Top10 News: తెలంగాణలో టార్గెట్ పవన్ కళ్యాణ్.. విగ్రహాల రచ్చ.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews

Top10 News: తెలంగాణలో టార్గెట్ పవన్ కళ్యాణ్.. విగ్రహాల రచ్చ.. ఈ రోజు టాప్10 న్యూస్ |


హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ నిర్వహించనున్న ‘నవనిర్మాణ సభ’పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్, తెలంగాణపై చేసిన వ్యాఖ్యలకు ముందుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి కోసమే సభ అయితే ఇతర రాష్ట్రాల్లో ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం కంటే ఆంధ్రప్రదేశ్ సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. క్షమాపణ చెప్పకుండా సభ నిర్వహిస్తే తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తారని హెచ్చరించారు.

2. ఆంధ్రోళ్ల విగ్రహాలు కూల్చి.. పార్సిల్ పంపిస్తా:

టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ నేతలపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణ గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు ఎవరూ చేయొద్దని ఆమె హెచ్చరించారు. అవసరమైతే ఆంధ్ర నేతల విగ్రహాలను కూల్చి ఆంధ్రకు పార్సిల్ పంపిస్తానని అన్నారు.

3. కాంగ్రెస్ ‘టాలెంట్ హంట్’

తెలంగాణ కాంగ్రెస్.. యువతను రాజకీయాల్లోకి తీసుకురావడానికి ‘టాలెంట్ హంట్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గాంధీభవన్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. రాహుల్ గాంధీ ఆలోచనలతో రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమం ద్వారా ప్రతిభ, సేవా దృక్పథం ఉన్న యువతకు అవకాశం కల్పించనున్నారు. రాజకీయ నేపథ్యం అవసరం లేకుండా, ప్రజా సేవపై ఆసక్తి, రాజకీయ అవగాహన, ప్రజలతో మాట్లాడే నైపుణ్యం ఉన్నవారిని ఎంపిక చేస్తామని తెలిపారు. పార్టీలో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించే దిశగా కాంగ్రెస్ ఈ వినూత్న అడుగు వేసింది.

4. వైసీపీ విద్వేషాలు సృష్టిస్తోంది

కూటమి ప్రభుత్వం డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయడాన్ని చూసి వైసీపీ అసహనం చెందుతోందని సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఆ పార్టీ నిరాశలో ఉందనీ, మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. నంద్యాలలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఘటనలో కూడా వీసీపీ నేతల ప్రమేయం ఉన్నట్లు విచారణలో తేలిందని అన్నారు. అబద్ధపు ప్రచారాలతో సానుభూతి పొందే ప్రయత్నాలు చేస్తున్నారనీ, ఏదేమైనా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా కొనసాగిస్తోందని అన్నారు.

5. కోల్‌కతాలో మెస్సీ భారీ విగ్రహం తొలగింపు

కోల్‌కతాలో ఏర్పాటు చేసిన ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ 70 అడుగుల భారీ విగ్రహాన్ని అధికారులు తొలగిస్తున్నారు. బలమైన గాలులకు విగ్రహం ప్రమాదకరంగా ఊగడంతో ఇంజనీర్లు తనిఖీ చేసి నిర్మాణ లోపాలను గుర్తించారు. 2022 ప్రపంచకప్ విజయానికి గుర్తుగా, 2025లో మెస్సీ వర్చువల్‌గా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే నాసిరకం నిర్మాణం కారణంగా ఆరు నెలలకే విగ్రహం తొలగించడం అభిమానులను నిరాశ పరిచింది. అధికారులు దీనిని సురక్షిత ప్రదేశానికి తరలించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు.

6. భారత్‌కు కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు

సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు, జాతీయ పరీక్షల వివాదాల మధ్య ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జూన్ 6న భారత్‌కు తిరిగి వస్తున్నట్లు ప్రకటించిన ఆయన, ఢిల్లీ విమానాశ్రయం నుంచే శాంతియుత నిరసనలు ప్రారంభిస్తామని తెలిపారు. విద్యార్థులు, పార్టీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో అనుమతి తీసుకుని జంతర్ మంతర్ వద్ద రాజ్యాంగబద్ధంగా నిరసనలు చేపడతామని వెల్లడించారు.

