కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య అధికారికంగా రాజీనామా చేశారు. ఆయన డీకే శివకుమార్‌తో కలిసి లోక్‌భవన్ సెక్రెటరీకి తన రాజీనామా లేఖను సమర్పించారు. నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసేంత వరకు సిద్ధరామయ్యే ఆపద్ధర్మ సీఎంగా కొనసాగనున్నారు.
2. ముగిసిన విజయసాయిరెడ్డి విచారణ
ఏపీ మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ విచారణ ముగిసింది. బషీర్‌బాగ్ కార్యాలయంలో అధికారులు ఆయన్ను ఏడున్నర గంటల పాటు ప్రశ్నించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని విజయసాయిరెడ్డి తెలిపారు. మద్యం అక్రమాలకు సంబంధించిన పూర్తి వివరాలు రాజ్ కెసిరెడ్డికి తెలుసని ఆయన అన్నారు.
3. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్
హైదరాబాద్ అమీర్‌పేటలోని మైత్రీవనం చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన 23 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. గత ఎన్నికల ప్రచారంలో అభిమానులకు ఇచ్చిన హామీని ఆయన నిలబెట్టుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అధ్వర్యంలో నిర్మించిన ఈ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించడం విశేషం. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.
4. ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ ఇవ్వాలి!
తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ ఇవ్వాలనేది ప్రజలందరి డిమాండ్ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు అంకితమై వాటిని భావితరాలకు అందించడం మన బాధ్యత అని చెప్పారు. ఆయన ఆశయ సాధన కోసమే లోకేశ్ మహిళలకు 33 శాతం సీట్ల ప్రకటన చేశారని తెలిపారు. చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని చంద్రబాబు అన్నారు.
5. టీడీపీ మహానాడు కాదు “దగా నాడు”
మాజీ మంత్రి ఆర్కే రోజా టీడీపీ మహానాడు సమావేశంపై తీవ్ర విమర్శలు చేశారు. మహానాడులో నేతల భాష, ప్రవర్తన చాలా అసహ్యంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇది మహానాడు కాదు, ప్రజలను వంచించే “దగా నాడు” అని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయని ఆరోపించారు.
6. పొంగులేటికి మాట నిలబెట్టుకొనే దమ్ముందా?
తెలంగాణలో 20 లక్షల ఇళ్లు ఇచ్చాకే ఓట్లు అడుగుతామన్న మంత్రి పొంగులేటికి కేటీఆర్ సవాల్ విసిరారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకొనే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. వీకెండ్లో పేదల ఇళ్లు కూల్చి ఆనందించే వారికి ఇళ్ల గురించి మాట్లాడే అర్హత లేదు. తాము కట్టిన ఒక్కో డబుల్ బెడ్రూమ్ ఇల్లు.. 7 ఇందిరమ్మ ఇళ్లతో సమానమని కేటీఆర్ అన్నారు.
7. ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్ల దాడి
ఉక్రెయిన్‌లోని దక్షిణ నౌకాశ్రయ నగరం ఒడెస్సాపై రష్యా డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ భీకర దాడిలో ఇద్దరు పిల్లలతో సహా మొత్తం 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. వైమానిక దాడి కారణంగా కొన్ని నివాస గృహాలు, దుకాణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
8. అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు
పశ్చిమాసియాలో శాంతి చర్చలు జరుగుతున్న తరుణంలోనే అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణలు రేగాయి. హర్మూజ్ జలసంధి సమీపంలో అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. అగ్రరాజ్య సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. అమెరికా పదే పదే ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని ఇరాన్ సైన్యం ఆరోపించింది.
9. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్
నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించారు. తెలుగు ప్రజలకు ఆయన చేసిన విశేష సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తాతకు ప్రణామం అర్పించేందుకు ఆయన ఉదయమే ఘాట్‌కు వచ్చారు. ప్రముఖుల రాక దృష్ట్యా పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
10. ‘పెద్ది’ పైరసీకి అడ్డుకట్ట..
‘పెద్ది’ సినిమా పైరసీకి అడ్డుకట్ట వేసేందుకు మద్రాస్ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చిత్రం అనధికారికంగా ఇంటర్నెట్లో లీక్ అయితే నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లుతుందని కోర్టు అభిప్రాయపడింది. సినిమాను అక్రమంగా అప్లోడ్ చేయడం, కాపీ చేయడాన్ని నిరోధిస్తూ మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. చిత్ర నిర్మాణ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై వెకేషన్ బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది.












