విమర్శించారు. ప్రభుత్వ భూములను కాపాడేందుకు తాము అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ఆస్తిని కాపాడటానికి నిరంతరం పోరాడతామని ఆమె పేర్కొన్నారు.
5. జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు
నీట్ పేపర్ లీక్, సీబీఎస్‌ఈ పరీక్షల వ్యవస్థలో అవకతవకలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) డిమాండ్ చేసింది. ఈ మేరకు దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. సీజేపీ వ్యవస్థాకుడు అభిజీత్ దీప్కే పిలుపుతో దేశ రాజధానికి వేలాదిమంది యువతీ యువకులు తరలివచ్చారు. ‘మేము మేక్ ఇన్ ఇండియా అడిగితే.. మీరు లీక్ ఇన్ ఇండియా ఇచ్చారు’ అంటూ కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
6. అన్నామలై రాజీనామాపై పవన్ వ్యాఖ్యలు
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కె. అన్నామలై బీజేపీ రాజీనామా వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కంటే కూడా, ఆ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై ఎంతో సమర్థుడంటూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు.
7. ఇజ్రాయెల్ బీభత్సం.. శిథిలాల దిబ్బగా మారిన గాజా
సెంట్రల్ గాజాలోని జవాయిదా పట్టణంపై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన తాజా వైమానిక దాడులు అక్కడ తీవ్ర భయాందోళనలను రేకెత్తించాయి. ఇజ్రాయెల్ క్షిపణుల ధాటికి స్థానిక నివాసాలు, నిత్యావసర కేంద్రాలు, పెద్ద భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బాంబుల దాడితో ఆ ప్రాంతమంతా క్షణాల వ్యవధిలో శిథిలాల కుప్పగా మారిపోయింది. ఈ దాడుల కారణంగా స్థానిక ప్రజలు ప్రాణాలు చేతపట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు.
8. ఇరాన్ యుద్ధాన్ని ముగిస్తామన్న డోనాల్డ్ ట్రంప్
అమెరికా దేశవ్యాప్త మిడ్‌టర్మ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విస్కాన్సిన్‌లోని చిప్పెవా ఫాల్స్‌లో విస్తృతంగా పర్యటించారు. అక్కడ స్థానిక రైతులు, వ్యాపారవేత్తలతో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య ప్రసంగం చేశారు. అంతర్జాతీయంగా ఇరాన్‌తో నడుస్తున్న యుద్ధ వాతావరణాన్ని తాము చాలా త్వరగా ముగిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అలాగే దేశంలో నిత్యావసరాల ధరలను భారీగా తగ్గిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.
9. ‘పెద్ది’ సినిమా వివాదాస్పద సన్నివేశాల్లో మార్పులు
దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ‘పెద్ది’ సినిమాలోని కొన్ని మహిళా పాత్రల చిత్రీకరణపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ స్పందనలపై స్పందించిన దర్శకుడు మహిళలను అగౌరవపరచడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేస్తూ బహిరంగ క్షమాపణలు చెప్పారు. ప్రేక్షకుల సెంటిమెంట్లను గౌరవిస్తూ ఆ వివాదాస్పద సన్నివేశాల్లో తగిన మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. మహిళల విలువను పెంచే కథలకే తమ చిత్ర బృందం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.
10. ధనుష్ రాజకీయ ప్రవేశంపై తండ్రి కస్తూరి రాజా స్పష్టత
ప్రముఖ నటుడు ధనుష్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారంటూ జరుగుతున్న ప్రచారానికి ఆయన తండ్రి, దర్శకుడు కస్తూరి రాజా వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూర్చాయి. ప్రజాసేవ చేయాలనుకునే హక్కు ఎవరికైనా ఉంటుందని, భవిష్యత్తులో తన కుమారులు ఈ మార్గాన్ని ఎంచుకోవచ్చని ఆయన అన్నారు. ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తన కుమారుడు సాధిస్తున్న అపారమైన విజయాలు తండ్రిగా తనకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు.












