Twisha Death Case: సంచలనం సృష్టించిన ట్విషా కేసులో సీబీఐ కీలక అడుగు..‘టన్నెల్ వ్యూ’ టెక్నిక్‌తో దర్యాప్తు | | ACTPnews

Twisha Death Case: సంచలనం సృష్టించిన ట్విషా కేసులో సీబీఐ కీలక అడుగు..‘టన్నెల్ వ్యూ’ టెక్నిక్‌తో దర్యాప్తు |


న్యూస్ 18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. ఈ ప్రత్యేక సాంకేతిక విధానంతో ట్విషా మరణానికి ముందు జరిగిన ప్రతి ఘటనను నిమిషానికోసారి డిజిటల్ రూపంలో తిరిగి నిర్మించేందుకు సీబీఐ ప్రయత్నిస్తోంది. సంఘటన జరిగిన ఇంట్లోని గదుల అమరిక, ఆమె కదలికలు, ఇంట్లోకి ఎవరు వెళ్లారు, ఎప్పుడు బయటకు వచ్చారు వంటి వివరాలను సమగ్రంగా విశ్లేషించనున్నారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ ఫోన్ డేటా, వై-ఫై లాగ్స్, ఇంటర్నెట్ వినియోగ సమాచారం, కాల్ డీటెయిల్ రికార్డులు (CDRs), స్మార్ట్ డివైస్ డేటా, ఫోరెన్సిక్ ఆధారాలు మరియు సాక్షుల వాంగ్మూలాలను ఒకే టైమ్‌లైన్‌లో సమన్వయం చేస్తున్నారు.

దర్యాప్తు బృందం ప్రస్తుతం కటారా హిల్స్‌లోని నివాసాన్ని వర్చువల్ మోడల్ రూపంలో మళ్లీ రూపొందిస్తోంది. ట్విషా చివరి గంటల్లో జరిగిన ప్రతి కదలికను అర్థం చేసుకునేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా సీసీటీవీ టైమ్ స్టాంప్స్‌ను మొబైల్ వినియోగం, ఇంటర్నెట్ యాక్టివిటీతో పోల్చి పూర్తి డిజిటల్ సిమ్యులేషన్ సిద్ధం చేస్తున్నారు.

ఈ “టన్నెల్ వ్యూ” విశ్లేషణ ద్వారా ఘటనకు సంబంధించిన టైమ్‌లైన్‌లో ఎక్కడైనా ఖాళీలు ఉన్నాయా, అనుమానాస్పద కదలికలు జరిగాయా, సాక్షుల వాంగ్మూలాల్లో విరుద్ధతలున్నాయా వంటి అంశాలను గుర్తించవచ్చని అధికారులు చెబుతున్నారు. అలాగే సంఘటన అనంతరం ఆధారాలను మార్చే ప్రయత్నం జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ట్విషాపై ఒత్తిడి తెచ్చారా, వేధింపులకు గురిచేశారా లేదా పెద్ద కుట్ర ఏదైనా ఉందా అనే అంశాలను కూడా సీబీఐ పరిశీలిస్తోంది.

నోయిడాకు చెందిన ట్విషా శర్మ గత ఏడాది డిసెంబర్‌లో సమర్థ్ సింగ్‌ను వివాహం చేసుకుని భోపాల్‌కు వెళ్లింది. మే 12న ఆమె అత్తింట్లో ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. అనంతరం ట్విషా తల్లిదండ్రులు ఆమె భర్త, అత్తింటి కుటుంబంపై వరకట్న వేధింపులు, మానసిక హింస, శారీరక వేధింపుల ఆరోపణలు చేశారు. ట్విషా అత్త గిరిబాలా సింగ్‌,  మాజీ జిల్లా న్యాయమూర్తి,  దర్యాప్తును ప్రభావితం చేయడానికి ప్రయత్నించిందని కూడా ఆరోపించారు.

మొదటి పోస్టుమార్టంపై అనుమానాలు వ్యక్తం చేసిన ట్విషా కుటుంబం రెండోసారి పోస్టుమార్టం చేయాలని డిమాండ్ చేసింది. రెండో పోస్టుమార్టం అనంతరం మే 24న ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ఈ పరీక్షను ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు భోపాల్‌లో నిర్వహించారు.

ఈ కేసులో ట్విషా భర్త సమర్థ్ సింగ్‌ను పోలీసులు మే 22న జబల్‌పూర్‌లో అదుపులోకి తీసుకున్నారు. దాదాపు పది రోజుల పాటు అతను కనిపించకుండా ఉండగా, విస్తృత గాలింపు అనంతరం అధికారుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, మే 28న సీబీఐ మరో కీలక చర్య చేపట్టింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ రక్షణను రద్దు చేసిన ఒక రోజు తర్వాత ట్విషా అత్త గిరిబాలా సింగ్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. భోపాల్‌లోని ఆమె నివాసంలో విచారణ జరిపిన అనంతరం అదుపులోకి తీసుకున్న అధికారులు, మరింత కస్టడీ విచారణ కోసం కోర్టులో హాజరుపరిచే అవకాశముందని సమాచారం.

రాబోయే రోజుల్లో ఈ కేసులో దర్యాప్తు మరింత వేగం అందుకునే అవకాశం ఉంది. డిజిటల్ ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికలు, నిందితుల వాంగ్మూలాలను పరస్పరం పరిశీలిస్తూ ట్విషా శర్మ మరణానికి దారితీసిన అసలు పరిస్థితులను వెలికితీయడంపై సీబీఐ దృష్టి సారించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports