Last Updated:
Inspirational Wife: ఆలుమగల దాంపత్యం, అన్యోన్యం గురించి చాలా మంది అనేక రకాల కథలు, వాస్తవాలు, పురాణ, ఇతిహాసాల్లో విన్నాం. కాని భార్యభర్తల మధ్య కేవలం అన్యోన్యతే కాదు కష్టాలు, బాధలు, ఇబ్బందులను కూడా ఒకరి బాధ్యతను మరొకరు స్వీకరించడం గొప్ప విషయం. ఉత్తరప్రదేశ్‌లో ఓ సాధారణ గృహిణి చేసిన పని చూస్తే ప్రతీ ఒక్కరు అభినందిస్తారు..
Inspirational Wife: ఆలుమగల దాంపత్యం, అన్యోన్యం గురించి చాలా మంది అనేక రకాల కథలు, వాస్తవాలు, పురాణ, ఇతిహాసాల్లో విన్నాం. కాని భార్యభర్తల మధ్య కేవలం అన్యోన్యతే కాదు కష్టాలు, బాధలు, ఇబ్బందులను కూడా ఒకరి బాధ్యతను మరొకరు స్వీకరించడం గొప్ప విషయం. ఉత్తరప్రదేశ్‌లో ఓ సాధారణ గృహిణి చేసిన పని చూస్తే ప్రతీ ఒక్కరు అభినందిస్తారు.. ఆమె పతిభక్తిని మెచ్చి కన్నీరు కారుస్తారు. ఉత్తర్ ప్రదేశ్ ఘాజియాబాద్ జిల్లాలోని మోదీనగర్ ప్రాంతానికి చెందిన ఆశా, సచిన్‌ల దాంపత్య జీవితం ఒకప్పుడు సంతోషంగానే సాగింది. కానీ కొన్నేళ్ల క్రితం జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం వారి జీవితాన్ని తలకిందులు చేసింది. ఆ ప్రమాదంలో సచిన్ తీవ్రంగా గాయపడ్డాడు. వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ, ఆయన కాళ్ళు పనిచేయకుండా పోయాయి. దీంతో సచిన్ పూర్తిగా నడవలేని స్థితికి చేరుకుని, మంచానికే పరిమితమయ్యాడు. ఆ క్షణం నుండి ఇంటి బాధ్యతలతో పాటు భర్త సంరక్షణను కూడా ఆశానే తన భుజాలపై వేసుకొని కాపురాన్ని నెట్టుకొస్తోంది.
భర్త అవిటివాడు కావడంతో కుటుంబ భారం మాత్రమే అమెపై పడిందనుకుంది. కాని భర్తతో చేయాల్సిన ఓ భక్తి కార్యక్రమానికి సచిన్ నడవలేని పరిస్థితిలో ఉన్నాడని తెలిసి కూడా పెద్ద సాహసానికి పూనుకుంది ఆశా. ఒకటి రెండు కాదు 180 కిలో మీటర్ల దూరం వరకు భర్తను తన భుజంపై వేసుకొని కావడి యాత్రను పూర్తి చేసింది.
పవిత్రమైన శ్రావణ మాసంలో పరమశివుడికి నీటితో అభిషేకం చేసేందుకు ఏటా లక్షలాది మంది భక్తులు కావడి యాత్ర చేపడతారు. నడవలేని స్థితిలో ఉన్న సచిన్‌కు కూడా హరిద్వార్ వెళ్ళి కావడి యాత్ర చేయాలని, భోళాశంకరుడిని దర్శించుకోవాలని బలమైన కోరిక కలిగింది. భర్త మనసులోని మాటను గ్రహించిన ఆశా, అడ్డంకులు ఎన్ని ఉన్నా ఆయన కోరికను నెరవేర్చాలని నిశ్చయించుకుంది. వాహనాల్లో వెళ్లడం కాకుండా, సాంప్రదాయబద్ధంగా కాలినడకన అదీ తన భర్తను మోస్తూనే ఈ యాత్రను పూర్తి చేయాలని దృఢ సంకల్పం పూనింది.
హరిద్వార్ నుండి మొదలైన ఈ కావడి యాత్ర అత్యంత క్లిష్టంగా సాగింది. ఒకవైపు కఠినమైన నియమాలు, మరోవైపు భర్త బరువును భుజాలపై మోస్తూ కిలోమీటర్ల కొద్దీ నడవాల్సిన పరిస్థితి. హరిద్వార్‌లో కావడి యాత్ర అధికారికంగా ప్రారంభం కాకముందే వీరు అక్కడికి చేరుకున్నారు. మార్గమధ్యంలో ఎండ, వర్షం, శారీరక అలసట ఏవీ ఆమె నిశ్చయాన్ని సడలించలేకపోయాయి. దారిపొడవునా వీరిని చూసిన ఇతర యాత్రికులు, స్థానికులు ఆశా భక్తికి, ఆమె ప్రేమానురాగాలకు ముగ్ధులయ్యారు. “హర్ హర్ మహాదేవ్” స్మరణలతో ఆమెకు దారి పొడవునా ధైర్యాన్ని, మద్దతును అందించారు.
ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా, భర్త సంతోషమే తన సంతోషంగా భావించి 180 కిలోమీటర్ల సుదీర్ఘ దూరాన్ని ఆశా విజయవంతంగా పూర్తి చేసింది. ఈ యాత్ర కేవలం ఒక ఆధ్యాత్మిక ప్రయాణం మాత్రమే కాదు; అది ఆశా-సచిన్‌ల మధ్య ఉన్న గాఢమైన బంధానికి, నమ్మకానికి ప్రతీకగా నిలిచింది. కష్టసమయాల్లో తోడుగా నిలవడమే నిజమైన ప్రేమ అని ఆశా రుజువు చేసింది.
నేటి తరానికి ఈ దంపతుల ప్రయాణం ఒక గొప్ప సందేశాన్ని ఇస్తోంది. భార్యాభర్తల మధ్య ఉండాల్సింది కేవలం ఆడంబరాలు కాదని, కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలబడే గుణమని ఆశా తన చర్య ద్వారా నిరూపించింది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో, వార్తా మాధ్యమాల్లో వైరల్‌గా మారి, ఆశా సాహసానికి, పతిభక్తికి నెటిజన్ల నుండి నీరాజనాలు అందుతున్నాయి.
Hyderabad,Telangana













