Last Updated:
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి దర్శించుకున్నారు. నూతన రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న ఆయన, తన ఆప్తమిత్రుడు రమణను రాజకీయ ప్రయాణంలో భాగస్వామి కావాలని ఆహ్వానించారు.
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి దర్శించుకున్నారు. నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ సంకల్పంతో తిరుమలకు వచ్చిన ఆయన తన ఆప్తమిత్రుడు రమణతో కలిసి స్వామివారి దర్శనం చేసుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. గతంలో నాలుగేళ్లపాటు టీటీడీ పాలకమండలి సభ్యులుగా ఇద్దరూ భావసారూప్యతతో కలిసి పనిచేశామని గుర్తుచేశారు.
2004–2006 కాలం నుంచి కొనసాగుతున్న తమ అనుబంధం ఎంతో ప్రత్యేకమైనదని, ఈ స్నేహం భవిష్యత్తులోనూ చిరకాలం కొనసాగుతుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. తన నూతన రాజకీయ ప్రయాణంలో భాగస్వామి కావాలని రమణను ఆహ్వానించిన ఆయన, ఇద్దరం కలిసి పనిచేసి విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యాలని స్పష్టం చేశారు.
తిరుమల ఆలయ పవిత్రతను కాపాడటం తమ మొదటి కర్తవ్యమని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. జీయర్ స్వాములు, పీఠాధిపతుల అభీష్టం మేరకు తిరుమలలో వెయ్యి కాళ్ల మండపం పునర్నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. ఆలయ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశిష్టతకు ప్రాధాన్యం ఇస్తూ, భక్తుల మనోభావాలను గౌరవించే విధంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఆధ్యాత్మిక క్షేత్రాల పవిత్రతను పరిరక్షించడంతో పాటు రాష్ట్ర అభివృద్ధి, ప్రజా శ్రేయస్సు కోసం తమ వంతు కృషి చేస్తామని విజయసాయిరెడ్డి వెల్లడించారు. తన నూతన రాజకీయ ప్రయాణం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.













