గత ఏడాది పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ విధానం ఆధారంగా, ఎంపిక చేసిన దేశాల దరఖాస్తుదారులు బీ-వన్ (బిజినెస్), బీ-టూ (టూరిస్ట్) వీసాలు పొందేందుకు ముందస్తుగా గరిష్టంగా 20,000 డాలర్ల (సుమారుగా 17 లక్షల రూపాయలు) వరకు సెక్యూరిటీ బాండ్‌ను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రాగోమెన్ రిపోర్టుల ప్రకారం, కాన్సులర్ అధికారులకు దరఖాస్తుదారుల ఆర్థిక పరిస్థితి, విద్య, ఇతర బ్యాక్గ్రౌండ్లను బట్టీ.. 10వేలు, 15 వేలు లేదా 20వేల డాలర్ల వరకు బాండ్ వసూలు చేసే అధికారం ఉంటుంది. ఒకవేళ సదరు ప్రయాణికులు తమ వీసా నిబంధనలను ఉల్లంఘించకుండా, సమయానికి తిరిగి తమ దేశాలకు వెళ్లిపోతే ఈ బాండ్ మొత్తాన్ని పూర్తిగా వాపసు (Refund) చేస్తారు. కానీ ఇలా ముందే మనీ చెల్లించడానికి.. చేతిలో మనీ ఉండాలి కదా?
కొత్త ఇమ్మిగ్రేషన్ రూల్స్ అనగానే చాలా మంది.. భారతీయులు, ముఖ్యంగా ఎన్నారైలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే వాస్తవానికి భారతీయులకు బాండ్ షాక్ లేదు. ఎకనామిక్ టైమ్స్ రిపోర్టు ప్రకారం, అమెరికా అమలు చేస్తున్న ఈ తాజా వీసా బాండ్ ప్రోగ్రామ్ 50 దేశాలకు మాత్రమే పరిమితమైంది. ఈ జాబితాలో భారతదేశం పేరు లేదు.
అంటే, భారత్ నుంచి అమెరికాకు బిజినెస్ లేదా టూరిస్ట్ వీసాల మీద వెళ్లాలనుకునే వారు ఎవరూ కూడా ఈ 20వేల డాలర్ల భారీ బాండ్‌ను చెల్లించాల్సిన అవసరం లేదు. వారు ఎప్పటిలాగే పాత పద్ధతిలోనే వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ 50 దేశాల జాబితాలో అధిక శాతం ఆఫ్రికన్ దేశాలు ఉన్నాయి. మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ దేశాల పౌరులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ స్పష్టం చేసింది.
అమెరికా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ‘వీసా ఓవర్‌స్టే’ (Visa Overstays) సమస్యను అరికట్టడమే. టూరిస్ట్ వీసాలపై అమెరికా వెళ్లి, వీసా గడువు తీరిపోయిన తర్వాత కూడా చట్టవిరుద్ధంగా అక్కడే ఉండిపోతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధికారుల సమాచారం ప్రకారం, జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లకుండా చూడటం, సరైన సమాచార మార్పిడి వ్యవస్థలు లేని దేశాలను నియంత్రించడం ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశ్యం.
ఈ విధానం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కఠినమైన ఇమ్మిగ్రేషన్ సంస్కరణల్లో భాగమని కొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, వేల డాలర్ల భారాన్ని మోపడం వల్ల చట్టబద్ధంగా ప్రయాణించే పర్యాటకులకు కూడా తీవ్ర అవరోధం ఏర్పడుతుందని కొన్ని మానవ హక్కుల సంఘాలు, ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు ట్రంప్ విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్నారు.
పర్యాటక వీసాల విషయంలో భారత్‌కు బాండ్ నుంచి మినహాయింపు దక్కినప్పటికీ, ఇతర వీసాల విషయంలో మాత్రం నిబంధనలు కఠినతరం అవుతున్నాయి. ఎక్స్ఛేంజ్ విజిటర్స్, పరిశోధకుల కోసం ఉద్దేశించిన జే-వన్ (J-1) వీసాల విషయంలో కూడా కఠినమైన కాంప్లియెన్స్ రూల్స్ తీసుకురావాలని ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని ప్రకారం, వీసా స్టేటస్ నిబంధనలను ఉల్లంఘిస్తే వెంటనే వీసాను రద్దు చేసే అవకాశాలు పెరుగుతాయి. అలాగే, ఎఫ్-వన్ విద్యార్థి వీసాపై వెళ్లేవారు సైతం ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారుల (CBP) కఠిన తనిఖీలను ఎదుర్కోవాల్సి వస్తోంది. సరైన పత్రాలు లేకపోయినా, ఫోన్లలో.. అనుమతి లేని ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం ఉన్నా.. వెనక్కి పంపేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
కాబట్టి, టూరిస్ట్ వీసాపై అమెరికా వెళ్లే భారతీయులకు బాండ్ విధానం లేకపోయినా, అమెరికా చట్టాలను విధిగా గౌరవిస్తూ, సరైన వీసా కేటగిరీకి కట్టుబడి ఉండటం వల్ల భవిష్యత్తులో ఎలాంటి చిక్కులు రాకుండా ఉంటాయి. భవిష్యత్తులో ఆ 50 దేశాల జాబితాను మార్చే అధికారం అమెరికాకు ఉన్నందున, ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడం ఎంతో అవసరం.













