Last Updated:
Viral News: ప్రేమించాడని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. ఆ ముచ్చట మూడునాళ్లే అన్నట్లుగా మారిపోయింది. ఇష్టపడి పెళ్లి చేసుకున్న భర్త తనను ప్రేమగా చూసుకుంటాడని భావించిన ఆమెకు అత్తారిల్లే జైలుగా మారింది.
ప్రేమించాడని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. ఆ ముచ్చట మూడునాళ్లే అన్నట్లుగా మారిపోయింది. ఇష్టపడి పెళ్లి చేసుకున్న భర్త తనను ప్రేమగా చూసుకుంటాడని భావించిన ఆమెకు అత్తారిల్లే జైలుగా మారింది. చదువుకున్న వివాహితగా స్వేచ్ఛ లేకపోవడంతో పాటు భర్త, అత్తమామలు పెట్టే అదనపు కట్న వేధింపులతో తాళాలు వేసిన నాలుగు గోడల గదిలో బంధీగా 8 నెలలు బయటి ప్రపంచానికి తెలియకుండా జీవించింది. సీన్ కట్ చేస్తే చివరకు తన భర్తే వేరే యువతితో సహజీవనం చేయడమే కాకుండా తనను వదిలించుకునేందుకు విడాకులు కూడా పంపడంతో ఆమె పడుతున్న బాధ తల్లి మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో జైలుగా మారిన అత్తారింట్లోంచి చయనికదాస్ అనే మహిళకు విముక్తి లభించింది. అస్సాం రాష్ట్రంలోని బొంగైగావ్ జిల్లాలో జరిగిన ఈఘటన ఇప్పుడు మీడియాలో వైరల్‌గా మారింది.
అస్సాం రాష్ట్రంలోని బొంగైగావ్ జిల్లాలో విచారకరమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చయనిక దాస్ అనే మహిళను ఆమె భర్త , అత్తమామలు 8 నెలల పాటు తమ ఇంట్లోనే బంధించినట్లుగా తేలడంతో సెప్టెంబర్ 22 మంగళవారం ఉదయం పోలీసులతో పాటు స్థానిక అధికారులు ఆమెను బంధించిన గది తలుపులు పగలగొట్టి చయనిక దాస్‌ని రక్షించారు. చయనిక దాస్ స్థానిక వ్యాపారవేత్తగా ఉన్న అన్షుమాన్ కలితను 2022 ఫిబ్రవరి 25న సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. పెళ్లైన కొద్ది రోజుల నుంచి అన్షుమాన్ అదనపు కట్నం, ఆస్తి కోసం తన భార్య చయనిక దాస్‌ని శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. రాను రాను ఈ టార్చర్ మరింత పెరగడమే కాకుండా ఆమెకు తీవ్ర మనోవేధనకు గురి చేశాయి.
చయనిక దాస్ అన్షుమాన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు తనను బాగా చూసుకుంటాడని భావించానని కాని కట్నం, డబ్బు కోసం వేధిస్తారని కలలో కూడా ఊహించలేదని గదిలోంచి విముక్తి పొందిన తర్వాత చయనిక మీడియాతో అసలు విషయం బయటపెట్టింది. తగినంత కట్నం తీసుకురాలేదని, డబ్బు , లగ్జరీ కారు పుట్టింటి నుంచి తీసుకురమ్మని వేధించే వాడని తెలిపింది. అన్షుమాన్ చెప్పినట్లుగా అదనపు కట్నం తీసుకురాకపోవడంతో జీవన అవసరాలకు తనకు డబ్బు ఇవ్వడం మానేశాడని.. అన్షుమాన్ ఎక్కడికైనా వెళ్తుంటే చయనికను పుట్టింట్లో వదిలిపెట్టేవాడని తెలిపింది. భర్త సరిగా చూసుకోకపోవడం, కట్నం కోసం వేధించడం, ఇంటి ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో చయనిక బ్యాంకింగ్ సర్వీస్ ఆఫీసర్ ఎగ్జామ్స్ రాసి పాసైంది. ఓ బ్యాంకులో ఉద్యోగం కూడా వచ్చింది. అయితే జాబ్ ప్రస్తుతం తన భర్త ఉంటున్న ఊరికి దూరం కావడంతో జాబ్ చేయాలా వద్దా అనే దానిపై భర్త సలహా తీసుకుంది. తన భర్త జాబ్ చేయవద్దని చెప్పినా కనీసం ఉద్యోగం సంపాదించానని సంతోషం ఉండేదని.. కాని తన భర్త జాబ్ చేయడానికి కూడా అంగీకరించాడని తెలిపింది.
