Top10 News: స్కూళ్లు ప్రారంభం.. సీఎం రేవంత్ పాలనపై సెటైర్లు.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews

Top10 News: స్కూళ్లు ప్రారంభం.. సీఎం రేవంత్ పాలనపై సెటైర్లు.. ఈ రోజు టాప్10 న్యూస్ |


సీఎం రేవంత్ రెడ్డి పాలన ఫస్టాఫ్ అట్టర్ ఫ్లాప్ అనీ, కాంగ్రెస్ సర్కారు వేలాది మంది ఇళ్లను కూల్చడమే కాకుండా ఎన్నికల హామీలను కూడా నెరవేర్చలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మీనాక్షి నటరాజన్‌కు వెన్నుపోటు పొడిచింది రేవంత్ రెడ్డేనని ఆరోపిస్తూ, ఖైరతాబాద్ నియోజకవర్గానికి త్వరలోనే ఉపఎన్నిక వస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

2. రేపే స్కూళ్లు ప్రారంభం.

రాష్ట్రంలో రేపటి నుంచి స్కూళ్లు ప్రారంభం కానున్న తరుణంలో విద్యార్థుల సురక్షిత ప్రయాణానికి పాఠశాలల వేళల ప్రకారం అన్ని రూట్లలో బస్సులు నడపనున్నట్లు టీజీఎస్‌ఆర్‌టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. మరోవైపు రేపటి నుంచే పాఠ్యపుస్తకాల పంపిణీకి విద్యాశాఖ ఏర్పాట్లు చేయగా, ఇప్పటికే 80 శాతం పుస్తకాలు స్కూళ్లకు చేరాయని, ఈ నెలాఖరులోగా ఎడ్యుకేషన్ కిట్లను కూడా పంపిణీ చేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

3. హైదరాబాద్‌లో కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసన ప్రదర్శన

పరీక్షా పత్రాల లీకేజీలు, విద్యావ్యవస్థలోని అవకతవకలను నిరసిస్తూ హైదరాబాద్‌ ధర్నాచౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది. పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళితో పాటు యువత పెద్దఎత్తున పాల్గొన్న ఈ ధర్నాలో, నీట్ లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

4. కేంద్రం ఇచ్చిన నిధులపై సీఎం రేవంత్‌ చర్చకు రావాలి

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క కుటుంబమే బాగుపడిందని విమర్శించిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. జీహెచ్‌ఎంసీ మూడు కార్పొరేషన్లుగా మారిన తరుణంలో వాటిలో బీజేపీ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెబుతూ, ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి తమను ఓడించాలని చూస్తున్నాయని ఆయన ఆరోపించారు.

5. అమెరికా ఆజ్ఞలను మోదీ పాటిస్తున్నారు

అమెరికా దాడుల్లో భారత నావికులు మరణించిన ఘటనపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహిస్తున్నారని, అమెరికా ఆంక్షలకు లొంగిపోయారని ఆరోపించారు. ఒమన్ తీరంలో భారతీయులు ఉన్న నౌకలపై దాడుల్లో ముగ్గురు నావికులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మాట్లాడారు. భారత పౌరులు మరణించినా అమెరికా పశ్చాత్తాపం చూపకుండా ఆంక్షలు కొనసాగిస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు.

6. తెలంగాణలో భారీ వర్షాలు

నైరుతీ రుతుపవనాలు హైదరాబాద్‌తో పాటు దక్షిణ, మధ్య తెలంగాణ ప్రాంతాలకు విస్తరించాయని, రాబోయే మూడు రోజుల్లో ఇవి ఉత్తర తెలంగాణకు కూడా చేరుకోనున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రుతుపవనాల రాక వల్ల రానున్న రోజుల్లో హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని అధికారులు శుభవార్త చెప్పారు.

7. ప్రతి పెళ్లిలోనూ అలాంటోడు ఉంటాడు

దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతుండగా, కథానాయిక జాన్వీ కపూర్ పాత్రపై వచ్చిన విమర్శలను ఆయన ప్రస్తావించారు. సినిమాపై 95 శాతం మంది ప్రేక్షకులు ప్రశంసలు కురిపించగా, కొద్ది మంది మాత్రమే ఇతర అంశాలపై మాట్లాడారని చెప్పారు. బుధవారం నుంచి థియేటర్లలో జాన్వీ కపూర్, జగపతి బాబు పాత్రలకు సంబంధించిన కొత్త సన్నివేశాలు జోడించనున్నట్లు వెల్లడించారు. ప్రేక్షకులు ముఖ్యంగా క్రీడా స్ఫూర్తి, రామ్‌చరణ్ నటనను మెచ్చుకుంటున్నారని బుచ్చిబాబు తెలిపారు. విమర్శలు చిన్న విషయాలేనని, తన పోరాటం ‘పెద్ది’ పాత్ర తరహాలోనే ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

8. మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ తన స్వగ్రామం తుమ్మన్‌పేట విద్యార్థులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ది దేవరకొండ ఫౌండేషన్ అధ్వర్యంలో అచ్చంపేట డివిజన్‌లోని 45 ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల ప్రతిభావంతులైన విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు ప్రకటించారు. 9, 10వ తరగతుల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు ఈ ఉపకారవేతనాలు అందజేశారు.

9. భారత డీఎన్‌ఏలోనే ఇన్నోవేషన్‌ ఉంది

భారత్‌ డీఎన్‌ఏలోనే ఆవిష్కరణలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌లోని నీస్‌ నగరంలో జరిగిన ‘భారత్‌ ఇన్నోవేట్స్‌’ కార్యక్రమంలో తెలిపారు. కృత్రిమ మేధ రంగంలో భారత్‌కు అపార అవకాశాలు ఉన్నాయని, దేశంలో 2 లక్షలకు పైగా స్టార్టప్‌లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తున్నాయని చెప్పారు. భారత్‌ కేవలం ఆవిష్కరణలను వినియోగించే దేశం మాత్రమే కాకుండా, ప్రపంచానికి సహకారం అందించే దేశంగా ఎదిగిందని మోదీ తెలిపారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ, ఏఐ, వాతావరణ మార్పులు, పౌర అణుశక్తి రంగాల్లో ఇరు దేశాల భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని అన్నారు.

10. ఇరాన్‌ ప్రమాదకర ఉచ్చు.. వెనక్కి తగ్గిన ట్రంప్‌..!

ఇరాన్‌ శుద్ధి చేసిన యురేనియం అమెరికా చేతికి చిక్కకుండా రహస్యంగా నిల్వలను కాపాడేందుకు సొరంగాలు కూల్చివేసి, పేలుడు పదార్థాలతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. దీంతో భవిష్యత్తులో యురేనియం స్వాధీనం లేదా అప్పగింత ప్రక్రియ క్లిష్టంగా మారే అవకాశం ఉందని అమెరికా భావిస్తోంది. యురేనియాన్ని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా మే నెలలో కమాండో ఆపరేషన్‌ను పరిశీలించినప్పటికీ, భారీ ప్రాణనష్టం, ప్రాంతీయ ఉద్రిక్తతల భయంతో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చివరి నిమిషంలో ఆ ప్రణాళికకు ఆమోదం ఇవ్వలేదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports