Last Updated:
వంతారా వన్యప్రాణుల రక్షణ, పరిరక్షణ పనులపై గత కొంతకాలంగా వస్తున్న ఆరోపణలన్నింటినీ తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు స్పష్టమైన, సమగ్రమైన తీర్పును వెలువరించింది.
Vantara: గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్ ఫౌండేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వన్యప్రాణుల రక్షణ, పునరావాస కేంద్రం ‘వంతారా’ (Vantara)కు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఉపశమనం లభించింది. వంతారా వన్యప్రాణుల రక్షణ, పరిరక్షణ పనులపై గత కొంతకాలంగా వస్తున్న ఆరోపణలన్నింటినీ తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు స్పష్టమైన, సమగ్రమైన తీర్పును వెలువరించింది. వంతారా కార్యకలాపాలన్నీ చట్టబద్ధంగా, నైతికంగానే జరుగుతున్నాయని న్యాయస్థానం స్పష్టం చేసింది.
జామ్‌నగర్ కేంద్రా నికి సంబంధించిన జంతువుల బదిలీలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI), వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో (WCCB), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) లతో సరికొత్తగా దర్యాప్తు చేయించాలని కోరుతూ ‘కరుణార్థం విరామ ఫౌండేషన్’ ఈ అప్లికేషన్‌ను దాఖలు చేసింది.
జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్.వి. అంజారియాలతో కూడిన ధర్మాసనం.. వంతారాపై వచ్చిన ఆరోపణలను తిరిగి విచారించాలని దాఖలైన కొత్త దరఖాస్తును పూర్తిగా కొట్టివేసింది. గతంలో సుప్రీంకోర్టు నియమించిన ఉన్నత స్థాయి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఇప్పటికే ఈ అంశాలపై సమగ్ర విచారణ జరిపిందని ధర్మాసనం గుర్తుచేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఏర్పాటైన ఈ ఎస్‌ఐటీలో ఒక హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, మాజీ పోలీస్ కమిషనర్, సీనియర్ కస్టమ్స్ అధికారి సభ్యులుగా ఉన్నారు. దేశంలోని అగ్రగామి నియంత్రణ, అమలు సంస్థల సహాయంతో ఈ బృందం వంతారాకు అనుకూలంగా పూర్తి స్పష్టమైన నివేదికను ఇచ్చింది.
యూఏఈ (UAE), వెనిజులా, బ్రెజిల్, చెక్ రిపబ్లిక్, సౌత్ ఆఫ్రికా వంటి పలు దేశాల నుండి వంతారాకు జరిగిన ప్రతి జంతువు బదిలీని కోర్టు క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ బదిలీలన్నీ చట్టబద్ధంగా, వాణిజ్యేతర ప్రయోజనాల కోసం (Non-commercial), అంతర్జాతీయ ‘సైట్స్’ (CITES) నిబంధనల ప్రకారం చెల్లుబాటు అయ్యే ఎగుమతి, దిగుమతి పర్మిట్లు మరియు ‘సెంట్రల్ జూ అథారిటీ’ (CZA) యొక్క అవసరమైన అనుమతులతో జూ-టు-జూ (Zoo-to-Zoo) పద్ధతిలోనే జరిగాయని కోర్టు నిర్ధారించింది. ఒకవేళ విదేశీ ఎగుమతిదారు వారి స్వదేశంలో ఏదైనా చిన్నపాటి లోపాలు చేసి ఉంటే, చట్టబద్ధంగా జంతువులను స్వీకరించిన భారతీయ సంస్థపై ఆ బాధ్యతను మోపలేమని కోర్టు స్పష్టం చేసింది.
జామ్‌నగర్‌లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా అంతర్జాతీయ స్థాయి వన్యప్రాణుల పరిరక్షణ పనులు జరుగుతున్నాయని సుప్రీంకోర్టు గుర్తించింది. అంతరించిపోతున్న ‘మకావ్’ (Macaws) పక్షి జాతులను తిరిగి వాటి సహజ సిద్ధమైన వాతావరణంలోకి చేర్చడానికి బ్రెజిల్‌తో నేరుగా భాగస్వామ్యం కావడం, అంతర్జాతీయ జాతుల పునరుద్ధరణ కోసం సంరక్షణ ప్రజనన కార్యక్రమాలను (Conservation Breeding Programme) నిర్వహించడాన్ని కోర్టు కొనియాడింది. చట్టబద్ధంగా ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత, పూర్తి సంరక్షణలో ఉన్న జంతువుల వాతావరణాన్ని కలవరపెట్టడం కూడా ఒక రకమైన క్రూరత్వమే అవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. వంతారా ఏ సంక్షేమ సూత్రాల ఆధారంగా స్థాపించబడిందో, దానికి కోర్టు మద్దతు పలికింది.
అంతేకాకుండా, వంతారా, దాని ట్రస్టీలు, డైరెక్టర్లు, మేనేజ్‌మెంట్‌తో పాటు దానిని స్థాపించిన రిలయన్స్ ఫౌండేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థలకు పూర్తి చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయని కోర్టు గుర్తించింది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని భారతదేశ ‘సైట్స్’ నిబంధనలను మరింత బలోపేతం చేసేందుకు మాత్రమే కోర్టు కొన్ని దిశానిర్దేశాలు జారీ చేసింది.
సుప్రీంకోర్టు తీర్పుపై వంతారా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) వివహాన్ కరానీ స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. “ఈ తీర్పు మేము మొదటి నుండి నమ్ముతున్న నిజాన్ని నిరూపించింది. మా సంరక్షణలో ఉన్న ప్రతి జంతువు చట్టబద్ధంగానే వచ్చింది, నైతికంగానే చూసుకోబడుతోంది. దేశ అత్యున్నత న్యాయస్థానం మా పనిలోని నిజాయితీని, దాని వెనుక ఉన్న ఆశయాన్ని గుర్తించింది. వంతారాలో వన్యప్రాణుల పరిరక్షణ అనేది కేవలం మాటలకే పరిమితం కాదు.. అది ప్రతిరోజూ చూపే కారుణ్యం. మమ్మల్ని విమర్శించిన వారికి మేము ఇచ్చే సమాధానం ఒక్కటే.. ‘ప్రతి ప్రాణం ముఖ్యమే’ (Every Life Matters). మాపై బాధ్యత మరింత పెరిగింది, మాపై ఆధారపడిన వన్యప్రాణుల కోసం మేము మరింత కట్టుబడి పని చేస్తాం” అని ఆయన పేర్కొన్నారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