చయనికకు వచ్చిన బ్యాంక్ జాబ్ తన అత్తవారింటికి దూరంగా ఉండటంతో ఒక్కతే అక్కడే ఉండి ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే జాబ్ కోసం అత్తారిల్లు వదిలి సొంత ఇంట్లో ఉంటుందో అప్పుడు భర్త ఫోన్ చేయడం, కలవడం, కనీసం ఆమె ఇంటివైపు కూడా రాలేదని చెప్పింది. అంతే కాదు ఉద్యోగం కోసం వెళ్లిన తనను తిరిగి అత్తవారింటికి కూడా వెళ్లనివ్వలేదన్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో తన భర్త ప్రవర్తన, అత్తమామల వరకట్నం కోసం తనను వదిలించుకోవడం చూసి నాకు అనుమానం కలిగిందని దాన్ని నివృత్తి చేసుకునేందుకు సీక్రెట్‌గా భర్త ఉంటున్న ఇంటికి వెళ్లి చూస్తే మంచంపైన వేరే మహిళ చెవిపోగులు, కండోమ్‌లతో పాటు వేరే వాళ్ల వ్యక్తిగత వస్తువులు కనిపించాయని గదిలోంచి బయటకు వచ్చిన తర్వాత భర్త బండారం బయటపెట్టింది. నా భర్త ఒక స్థానిక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆలస్యంగా తెలుసుకున్నట్లుగా చెప్పింది.
జాబ్ పేరుతో వేరో చోట చయనిక ఉండటంతో భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఎలాగైనా తన భర్తతో కాపురం చేయాలని ఆలోచనతో చయనిక అన్హుమన్ని అత్తారింటికి తీసుకెళ్లమని బలవంతం చేసినా నిరాకరించినట్లుగా తెలిపింది. అంతే కాదు తన భర్త అక్రమ సంబంధం తనకు తెలిసిపోవడంతో విడాకులు ఇవ్వాలని కోరితే తాను అంగీకరించలేదని చెప్పింది. ఆ తర్వాతే తనను వేధించడం, గదిలో తలుపులు వేసి తాళంతో బంధించారని తెలిపింది. నవంబర్ నెలలో అన్హుమన్ అతని అన్నయ్య ప్లాబన్ కలిత ఆ ఇంటి బయటి గేటుకు తాళం వేసి చయనికను లోపలే బంధించి ఉంచారని ఆరోపణలు ఉన్నాయి. ఇంట్లో ఆమెతో పాటు ఒక పనిమనిషి ఉన్నప్పటికీ, చయనిక బయటకు అడుగు పెట్టకుండా కఠినంగా నిషేధించారు.
చయనికను ఆ విధంగా గదిలో లాక్ చేసిన సమయంలో భర్త తన భార్యకు విడాకుల నోటీసును నేరుగా ఆమె తల్లి నివాసానికి పంపారు. బందీగా ఉన్నందున ఆ చట్టపరమైన నోటీసు గురించి చయనికకు ఏమాత్రం తెలియదు. తన కుమార్తె పడుతున్న వేదనను భరించలేక, చయనిక తల్లి అస్సాం రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకువచ్చింది. మహిళా కమిషన్, జిల్లా యంత్రాంగం, పోలీసులు కలిసి చయనికను గదిలోంచి బయటకు తెచ్చారు. ఆమెను వెంటనే వైద్య పరీక్షల కోసం తరలించారు. ఈ దిగ్భ్రాంతికరమైన ఘటన ఆ ప్రాంతం అంతటా తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసింది.