7. సీఎం విజయ్‌ వల్ల నా బిడ్డను కోల్పోయా..!

జల్లికట్టు ఉద్యమంతో గుర్తింపు పొందిన జూలీ, సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్‌, వేధింపుల వల్ల తీవ్ర మానసిక క్షోభతో తన గర్భంలోని బిడ్డను కోల్పోయానని ఆరోపించారు. ఈ విషయంలో విజయ్ తన అభిమానులను నియంత్రించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో తన విమర్శల కారణంగానే లక్ష్యంగా చేసుకున్నారని, తనపై తప్పుడు ఆరోపణలు కూడా సృష్టించారని ఆమె అన్నారు. అయితే టీవీకే నేతలు, కార్యకర్తలు ఈ ఆరోపణలను ఖండిస్తూ, జూలీ పబ్లిసిటీ కోసం ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంపై సీఎం విజయ్ నుంచి గానీ, పార్టీ నుంచి గానీ ఇప్పటివరకూ అధికారిక స్పందన రాలేదు.

8. హైదరాబాద్‌కు ఐమ్యాక్స్‌

హైదరాబాద్ సినీ అభిమానులకు శుభవార్తగా, దాదాపు పుష్కరకాలం తర్వాత ఐమ్యాక్స్‌ ఫార్మాట్ మళ్లీ అందుబాటులోకి రానుంది. ఏఎంబీ సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్స్, ఐమ్యాక్స్ సంయుక్తంగా సుదర్శన్‌ 70లో ‘ఏఎంబీ క్లాసిక్ విక్టరీ’ పేరుతో కొత్త ఐమ్యాక్స్ స్క్రీన్‌ను ఏర్పాటు చేయనున్నాయి. స్క్రీన్ రేషియో, సీటింగ్ సామర్థ్యం వంటి పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సహా పలు భారీ చిత్రాలు ఈ అత్యాధునిక ఫార్మాట్‌లో ప్రేక్షకులను అలరించనున్నాయి.

9. అవి దర్శకుల కలలను ముక్కలు చేస్తాయి

దర్శకుడు విఘ్నేశ్ శివన్ తన ‘ఎల్‌ఐకే’ సినిమా పరాజయంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా సృష్టించిన నెగెటివ్ రివ్యూలు, ప్రచారం కారణంగా చాలామంది ప్రేక్షకులు సినిమా చూడలేదని తనకు సందేశాలు పంపుతున్నారని తెలిపారు. ఇలాంటి ప్రతికూల ప్రచారం ప్రేక్షకులను గందరగోళంలో పడేయడమే కాకుండా దర్శకుల కలలను కూడా దెబ్బతీస్తుందని అన్నారు. ఎంతో కష్టపడి రూపొందించిన ‘ఎల్‌ఐకే’కి మరింత ఆదరణ దక్కాల్సి ఉందనీ, భవిష్యత్తులో మంచి గుర్తింపు పొందుతుందనే ఆశతో ఉన్నానని అన్నారు.

10. భారత భూభాగాలను నేపాల్‌ ఆక్రమించింది: ప్రధాని బాలేంద్ర

నేపాల్ ప్రధాని బాలేంద్ర షా పార్లమెంటులో మాట్లాడుతూ, భారత్-నేపాల్ సరిహద్దు వివాదంలో నేపాల్ మాత్రమే కాదు, భారత్ కూడా భూ ఆక్రమణలకు పాల్పడిందని వ్యాఖ్యానించి వివాదానికి తెరలేపారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు, సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో నేపాల్ విదేశాంగశాఖ వివరణ ఇస్తూ, ప్రధాని వ్యాఖ్యలు సరిహద్దు ప్రాంతాల్లోని నివాసాలు, స్థానిక ఆక్రమణల గురించేనని తెలిపింది. భారత్-నేపాల్ మధ్య ఉన్న లిపులేఖ్, లింపియాధురా, కాలాపాని సరిహద్దు వివాదాలను దౌత్య చర్చల ద్వారా పరిష్కరించేందుకు రెండు దేశాలూ అంగీకరించాయని చెప్పింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed