Last Updated:
US Russia Sanctions Act 2026: ప్రపంచ దేశాలకు నీతులు చెబుతూ, ఆంక్షల పేరుతో బెదిరింపులకు దిగే అగ్రరాజ్యం అమెరికా ద్వంద్వ వైఖరి మరోసారి అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
రష్యా నుంచి ఎవరూ ఎలాంటి వాణిజ్య లావాదేవీలు నిర్వహించవద్దని హెచ్చరిస్తూనే, తన సొంత అవసరాల కోసం మాత్రం నిబంధనలను యథేచ్ఛగా తుంగలో తొక్కుతోంది. ముఖ్యంగా రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునే దేశాల ఎగుమతులపై ఏకంగా 100 శాతం వరకు తీవ్ర సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్న వేళ, అమెరికా స్వయంగా రష్యా నుంచి భారీగా యురేనియం దిగుమతి చేసుకుంటుండటం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో విస్మయం కలిగిస్తోంది.
రష్యా, ఇరాన్, చైనాతో పాటు భారత్ వంటి దేశాల వ్యూహాత్మక ప్రయోజనాలను ఒకేసారి దెబ్బతీసే ఉద్దేశంతో అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్) ఉభయ సభలు ప్రతిష్టాత్మక ‘ది లిండ్సే ఓ గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్-2026’ బిల్లును ఇటీవలే ఆమోదించాయి. ఈ బిల్లు చట్టరూపం దాల్చడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం ఒక్కటే లాంఛనంగా మిగిలి ఉంది. అయితే, ఈ చట్టంలో అమెరికా సర్కారు ఇతర దేశాలపై కఠిన ఆంక్షలు రుద్దుతూనే, తన సొంత అణు ఇంధన రంగానికి ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు యురేనియం దిగుమతులకు సంబంధించి ప్రత్యేక మినహాయింపులను పొందుపరుచుకుంది. అంటే, ఇంధన కొరత ఉన్న భారత్ వంటి దేశాలు రష్యా నుంచి ముడి చమురు కొంటే శిక్షార్హులవుతారని బెదిరిస్తూ, తమ అణు విద్యుత్ కేంద్రాల కోసం అవసరమైన రష్యన్ యురేనియంను మాత్రం అమెరికా నిర్లజ్జగా దిగుమతి చేసుకోవడమేంటన్న ప్రశ్నలు అంతర్జాతీయ వేదికలపై వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు పశ్చిమాసియాలో తీవ్ర యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో అమెరికా దౌత్య వ్యూహాలకు ఐక్యరాజ్యసమితి (UN) భద్రతా మండలిలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌పై అంతర్జాతీయ ఆంక్షల అమలును పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన ఐరాస నిపుణుల కమిటీ కాలపరిమితిని మరో ఏడాది పాటు పొడిగించాలని అమెరికా ప్రతిపాదించింది. అయితే, భద్రతా మండలిలో వీటో అధికారం కలిగిన శాశ్వత సభ్య దేశాలైన రష్యా, చైనాలు అమెరికా తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వీటోను ప్రయోగించాయి. ఈ ప్రతిపాదనపై జరిగిన ఓటింగ్‌లో అమెరికాకు అనుకూలంగా 11 ఓట్లు, వ్యతిరేకంగా 2 ఓట్లు వచ్చినప్పటికీ, రష్యా-చైనాల వీటో కారణంగా అమెరికా ప్రతిపాదన వీగిపోయింది. సోమాలియా, పాకిస్థాన్‌తో పాటు వామపక్ష దేశాలు ఈ ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఇరాన్‌ను ఆర్థికంగా ఏకాకిని చేసి కట్టడి చేయాలని చూస్తున్న అమెరికా ప్రయత్నాలకు ఇది పెద్ద ఎదురుదెబ్బగా నిలిచింది.
ఇరాన్‌తో సరైన, పటిష్టమైన ఒప్పందం కుదిరితేనే ముందుకు వెళ్తామని, లేదంటే ఎలాంటి చర్చలు ఉండబోవని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా షరతులకు అనుగుణంగా ఉంటేనే సంప్రదింపులు సాధ్యమవుతాయన్నారు. న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల వేళ.. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్ దేశాలతో కూడిన గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) అధినేతలతో ట్రంప్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. పశ్చిమాసియా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ కీలక భేటీలో చర్చించనున్నారు.














