Last Updated:
TTD Ghee Adulteration: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నెయ్యి కల్తీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైదరాబాద్ జోనల్ కార్యాలయం కీలక పురోగతి సాధించింది.
మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ), 2002 లోని సెక్షన్ 19 కింద 2026 సెప్టెంబర్ 17న నిందితుడు కైలాష్ చంద్ మంగ్లాను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను విశాఖపట్నంలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. టీటీడీకి మోసపూరితంగా కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో నేరపూరిత కుట్ర, చీటింగ్, ఫోర్జరీ, అవినీతి ఆరోపణలపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ దర్యాప్తు ప్రారంభించింది. రీఫైన్డ్ పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, పామోలిన్ మరియు MG-90, మోనోగ్లిజరైడ్స్, మైవాసెట్ సాఫ్ట్ 400, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ వంటి రసాయనాలను ఉపయోగించి ఈ కల్తీ నెయ్యిని తయారు చేసినట్లు దర్యాప్తులో తేలింది. అనంతరం దానిని ‘అగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యి’గా టీటీడీకి సరఫరా చేశారు.
2019 నుండి 2024 వరకు టీటీడీకి జరిగిన దాదాపు రూ. 230 కోట్ల విలువైన కల్తీ నెయ్యి సరఫరాలో ఒక్క కైలాష్ చంద్ మంగ్లానే సుమారు రూ. 96 కోట్ల విలువైన కల్తీ నెయ్యిని తయారు చేసినట్లు వెల్లడైంది. ‘సుకృతి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ ప్రమోటర్ అయిన కైలాష్ చంద్ మంగ్లా, తన ఫ్యాక్టరీ ప్రాంగణంలో కల్తీ నెయ్యిని తయారు చేయడమే కాకుండా, శ్రీ వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్, మాల్గంగా మిల్క్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్, ఏఆర్ డెయిరీ ఫుడ్స్ వంటి ఇతర సంస్థల ద్వారా సరఫరాను సమన్వయం చేశారు.
కల్తీ రసాయనాల వినియోగాన్ని దాచిపెట్టి, అంతా నిజమైన ఆవు నెయ్యి తయారీగానే భ్రమ కల్పించడానికి నెయ్యి, పామాయిల్ కొనుగోలు-అమ్మకాలకు సంబంధించిన నకిలీ రికార్డులను కూడా సృష్టించినట్లు అధికారులు గుర్తించారు. ఇంతకుముందు ఈ కేసు దర్యాప్తులో భాగంగా ‘భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్’ ప్రమోటర్ మరియు డైరెక్టర్ విపిన్ జైన్‌ను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ కేసుపై తదుపరి విచారణ కొనసాగుతోంది.
టీటీడీ నెయ్యిలో జంతు కొవ్వు లేదని ఈడీ స్పష్టం చేసింది. సీబీఐ ఆధ్వర్యంలోని సెట్, ఈడీ దర్యాప్తులోనూ టీటీడీ శ్రీవారి ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు ఉపయోగించినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఈడీ దర్యాప్తులో నెయ్యిలో రసాయనాలు, వృక్ష ఆధారిత పదార్థాలతో కల్తీ చేసినట్లు తేలిందని పేర్కొంది. జంతు కొవ్వు అంటూ ఇన్ని రోజులు భక్తుల మనోభావాలు దెబ్బతీసారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.














