VB-G RAM G: గ్రామీణ కార్మికులకు గుడ్‌న్యూస్.. జూలై 1 నుంచి 125 రోజుల ఉపాధి హామీ అమలు | | ACTPnews

VB-G RAM G: గ్రామీణ కార్మికులకు గుడ్‌న్యూస్.. జూలై 1 నుంచి 125 రోజుల ఉపాధి హామీ అమలు |


కొత్త చట్టం ప్రకారం అర్హత కలిగిన ప్రతి గ్రామీణ కుటుంబానికి ప్రస్తుతం ఉన్న 100 రోజుల ఉపాధి హామీని 125 రోజులకు పెంచారు. అదనంగా సహజ వనరుల పరిరక్షణ, నీటి సంరక్షణ, వ్యవసాయం, అనుబంధ రంగాలు, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, మహిళా స్వయం సహాయక సంఘాల సాధికారత, సాంకేతిక ఆధారిత పారదర్శక పాలన వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

చట్టం అమలుకు ముందు కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, అర్హత కలిగిన ఏ గ్రామీణ కార్మికుడు ఒక్కరోజు కూడా పని లేకుండా ఉండకూడదన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సమన్వయం చేసుకుని పరిపాలనా, ఆర్థిక, సాంకేతిక ఏర్పాట్లన్నీ పూర్తి చేసిందని చెప్పారు.

కొత్త వ్యవస్థలోకి మారే ప్రక్రియ ఎలాంటి అంతరాయం లేకుండా సాగేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.95,692.31 కోట్ల మధ్యంతర నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దీంతో పనులు నిరంతరాయంగా కొనసాగడమే కాకుండా కూలీలకు వేతనాలు సకాలంలో చెల్లించే అవకాశం ఉంటుందని కేంద్రం వెల్లడించింది. కొత్త విధానం అమల్లోకి వచ్చిన తొలి రోజు నుంచే ఎలాంటి ఆటంకాలు లేకుండా కార్యక్రమాలు కొనసాగించేలా ఏర్పాట్లు చేశామని స్పష్టం చేసింది.

ప్రస్తుతం కొనసాగుతున్న పనులు యథావిధిగా కొనసాగుతాయని, ఇప్పటికే ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేసిన జాబ్ కార్డులు కొత్త గ్రామీణ రోజ్‌గార్ గ్యారంటీ కార్డులు జారీ చేసే వరకు చెల్లుబాటులోనే ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. దీంతో ఉపాధి అవకాశాలు లేదా వేతనాల చెల్లింపుల్లో అంతరాయం ఉండదని పేర్కొంది.

ఈ చట్టంలో గ్రామపంచాయతీలకు కీలక బాధ్యతలు అప్పగించారు. గ్రామస్థాయి ప్రణాళికలు, శాశ్వత ఆస్తుల నిర్మాణం, సహజ వనరుల నిర్వహణ, నీటి సంరక్షణ, వ్యవసాయ అభివృద్ధి, గ్రామీణ మౌలిక వసతులు, మహిళా స్వయం సహాయక సంఘాల ప్రోత్సాహం, ఇతర గ్రామీణ అభివృద్ధి పథకాలతో సమన్వయం వంటి అంశాల్లో పంచాయతీలు ప్రధాన పాత్ర పోషించనున్నాయి. దీని ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు స్థిరమైన జీవనోపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

ఇటీవల నిర్వహించిన రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళన్ (RGVS)లో అన్ని రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి మంత్రులు ఈ చట్టాన్ని జూలై 1 నుంచి అమలు చేయడానికి రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు తెలియజేశారు. ఇప్పటికే 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు బడ్జెట్ కేటాయింపులు చేయగా, 24 రాష్ట్రాలు తమ రాష్ట్ర స్థాయి VB-G RAM G పథకాన్ని అధికారికంగా నోటిఫై చేశాయి.

ఇదిలా ఉండగా, వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ) చట్టం–2025 జాతీయ స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని 2026 జూలై 2న ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించనున్నారు. తిరుపతి జిల్లా ఒబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లి గ్రామంలో జరిగే ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించనున్నారు.

ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, కేంద్ర సహాయ మంత్రులు డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, కమలేష్ పాస్వాన్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.

ప్రారంభోత్సవంలో భాగంగా లబ్ధిదారులకు గ్రామీణ రోజ్‌గార్ గ్యారంటీ కార్డులు పంపిణీ చేయనున్నారు. అలాగే మిషన్‌ను అధికారికంగా ప్రారంభించడంతో పాటు అవగాహన చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. మిషన్‌కు సంబంధించిన ఓపీనియన్ వ్యాసాల సంకలన గ్రంథం (Compendium of Op-Ed Articles)ను కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించనున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed