Last Updated:
హాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ అనగానే మైండ్ బ్లాంక్ అయ్యే సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌లు గుర్తొస్తాయి. కానీ ఈసారి ఆయన తన పంథాను పూర్తిగా మార్చుకుని, ఏకంగా 3000 ఏళ్ల నాటి గ్రీకు మైథాలజీ కథ ‘ది ఒడిస్సీ’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందొ చూద్దామా..
హాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ అనగానే మైండ్ బ్లాంక్ అయ్యే సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌లు గుర్తొస్తాయి. కానీ ఈసారి ఆయన తన పంథాను పూర్తిగా మార్చుకుని, ఏకంగా 3000 ఏళ్ల నాటి గ్రీకు మైథాలజీ ఆధారంగా తెరకెక్కించిన విజువల్ వండర్ ‘ది ఒడిస్సీ’. సుమారు రూ. 2000 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ యాక్షన్ ఫాంటసీ సర్వైవల్ డ్రామా జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. అంచనాలకు తగ్గట్టుగానే తొలి రోజే ఈ చిత్రం రూ. 2500 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి నోలన్ సృష్టించిన ఈ సరికొత్త ప్రపంచం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.
దాదాపు పదేళ్ల పాటు సాగిన ట్రోజన్ యుద్ధంలో అద్భుతమైన తెలివితేటలతో విజయం సాధిస్తాడు ఒడిస్సియస్ (మాట్ డామన్). ఆ తర్వాత తన సైన్యంతో కలిసి తన సొంత రాజ్యమైన ఇథాకాకు సముద్ర మార్గంలో పయనం అవుతాడు. అక్కడ అతని రాక కోసం భార్య పెనెలోప్ (అన్నీ హాథవే), కొడుకు టెలిమాకస్ (టామ్ హాలెండ్) కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. అయితే, ఒడిస్సియస్ ఇక తిరిగి రాడని, రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని కుటిల బుద్ధి గల ఆంటినస్ (రాబర్ట్ పాటిన్సన్) పన్నంగాలు పన్నుతుంటాడు. పెనెలోప్‌ను తనను వివాహం చేసుకోవాలని నిత్యం వేధిస్తుంటాడు. పది రోజుల్లో ఇథాకాకు చేరాల్సిన ఒడిస్సియస్ ప్రయాణంలో దేవుళ్ల కోపం, సముద్రపు రాక్షసులు, భయంకరమైన సుడిగుండాలు ఎదురవుతాయి. ఈ ప్రకృతి ప్రకోపాన్ని, మాయలను దాటుకుని ఒడిస్సియస్ తన రాజ్యాన్ని, కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేదే ఈ సినిమా మూల కథ.
రాజులు, రాక్షసులు, మంత్రాలు, ఇతిహాసాలు మన ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే ఇలాంటి పాత కథను ఎంచుకున్నప్పుడు దర్శకుడు దానిని ఎలా ప్రెజెంట్ చేశాడు అనేదే ముఖ్యం. నోలన్ ఆ విషయంలో నూటికి నూరు శాతం సఫలమయ్యాడు. కథలో ఎలాంటి అతిశయోక్తులు లేకుండా, ప్రతి పాత్రకు ఒక బలమైన నాటకీయతను జోడించి ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేశాడు.
ఒడిస్సియస్ పాత్రకు మాట్ డామన్ ప్రాణం పోశాడు. ఎలాంటి ఓవరాక్షన్ లేకుండా ఎమోషన్స్‌ను పండించి తన కెరీర్లోనే అత్యుత్తమ నటన కనబరిచాడు. రాణిగా అన్నీ హాథవే, కొడుకుగా టామ్ హాలెండ్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. నెగెటివ్ రోల్లో ఆంటినస్గా రాబర్ట్ పాటిన్సన్ కరుడుగట్టిన విలనిజాన్ని చూపించి ప్రేక్షకులను భయపెట్టాడు. సిర్సీగా సమంత మోర్టన్, అయోమయ కమాండర్‌గా ఏకైక భారతీయ నటుడు హిమేష్ పటేల్ అద్భుతంగా నటించి మెప్పించారు.
ఈ సినిమాకు అసలైన హీరో సినిమాటోగ్రాఫర్ హొయ్‌టే వన్ హొయ్టెమా. ఐమ్యాక్స్ 70ఎంఎం కెమెరాలతో మూడు గంటల పాటు సినిమాను చిత్రీకరించి విజువల్ వండర్‌గా మలిచాడు. రాక్షస అలలు, సుడిగుండాల దృశ్యాలు ఐమాక్స్ తెరపై చూస్తున్నప్పుడు థియేటర్లో ఎగిరి గంతేయడం ఖాయం. లుడ్విగ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో లెవెల్. సైలెంట్‌గా మొదలై క్లైమాక్స్‌లో థియేటర్ స్పీకర్లు బద్దలయ్యే రేంజ్లో మ్యూజిక్ ఇచ్చాడు. దీనికి మరో ఆస్కార్ ఖాయం అనిపిస్తుంది.
ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా సాగినట్లు, సాగదీసినట్లు అనిపించినా, దృశ్యకావ్యంలా సాగే ఈ చిత్రాన్ని కచ్చితంగా ఐమాక్స్ తెరపైనే చూడాలి. హాలీవుడ్ యాక్షన్ ఫాంటసీ లవర్స్‌కు ఇదొక పండగ.
రేటింగ్: 2.75
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana














