Last Updated:
ఫేక్ పోలీస్ రవి అలియాస్ నిఖిల్ యాదవ్, తెలంగాణ సచివాలయంలో యూనిఫాంలో రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్‌లో పోస్టు, సైఫాబాద్ పోలీసులు అరెస్ట్, ఐటీ చట్టం కింద కేసు
తెలంగాణ రాష్ట్ర పరిపాలన సౌధం, అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో చోటుచేసుకున్న ఒక వింత ఘటన కలకలం రేపింది. పోలీసు యూనిఫాంలో లోపలికి ప్రవేశించి, రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన ఒక ‘ఫేక్ పోలీస్’ ఉదంతం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడిని సైఫాబాద్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సైఫాబాద్ ఏసీపీ ఆర్. సంజయ్ కుమార్ మీడియాకు వెల్లడించారు.
ఆంధ్రప్రభ కధనం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలుకు చెందిన రవి (అలియాస్ నిఖిల్ యాదవ్) అనే వ్యక్తి కొద్దిరోజుల క్రితం తన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు వచ్చాడు. సరదాగా నగరాన్ని చుట్టేయాలనుకున్న అతనికి ఒక వింత ఆలోచన వచ్చింది. సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే పిచ్చితో ఏకంగా సచివాలయాన్నే వేదికగా చేసుకున్నాడు. పోలీసు యూనిఫాం ధరించి, సచివాలయంలో తాను సెక్యూరిటీ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నట్లు కలరింగ్ ఇచ్చాడు.
అంతటితో ఆగకుండా, సచివాలయం లోపల రీల్స్ చేస్తూ ఒక వీడియోను ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అందులో “నేను సెక్రటేరియట్ సెక్యూరిటీలో డ్యూటీ చేస్తున్నాను.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎవరైనా కలవాలనుకుంటే నేరుగా నాకు ఫోన్ చేయండి, నేనే మిమ్మల్ని తీసుకెళ్తాను” అంటూ ఫోన్ నంబర్‌తో సహా ప్రచారం చేసుకున్నాడు. ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో అటు ప్రజల్లో గందరగోళం, ఇటు పోలీస్ శాఖలో తీవ్ర దుమారం రేగింది.
వీడియో వైరల్ అయిన వెంటనే అప్రమత్తమైన ఉన్నతాధికారులు దీనిపై విచారణకు ఆదేశించారు. సైఫాబాద్ పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. రవి తన కుటుంబ సభ్యులతో కలిసి సచివాలయానికి వచ్చాడు. లోపలికి వెళ్లి ఫోటోలు దిగుతామని, తమను అనుమతించాలని అక్కడ ఉన్న భద్రతా సిబ్బందిని బతిమలాడాడు. కుటుంబంతో వచ్చాడు కదా అని మానవతా దృక్పథంతో సెక్యూరిటీ పర్మిషన్ ఇవ్వగా, ఆ అవకాశాన్ని రవి దుర్వినియోగం చేశాడు.
లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు పోలీసు యూనిఫాం ధరించి, వీడియోలు చిత్రీకరించాడు. సాధారణ పౌరుడిగా వెళ్లి, ఖాకీ దుస్తుల్లో రీల్స్ చేసి సోషల్ మీడియాను తప్పుదోవ పట్టించాడు. ఇతను ఒంగోలుకు చెందిన రవి అని, కేవలం ఇంటర్నెట్‌లో లైక్స్, ఫాలోవర్ల కోసం ఇలాంటి పిచ్చి పనులకు పాల్పడతాడని పోలీసులు గుర్తించారు. గతంలో ఇతనిపై కొన్ని ఫిర్యాదులు ఉన్నట్లు సమాచారం.
రవి చేసిన ఈ పని వల్ల సచివాలయం వంటి అత్యంత సున్నితమైన ప్రాంతం భద్రతపై ప్రశ్నలు తలెత్తాయి. నిందితుడి అడ్రస్ ఫోన్ నంబర్ ఆధారంగా గాలించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రవిపై చీటింగ్ కేసుతో పాటు, ఐటీ చట్టం (IT Act) లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బుధవారం నాడు రవి అలియాస్ నిఖిల్ యాదవ్ ను అధికారికంగా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై స్పందించిన ఏసీపీ సంజయ్ కుమార్.. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ప్రభుత్వ కార్యాలయాల్లో, నిషేధిత ప్రాంతాల్లో ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా పోలీసుల పేరుతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, ప్రజలను నమ్మించడం తీవ్రమైన నేరమని స్పష్టం చేశారు.
Hyderabad,Telangana











