Last Updated:
టీటీడీ కొత్త డోనర్ పాలసీని ప్రకటించింది. దాతలకు పారదర్శక సౌకర్యాలు, సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా ఈ విధానం మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దాతల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. దాతలకు ఇప్పటివరకు అందిస్తున్న సౌకర్యాలను మరింత పారదర్శకంగా, సమతుల్యంగా అమలు చేయడంతో పాటు, సామాన్య భక్తుల దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొత్త డోనర్ పాలసీని తీసుకువస్తున్నట్లు టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర ప్రకటించారు. భక్తుల ప్రయోజనాలు, దర్శన నిర్వహణ, దాతల గౌరవం అన్నింటినీ సమన్వయం చేసేలా ఈ విధానాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు.
ఈ కొత్త డోనర్ పాలసీ మంగళవారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వస్తుందని ఈఓ స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే టీటీడీకి విరాళాలు అందించిన దాతలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి ప్రస్తుతం అమల్లో ఉన్న అన్ని సౌకర్యాలు యథాతథంగా కొనసాగుతాయని చెప్పారు. కొత్త నిబంధనలు ఇకపై టీటీడీకి విరాళాలు అందించే కొత్త దాతలకు మాత్రమే వర్తిస్తాయని వెల్లడించారు.
దాతల సేవలను గౌరవించడం టీటీడీ బాధ్యతేనని, అదే సమయంలో కోట్లాది మంది సామాన్య భక్తుల దర్శనానికి కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈఓ పేర్కొన్నారు. అందుకే ప్రత్యేక దర్శనాల నిర్వహణలో సమతుల్యతను తీసుకురావడం, దర్శన వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించడం లక్ష్యంగా ఈ కొత్త పాలసీని రూపొందించినట్లు వివరించారు.
ప్రస్తుతం టీటీడీకి వివిధ ట్రస్టుల ద్వారా సుమారు 1.90 లక్షల మంది దాతలు ఉన్నారని ముద్దాడ రవిచంద్ర వెల్లడించారు. వీరిలో రూ.10 లక్షల విరాళం కేటగిరీలోనే దాదాపు 22 వేల మంది ఉన్నారని తెలిపారు. గత నాలుగు నెలల వ్యవధిలోనే మరో 2 వేల మంది ఈ కేటగిరీలో చేరడం టీటీడీకి విరాళాలు అందించే భక్తుల సంఖ్య ఎంత వేగంగా పెరుగుతోందో సూచిస్తోందన్నారు.
దాతల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతున్న నేపథ్యంలో, ప్రత్యేక దర్శనాల నిర్వహణ మరింత సవాలుగా మారుతోందని ఈఓ తెలిపారు. ఈ పరిస్థితుల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా, దాతలకు అందించే సౌకర్యాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ కొత్త డోనర్ పాలసీని అమలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూనే, దర్శన వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని టీటీడీ స్పష్టం చేసింది.
Tirupati,Chittoor,Andhra Pradesh













