Top10 News: తెలంగాణ పబ్లిక్ స్కూల్.. ఏపీలో మేకప్ వ్యాఖ్యల మంటలు.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews

Top10 News: తెలంగాణ పబ్లిక్ స్కూల్.. ఏపీలో మేకప్ వ్యాఖ్యల మంటలు.. ఈ రోజు టాప్10 న్యూస్ |


ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి వసతులతో ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా కొత్త విధానాన్ని తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో నిర్మించిన ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ (టీపీఎస్) పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభానికి సిద్ధమైంది. సకల సౌకర్యాలతో ముస్తాబైన ఈ ప్రతిష్టాత్మక పాఠశాల భవనాన్ని రేపు (జూన్ 17న) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యను అందించనుంది ఈ మోడల్ స్కూల్.

2. నాకు రేవంత్‌రెడ్డి సర్టిఫికెట్‌ అవసరం లేదు

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టులను దొడ్డిదారిన ఆపే అలవాటు తమ పార్టీకి లేదన్న కిషన్ రెడ్డి.. సీఎం రేవంత్‌రెడ్డి తనపై చేసిన విమర్శల్ని తిప్పికొట్టారు. తమకు కాంగ్రెస్ నాయకుల సర్టిఫికెట్ అవసరం లేదనీ, తాము తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారీ అని చెప్పారు. పాలని చేతకాని సీఎం తన అసమర్థతని కప్పి పుచ్చుకోవడానికి, నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు.

3. గురుకులాల్లో రూ.2000 కోట్ల స్కామ్‌!

తెలంగాణలోని గురుకుల పాఠశాలల టెండర్లలో రూ.2000 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. తాను వాస్తవాలు మాట్లాడుతుంటే మంత్రులు పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్ అవగాహన లేకుండా తనకు సవాళ్లు విసురుతున్నారని విమర్శించారు. దుస్తులు, బూట్లు, నిత్యావసర వస్తువుల కొనుగోళ్లకు సంబంధించిన టెండర్ల వివరాలు కనీసం మంత్రులకే తెలియకపోవడం విచారకరమన్నారు. కరీంనగర్ జిల్లా అల్గనూర్‌లో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ టెండర్లన్నీ సీఎం అన్నదమ్ములే మింగుతున్నారని ఆరోపించారు.

4. ‘సీబీఎన్@361 డిగ్రీస్.. పాలీమ్యాథ్‌’ పుస్తకావిష్కరణ

దార్శనిక నేతగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ సందర్భాల్లో తీసుకున్న సంచలన నిర్ణయాలను విశ్లేషిస్తూ ఒక ప్రత్యేక పుస్తకాన్ని రూపొందించారు. ‘సీబీఎన్@361 డిగ్రీస్.. పాలీమ్యాథ్’ పేరుతో వచ్చిన ఈ గ్రంథాన్ని చంద్రబాబు సింగపూర్‌లో ఘనంగా ఆవిష్కరించారు. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సింగపూర్‌లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే పాల్గొన్నారు. ఈ పుస్తకాన్ని శాఖమూరు శ్రీనివాస ప్రసాద్ రచించగా, విశ్రాంత ఐఏఎస్ అధికారి కేవీ సత్యనారాయణ ఇంగ్లీష్‌లోకి అనువదించారు.

5. అనితపై వ్యాఖ్యలను ఖండించిన పవన్‌ కల్యాణ్

హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత అమర్నాథ్‌ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. మహిళల కట్టు, బొట్టుపై మాట్లాడటం సగటు స్త్రీ సమాజాన్ని కించపరచడమేనని ఆయన ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విమర్శలు ఎప్పుడైనా కేవలం విధానపరంగానే ఉండాలి తప్ప వ్యక్తిగతంగా దిగజారకూడదని హితవు పలికారు. కూటమి నాయకులు కూడా అవతలి పార్టీ లాగా నోరు జారకుండా పౌర సమాజం మెచ్చే భాషలోనే బలంగా బదులివ్వాలని సూచించారు.

6. చీరలో ఫైట్లు చేయడం చాలా కష్టమైంది

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సమంత స్వయంగా సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక సోమవారం రాత్రి హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ నటిగానే కాకుండా నిర్మాతగా బాధ్యతలు మోయడం చాలా కష్టమైన విషయమని ఈ సినిమాతో తెలిసిందని చెప్పారు.

7. TG20 లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ

క్రికెట్ ప్రేమికులను అలరించేందుకు ఈ నెల 21 నుంచి సరికొత్తగా ‘TG20 లీగ్’ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక లీగ్‌కు టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ ట్యాంక్‌బండ్‌పై రేపు (జూన్ 17) గ్రాండ్‌గా ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. మొత్తం ఎనిమిది జట్లు తలపడే ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ జులై 11న ఉప్పల్ స్టేడియంలో జరగనుండగా, విజేతకు రూ.కోటి ప్రైజ్ మనీ దక్కనుంది.

8. కుప్పకూలిన భారీ విమానం.. 8 మంది మృతి

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ఒక ఘోర వైమానిక ప్రమాదం జరిగింది. యూఎస్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన అత్యంత భారీ, శక్తివంతమైన B-52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్ విమానం రన్‌వేపై కుప్పకూలిపోయింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే జరిగిన ఈ ప్రమాదంలో విమానం పూర్తిగా కాలి బూడిదైంది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది సైనిక సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధృవీకరించారు.

9. నేను జోక్యం చేసుకోకుంటే ఇజ్రాయెల్‌ ఉండేది కాదు

ఇజ్రాయెల్‌ దేశ రక్షణ, భద్రతకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తాను సరైన సమయంలో జోక్యం చేసుకోకపోయి ఉంటే ఇజ్రాయెల్‌ దేశం ఎప్పుడో నాశనమయ్యేదని అన్నారు. ప్రధాని నెతన్యాహుతో తనకు మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, లెబనాన్‌ విషయంలో ఆయన అనుసరిస్తున్న తీరు నచ్చలేదన్నారు. జీ-7 సదస్సు సందర్భంగా ఖతార్‌ ఎమిర్‌తో జరిగిన సమావేశంలో ట్రంప్ ఈ విషయాలను వెల్లడించారు.

10. అమెరికా-ఇరాన్ డీల్‌పై నెతన్యాహు సంచలన నిర్ణయం

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వెనక్కి తగ్గడం లేదు. లెబనాన్, గాజా, సిరియా సరిహద్దుల నుంచి తమ దేశ సైన్యాన్ని ఉపసంహరించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అమెరికా తీసుకునే ఏకపక్ష నిర్ణయాలు తమ దేశ భద్రతకు వర్తించవని నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. ఈ అంతర్జాతీయ డీల్ వల్ల ఇజ్రాయెల్ దేశీయ రాజకీయాల్లో నెతన్యాహు పదవికి ముప్పు పొంచి ఉందనే విశ్లేషకులు వస్తున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *