Last Updated:
ఢిల్లీలోని తిలక్ నగర్‌లో రోడ్డు పనులను తనిఖీ చేస్తున్న పీడబ్ల్యూడీ మంత్రి పర్వేశ్ వర్మ సహనం కోల్పోయి వీడియో తీస్తున్న యువకుడి చెంప పగలగొట్టారు. ఆప్ కార్యకర్త తన కుటుంబాన్ని దూషించాడని మంత్రి వివరణ ఇవ్వగా, ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో ప్రజా పనుల విభాగం (PWD) మంత్రి, బీజేపీ నేత పర్వేశ్ వర్మ ఆదివారం తిలక్ నగర్‌లో రోడ్డు నిర్మాణ పనులను తనిఖీ చేస్తుండగా తీవ్ర వివాదం చెలరేగింది. కొత్తగా వేసిన రోడ్డు నాణ్యతను పరిశీలిస్తున్న సమయంలో సహనం కోల్పోయిన మంత్రి అక్కడే వీడియో రికార్డు చేస్తున్న ఓ యువకుడి చెంప పగలగొట్టారు. మంత్రి తన ఎడమ చేత్తో యువకుడి మొబైల్ ఫోన్‌ను కిందకు లాగి, కుడి చేత్తో చెంపపై కొట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. వెంటనే ఆ యువకుడు మంత్రిని నిలదీసేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది మధ్యలోకి వచ్చి అడ్డుకున్నారు.
ఈ ఘటనపై రాజకీయ దుమారం రేగడంతో కొన్ని గంటల తర్వాత పర్వేశ్ వర్మ ఎక్స్ వేదికగా ఓ వీడియో సందేశం విడుదల చేశారు. తాను కొట్టిన వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త అని, తన కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించడం వల్లే ఆగ్రహం కట్టలు తెంచుకుందని వివరణ ఇచ్చారు. అయితే ఈరోజు జరిగిన ఘటన వెనుక పూర్తి నిజం ఇదేనని, కానీ జరిగింది మాత్రం జరగకుండా ఉండాల్సిందని ఆయన వ్యాఖ్యానించారు.
सत्ता का नशा सिर पर चढ़ा हुआ है भाजपाईयों के
BJP के मंत्री प्रवेश वर्मा ने इस लड़के को सरेआम झन्नाटेदार थप्पड़ मार दिया
क्योंकि लड़का खराब सड़क को लेकर BJP मंत्री से सवाल कर रहा था
जब यह नशा उतरेगा तो बड़े बड़ों के होश ठिकाने आयेंगे pic.twitter.com/q5S3Z0Vzuw
— Supriya Shrinate (@SupriyaShrinate) September 27, 2026
వైరల్ వీడియోలో మంత్రి కొట్టగానే.. “ఓయ్ ఎలా కొడుతున్నావు? వీడియో తీస్తుండగానే చెంపదెబ్బ కొట్టేశారు.. సామాన్యుడిని ఎవరూ కొట్టలేరు” అంటూ అక్కడున్న స్థానికులు అరిచిన మాటలు స్పష్టంగా వినిపించాయి. అంతకుముందు రోడ్డు తనిఖీల సమయంలో నాణ్యత విషయమై మంత్రి పర్వేశ్ వర్మ, స్థానిక తిలక్ నగర్ ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
కొత్తగా వేసిన తారు రోడ్డును ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ చేత్తో పెకిలించగా అది పెచ్చులూడి వచ్చేసింది. రోడ్డు నిర్మాణంలో జరిగిన అవినీతి బట్టబయలు కావడంతోనే మంత్రి సహనం కోల్పోయి, వీడియో తీస్తున్న తమ సహచరుడిపై గూండాగిరీ ప్రదర్శించారని ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ ఆ వీడియోను షేర్ చేస్తూ ఆరోపించారు.
ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మంత్రుల అహంకారానికి ఇది నిదర్శనమని విమర్శించిన ఆయన, సోమవారం తాను స్వయంగా ఆ ప్రాంతాన్ని సందర్శిస్తానని ప్రకటించారు. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ సైతం మంత్రి తీరును ఎక్స్ వేదికగా తీవ్రంగా ఖండించింది. रोడ్డు నాణ్యతపై మొదలైన వివాదం చివరకు దాడి వరకు వెళ్లడం ఢిల్లీ రాజకీయాల్లో వేడి పుట్టించింది.














