Last Updated:
తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత చంద్రబోస్ కుటుంబంతో కలిసి తిరుమలనగర్లోని ఈశానేశ్వర నవలింగ క్షేత్రాన్ని సందర్శించారు. కేతారి నరసమ్మ సొంత నిధులతో నిర్మించిన ఈ ఆలయం ప్రత్యేకతలను ఆయన కొనియాడారు.
తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత తిరుగు ప్రయాణంలో సినీ పాటల రచయిత చంద్రబోస్కు మరో అద్భుతమైన దర్శనం లభించింది. శ్రీవారి దర్శనంతో ఆనందంలో ఉన్న ఆయన.. మంగళం పరిధిలోని తిరుమలనగర్లో ఉన్న ఈశానేశ్వర నవలింగ క్షేత్రాన్ని కుటుంబ సమేతంగా సందర్శించారు. ఇక్కడి ప్రశాంత వాతావరణం, ఆలయ ప్రత్యేకతలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని చంద్రబోస్ తెలిపారు.
ఇటీవల తన కుమారుడి వివాహం జరిగిన సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చినట్లు చంద్రబోస్ చెప్పారు. శ్రీవారి బ్రహ్మాండమైన దర్శనం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం తిరుగు ప్రయాణంలో తిరుమలనగర్లోని ఈశానేశ్వరస్వామిని దర్శించుకుని స్వామివారి అనుగ్రహం, ఆశీస్సులు పొందినట్లు తెలిపారు.
ఈ క్షేత్రం గురించి చంద్రబోస్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సుమారు 103 ఏళ్ల పాటు జీవించిన కేతారి నరసమ్మ అనే పెద్దావిడ ఎవరి వద్ద నుంచి ఒక్క రూపాయి కూడా విరాళంగా తీసుకోకుండా.. సొంత నిధులతో, కష్టార్జితంతో ఈ క్షేత్రాన్ని నిర్మించారని చెప్పారు. ఆమె అనంతరం వారసులు ఆలయాన్ని ఎంతో అద్భుతంగా, వైభవంగా నిర్వహిస్తున్నారని అభినందించారు.
ఈ ఆలయంలో మరో ప్రత్యేకత కూడా ఉందని చంద్రబోస్ తెలిపారు. భక్తులు ఎలాంటి రుసుము చెల్లించకుండా స్వామివారికి అభిషేకాలు, పూజలు చేసుకునే అవకాశం ఉండటం తనను ఆకట్టుకుందన్నారు. సాధారణంగా శివాలయాల్లో నవగ్రహాలను చూస్తామని.. కానీ ఈ క్షేత్రంలో నవలింగాలు ఉండటం అద్భుతంగా అనిపించిందని చెప్పారు. అంతేకాదు.. దిక్కులకు అనుగుణంగా ఏకబిల్వం, మహాబిల్వం, రుద్రాక్ష, జమ్మి, ఉసిరి, మోదుగ వంటి దైవిక వృక్షాలు ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకతగా పేర్కొన్నారు. ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని చంద్రబోస్ తెలిపారు.
ఇక్కడ భక్తులకు లభిస్తున్న ఆదరణ చూస్తుంటే సాక్షాత్తు ఆ పరమశివుడే అన్నీ నిర్వహిస్తున్నాడేమో అనిపిస్తోందని చంద్రబోస్ అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వీలైతే ఈశానేశ్వర నవలింగ క్షేత్రాన్ని కూడా సందర్శించి పరమశివుని అనుగ్రహం పొందాలని చంద్రబోస్ ఆకాంక్షించారు.














