Last Updated:
చిత్తూరు జిల్లా పలమనేరు గంటావూరు బీసీ కాలనీలోని శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయంలో 35 కేజీల, ఆరు అడుగుల పంచలోహ శిరస్సు ప్రతిష్ఠ, జాతరకు భారీగా భక్తుల రద్దీ
అమ్మవారి జాతరలు అంటేనే ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాల కలయిక. కానీ చిత్తూరు జిల్లాలో జరుగుతున్న ఓ గంగమ్మ జాతర మాత్రం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఎక్కడ చూసినా అదే చర్చ.. అదే అమ్మవారి విశ్వరూపం. ఒక్కసారి ఆ రూపాన్ని చూస్తే కళ్లప్పగించి చూడాల్సిందేనని భక్తులు చెబుతున్నారు. ప్రపంచంలోనే ఇలాంటి అమ్మవారి శిరస్సు ఎక్కడా ఉండదు అంటూ స్థానికులు గర్వంగా చెప్పుకుంటున్నారు.
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని గంటావూరు బీసీ కాలనీలో ఉన్న శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయంలో ఏర్పాటు చేసిన అమ్మవారి శిరస్సు ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పంచలోహాలతో అత్యంత వైభవంగా రూపొందించిన ఈ శిరస్సు ఏకంగా 35 కేజీల బరువు, ఆరు అడుగుల పొడవు, ఐదున్నర అడుగుల వెడల్పుతో భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బంగారు పూతతో మెరిసిపోతున్న ఈ రూపాన్ని చూస్తుంటే అమ్మవారే ప్రత్యక్షంగా దర్శనమిచ్చినట్లు అనిపిస్తోందని భక్తులు భావోద్వేగానికి గురవుతున్నారు.
ప్రతి ఏడాది ఘనంగా జరిగే గంగమ్మ జాతరకు ఈసారి మరింత వైభవం తీసుకొచ్చింది ఈ విశాలమైన శిరస్సే. గంగమ్మ గుడి చైర్మన్, సేవారత్న, స్వర్ణ నంది అవార్డు గ్రహీత డాక్టర్ మురుగన్ ఆధ్వర్యంలో జాతర ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రత్యేక పూజలు, డప్పు వాయిద్యాలు, సంప్రదాయ కళారూపాలతో ఆలయ పరిసరాలు భక్తి వాతావరణంలో మునిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు.
ఈ అద్భుతమైన శిరస్సును కేవలం 25 రోజుల్లో రూపొందించడం మరింత విశేషంగా మారింది. కర్ణాటక రాష్ట్రంలోని ములబాగిలు నియోజకవర్గం, శ్రీనివాసపురం సమీపంలోని ఉప్పుగుంట గ్రామానికి చెందిన విశ్వకర్మ శిల్ప కళాక్షేత్రం కళాకారులు దీనిని రూపొందించారు. అమరశిల్పి జక్కన్న వంశస్థులుగా పేరుగాంచిన మంజునాథ స్వామి మరియు ఆయన బృందం రాత్రింబవళ్లు శ్రమించి ఈ రూపాన్ని తీర్చిదిద్దారు.
డాక్టర్ మురుగన్ మాట్లాడుతూ.. 20 రోజుల్లో మేము చెప్పిన కొలతలతో అమ్మవారి శిరస్సు తయారు చేయగలరా అని అడిగితే, దాన్ని ఛాలెంజ్‌గా తీసుకుని మంజునాథ స్వామి బృందం అద్భుతం సృష్టించింది. ఆ తల్లిని చూస్తుంటే నన్ను నేను మరిచిపోతున్నాను అంటూ భావోద్వేగానికి గురయ్యారు. మంజునాథ స్వామి కూడా స్పందిస్తూ.. ఎన్నో విగ్రహాలు చేశాం. కానీ ఈ అమ్మవారి శిరస్సు మాత్రం అమ్మవారే చేయించుకున్నట్టుంది. భవిష్యత్తులో మళ్లీ ఇంత అద్భుతంగా చేయగలమా అనే అనుమానం కూడా మాకు వస్తోంది అంటూ ఆనందభాష్పాలు కార్చారు.
జాతర కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. అమ్మవారి రూపాన్ని చూస్తే గూస్‌బంప్స్ వస్తున్నాయి. భవిష్యత్ తరాలు కూడా ఈ శిరస్సు గురించి మాట్లాడుకునేలా ఇది చరిత్రలో నిలిచిపోతుంది అన్నారు. కర్ణాటక నుంచి పలమనేరుకు తీసుకొస్తున్న సమయంలో ఏడు గ్రామాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డప్పు ధ్వనులు, మంగళ వాయిద్యాల నడుమ ఘంటా ఊరు గంగమ్మ ఆలయంలో శిరస్సును ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రస్తుతం ఈ గంగమ్మ విశ్వరూపం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. “ఒక్కసారి అయినా ఈ అమ్మవారిని ప్రత్యక్షంగా చూడాలి” అంటూ భక్తులు పెద్ద ఎత్తున పలమనేరుకు తరలివస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Chittoor,Chittoor,Andhra Pradesh












