Last Updated:
పశ్చిమ ఆసియాలో యుద్ధాన్ని ముగించడానికి జరుగుతున్న దౌత్యపరమైన ప్రయత్నాలు పూర్తిగా స్తంభించిపోవడంతో ఇరాన్ చర్చల బృందం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సదరు వార్తా సంస్థ పేర్కొంది.
US-Iran War: పశ్చిమ ఆసియా (మిడిల్ ఈస్ట్)లో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. లేబనాన్‌లో ఇజ్రాయెల్ తన సైనిక చర్యలను మరింత విస్తృతం చేయడాన్ని నిరసిస్తూ.. అమెరికాతో మధ్యవర్తుల ద్వారా జరుగుతున్న దౌత్యపరమైన చర్చలను ఇరాన్ సోమవారం రద్దు చేసుకుంది. ఈ మేరకు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ‘తస్నిమ్’ (Tasnim) ఒక ప్రకటన విడుదల చేసింది. పశ్చిమ ఆసియాలో యుద్ధాన్ని ముగించడానికి జరుగుతున్న దౌత్యపరమైన ప్రయత్నాలు పూర్తిగా స్తంభించిపోవడంతో ఇరాన్ చర్చల బృందం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సదరు వార్తా సంస్థ పేర్కొంది.
ఈ చర్చల నిలిపివేతపై ఇరాన్ ప్రతినిధులు స్పందిస్తూ.. “లెబనాన్‌లో ఇజ్రాయెల్ నిరంతరం సాగిస్తున్న అకృత్యాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. కాల్పుల విరమణ ఒప్పందానికి లెబనాన్ అంశం ఒక ముఖ్యమైన ముందస్తు షరతు. కానీ ఇప్పుడు లెబనాన్‌తో సహా అన్ని రంగాలలోనూ ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించింది. అందుకే మధ్యవర్తుల ద్వారా అమెరికాతో జరుపుతున్న చర్చలను, పత్రాల మార్పిడిని ఇరాన్ బృందం తాత్కాలికంగా నిలిపివేస్తోంది” అని తస్నిమ్ నివేదించింది.
ఆక్రమిత ప్రాంతాల నుండి ఇజ్రాయెల్ దళాలు పూర్తిగా వెనక్కి వెళ్లాలని, అలాగే గాజా, లెబనాన్‌లలో సైనిక చర్యలను పూర్తిగా నిలిపివేయాలనే తమ డిమాండ్లు నెరవేరే వరకు అమెరికాతో దౌత్యపరమైన చర్చలను తిరిగి ప్రారంభించే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది.
ఈ నిర్ణయానికి కొద్దిసేపటి ముందే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ సోషల్ మీడియా వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌లను హెచ్చరించారు. లెబనాన్‌లో ఉద్రిక్తతలు పెంచడం అంటే.. అమెరికాతో కుదిరిన విస్తృత కాల్పుల విరమణ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని ఆయన స్పష్టం చేశారు.
“ఇరాన్-అమెరికా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అనేది నిస్సందేహంగా లేబనాన్‌తో సహా అన్ని రంగాలకు వర్తిస్తుంది. ఏదైనా ఒక రంగంలో దీనిని ఉల్లంఘిస్తే, అది అన్ని వైపులా ఉల్లంఘించినట్లే అవుతుంది. దీనివల్ల వచ్చే పరిణామాలకు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.” అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ పేర్కొన్నారు.
అమెరికాతో దౌత్య సంబంధాలు తెంచుకోవడంతో పాటు, ఇరాన్ తన కూటమి దేశాలతో కలిసి అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ను పూర్తిగా స్తంభించిపోయేలా చేయడానికి కార్యాచరణ సిద్ధం చేసినట్లు ప్రకటించింది.
దీనితో పాటు ఎర్రసముద్రంలోని ‘బాబ్ ఎల్ మండేబ్’ (Bab El Mandeb) జలసంధి లోనూ ఇతర వ్యూహాత్మక పంథాలను అస్త్రాలుగా మార్చి, ఇజ్రాయెల్ మరియు దానికి మద్దతు ఇస్తున్న దేశాలను ఆర్థికంగా, సైనికంగా ‘శిక్షించాలని’ ఇరాన్ కూటమి నిర్ణయించింది. గాజా, లేబనాన్‌లలో ఇజ్రాయెల్ క్రూరమైన ఆర్మీ ఆపరేషన్లను తక్షణమే ఆపాలని, లేదంటే ఈ ప్రతిఘటన మరింత తీవ్రంగా ఉంటుందని ఇరాన్ పట్టుబడుతోంది. ఈ పరిణామాల వల్ల అంతర్జాతీయ చమురు సరఫరాకు మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Jun 02, 2026 11:59 AM IST













