ఈ కార్యక్రమానికి వాస్విక్ గ్రూప్ చైర్మన్, సినీ నిర్మాత నిడిగొండ నరేష్ ప్రజాపతి, వాస్విక్ ఫౌండేషన్ వైస్ చైర్మెన్ నూకల భాస్కర్ రెడ్డి, దర్శకుడు వేముగంటి తదితరులు నాయకత్వం వహించారు. కార్యక్రమంలో మొక్కల వెంకటయ్యను ప్రత్యేకంగా సన్మానించగా, మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న పలువురు సేవాభావం కలిగిన వ్యక్తులకు వనజీవి అవార్డులను అందజేశారు.
సమాజానికి పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని అందించిన మహనీయుడు దరిపల్లి రామయ్య జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించిన ‘వనజీవి రామయ్య’ లఘుచిత్రం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసే ‘గద్దర్ అవార్డ్స్’లో ఉత్తమ లఘుచిత్రాల విభాగానికి ఎంపిక కావడం విశేషం. ఈ చిత్రంలో బ్రహ్మాజీ టైటిల్ పాత్రలో నటించగా, నంది అవార్డు గ్రహీత వేముగంటి దర్శకత్వం వహించారు. నిడిగొండ నరేష్ కుమార్ ప్రజాపతి, నిర్మాతగా వ్యవహరించారు. డా. కళా రంగా కథను అందించగా, బల్లేపల్లి మోహన్ సంగీతాన్ని సమకూర్చారు.
ఈ సందర్భంగా మొక్కల సత్యనారాయణ, మొక్కల వెంకటయ్య మాట్లాడుతూ, ప్రకృతి పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చెట్లు మనిషి జీవితానికి ప్రాణాధారం అని, ప్రతి కుటుంబం కనీసం కొన్ని మొక్కలైనా నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. వనజీవి రామయ్య చూపిన మార్గం నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు.
నిర్మాత నిడిగొండ నరేష్ ప్రజాపతి మాట్లాడుతూ, “నీటి కరువు, పర్యావరణ సంక్షోభం వంటి సమస్యలను సుమారు 50 ఏళ్ల క్రితమే ముందుగానే గుర్తించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చిన దూరదృష్టి కలిగిన మహనీయుడు వనజీవి రామయ్య. ఆయన ఆశయాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటే యాత్రను చేపట్టబోతున్నాం. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి స్వచ్ఛమైన గాలిని భావితరాలకు అందించాలి. గ్రామాల్లోని పల్లె ప్రకృతి వనాలకు వనజీవి రామయ్య పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే ప్రస్తుతం లఘుచిత్రంగా రూపొందిన ‘వనజీవి రామయ్య’ను పాన్ ఇండియా స్థాయిలో పూర్తి స్థాయి ఫీచర్ చిత్రంగా నిర్మించనున్నాం” అని ప్రకటించారు.
దర్శకుడు వేముగంటి మాట్లాడుతూ, “దాదాపు ఏడు దశాబ్దాల పాటు తన జీవితాన్నే మొక్కల కోసం అంకితం చేసిన వనజీవి రామయ్యను భావితరాలు ఎన్నటికీ మరచిపోకూడదు. ఆయన సేవలు, జీవన తత్వం ప్రతి ఒక్కరికీ చేరాలనే లక్ష్యంతో ‘వనజీవి రామయ్య’ చిత్రాన్ని రూపొందించాం. ఈ సినిమా ద్వారా పర్యావరణ పరిరక్షణపై మరింత అవగాహన కలుగుతుందని ఆశిస్తున్నాం” అన్నారు.
హీరోయిన్ నాగరాణి మాట్లాడుతూ, “ఇంత గొప్ప సందేశాత్మక చిత్రంలో భాగస్వామ్యం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సమాజానికి ఉపయోగపడే ఇలాంటి మంచి సినిమాలు మరెన్నో రావాలి. ఈ అవకాశం కల్పించిన దర్శకుడు, నిర్మాతలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు” అని అన్నారు.
సంగీత దర్శకుడు బల్లేపల్లి మోహన్ మాట్లాడుతూ, “ప్రకృతినే జీవితంగా భావించి కోట్లాది మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు వనజీవి రామయ్య. అలాంటి మహనీయుడి జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రానికి సంగీతం అందించడం నా కెరీర్లో గర్వించదగ్గ అవకాశంగా భావిస్తున్నాను. దర్శకుడు వేముగంటి ఈ చిత్రాన్ని ఎంతో హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించగా, నిర్మాతలు ఎలాంటి రాజీ లేకుండా మంచి సందేశాన్ని ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేశారు. ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుందని నమ్ముతున్నాను” అన్నారు.
కార్యక్రమంలో వాస్విక్ ఫౌండేషన్ సభ్యులు నూకల నర్సింహారెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ మల్లిక్ తేజ, మాజీసైనికులు వెంకట అప్పారావు, విశ్వనాథ సింగరేణి రిటైర్డ్ జీఎం, వినయ్ రెడ్డి ,మహేంద్ర వర్మ, నవీన్ , వాస్విక్ ఫౌండేషన్ సేవ సైనికులు అలాగే సాహిత్య, సామాజిక రంగాలకు చెందిన ప్రముఖులు, పర్యావరణ ప్రేమికులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని వనజీవి దరిపల్లి రామయ్య సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సంకల్పించారు.












