Last Updated:
ప్రపంచకప్ గెలిచిన టాప్ ఆర్డర్ బ్యాటర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లపైనే టీమ్ మేనేజ్‌మెంట్ ప్రస్తుతానికి నమ్మకం ఉంచడంతో వైభవ్‌కు నిరీక్షణ ఎదురైంది.
Vaibhav sooryavanshi: భారత యువ సంచలనం, 15 ఏళ్ల ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సీనియర్ టీమిండియా అరంగేట్రం (Debut) కోసం మరికొంత కాలం వేచి చూడక తప్పేలా లేదు. ప్రపంచకప్ గెలిచిన టాప్ ఆర్డర్ బ్యాటర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లపైనే టీమ్ మేనేజ్‌మెంట్ ప్రస్తుతానికి నమ్మకం ఉంచడంతో వైభవ్‌కు నిరీక్షణ ఎదురైంది.
ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో పాటు, ప్రస్తుతం కొనసాగుతున్న ఇంగ్లాండ్ పర్యటనకు కూడా ఈ 15 ఏళ్ల యువ ఆటగాడు తొలిసారి అంతర్జాతీయ పిలుపు అందుకోవడంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది. అయితే ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన సూర్యవంశీ.. బుధవారం చెస్టర్-లీ-స్ట్రీట్ (రివర్‌సైడ్ గ్రౌండ్) లో ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టీ20లోనూ బెంచ్‌కే పరిమితమయ్యాడు.
ఈ నిరీక్షణపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సోనీ స్పోర్ట్స్ ఛానల్‌లో స్పందిస్తూ.. వైభవ్ ఎంత ఎక్కువ కాలం వేచి చూస్తే, అతడు బరిలోకి దిగినప్పుడు అంచనాల భారం అంతగా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. అయితే 15 ఏళ్ల వయస్సులో ఆ ఒత్తిడిని అతడు పెద్దగా పట్టించుకోకపోవచ్చని అన్నారు.
“సూర్యవంశీకి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. కానీ, 15 ఏళ్ల వయసులో ఒత్తిడి గురించి ఎక్కువగా ఆలోచించరు. రెండో లేదా మూడో మ్యాచ్‌లో అవకాశం వస్తే వెంటనే పరుగుల వరద పారించాలనే విషయం అతనికి తెలుసు. అయినప్పటికీ, ప్రస్తుతానికి అతడు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అద్భుతమైన ఆటగాళ్లతో కలిసి ప్రయాణించడం, వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవడం చాలా గొప్ప విషయం” అని గవాస్కర్ పేర్కొన్నారు.
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఈ మొదటి టీ20 మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను ఓపెనర్ అభిషేక్ శర్మ (24 బంతుల్లో 59 పరుగులు), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (47 బంతుల్లో 68 పరుగులు) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌లతో ఆదుకున్నారు.
మరోవైపు సంజూ శాంసన్ (1), ఇషాన్ కిషన్ (0), తిలక్ వర్మ (13) నిరాశపరిచినప్పటికీ.. చివర్లో శివమ్ దూబే కేవలం 21 బంతుల్లోనే 42 పరుగులతో అజేయంగా రాణించి స్కోరును బోర్డును పరిగెత్తించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
భారత్ నిర్దేశించిన 190 పరుగుల భారీ లక్ష్యంతో ఇంగ్లాండ్ చేజ్ ప్రారంభించాల్సిన తరుణంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా మ్యాచ్‌ను పూర్తిగా రద్దు (Abandoned) చేశారు.
ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ శనివారం (జూలై 4వ తేదీన) మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లోనైనా యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ దక్కుతుందో లేదో చూడాలి.
లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana
Jul 02, 2026 12:50 PM IST













