ఆదర్శ జంట జీవితంలోకి ఊహించని వ్యక్తి ఎంటర్ అయితే..! వదలా మూవీ రివ్యూ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

జగపతిబాబు, లయ, హ్రితిక శ్రీనివాస్, శ్రీనివాస్ అవసరాల తదితరులు కీలక పాత్రల్లో నటించిన సినిమా వదలా. జూలై 17న విడుదలైన ఈ సినిమా ఎలా ఉందొ చూద్దామా..

News18
News18

జగపతిబాబు, లయ, హ్రితిక శ్రీనివాస్, శ్రీనివాస్ అవసరాల తదితరులు కీలక పాత్రల్లో నటించిన సినిమా వదలా. ఆకెళ్ల వి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను కిషోర్ నాయుడు చిరు మామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మించారు. జూలై 17న ఈ సినిమా విడుదలైంది. మానవ సంబంధాలు, భావోద్వేగాల మేళవింపుగా వచ్చిన ఈ సినిమా కథ, కథనాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు

కథ:

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో స్థిరపడిన డాక్టర్ యోగి సిద్ధార్థ్ (జగపతి బాబు), తన భార్య ప్రియ (లయ), పిల్లలతో కలిసి ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా జీవిస్తుంటాడు. వైద్య వృత్తిలో ఉంటూనే కుటుంబానికి పెద్ద పీట వేసే యోగి జీవితం సాఫీగా సాగిపోతుంటుంది. అయితే అంతా సజావుగా సాగుతున్న వీరి జీవితంలోకి ఒక అనుకోని ప్రమాదం ద్వారా అముద (హ్రితిక శ్రీనివాస్) అనే యువతి ప్రవేశిస్తుంది. ఆమె రాకతో ఆ కుటుంబ ప్రశాంతత పూర్తిగా దెబ్బతింటుంది. అనూహ్యమైన పరిణామాలు ఎదురవుతాయి. అసలు అముద ఎవరు? ఆ కుటుంబంలోకి ఎందుకు వచ్చింది? ఆమెకు, నివాస్ (శ్రీనివాస్ అవసరాల) అనే వ్యక్తికి ఉన్న సంబంధం ఏమిటి? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే..

విశ్లేషణ:

దర్శకుడు సినిమాను ప్రారంభించిన తీరు ప్రేక్షకులను వెంటనే కథలోకి తీసుకెళ్తుంది. ఒక సైకలాజికల్ థ్రిల్లర్‌కు అవసరమైన ఉత్కంఠను మొదటి భాగంలో బాగానే మెయింటైన్ చేశారు. ముఖ్యంగా డాక్టర్ యోగి, అముద మధ్య వచ్చే సన్నివేశాలు మానవ సంబంధాల్లోని సంక్లిష్టతను, ఎవరూ ఊహించని కోణాలను ఆవిష్కరిస్తాయి. భార్యాభర్తలుగా జగపతి బాబు, లయ మధ్య అనుబంధాన్ని, అన్యోన్యతను చాలా సహజంగా చూపించారు కానీ మధ్య మధ్యలో కొన్ని బోరింగ్ సన్నివేశాలు పెట్టి సగటు ప్రేక్షకుడికి చిరాకు తెప్పించారు.

ఒక మానసిక సమస్యతో బాధపడే వ్యక్తి వల్ల కుటుంబానికి ఎదురయ్యే ఇబ్బందులను ఉత్కంఠభరితంగా చూపిస్తూనే.. క్లైమాక్స్‌లో కథను ఊహించని విధంగా ఎమోషనల్‌గా మార్చేసిన తీరు అయితే బాగుంది. అముద సృష్టించిన గందరగోళాన్ని పక్కనపెట్టి, తప్పులను క్షమించి, ఆమె జ్ఞాపకాలను స్వీకరించి మానవత్వాన్ని చాటే ముగింపు ప్రేక్షకుడి గుండెను బరువెక్కిస్తుంది. క్షమాగుణం గొప్పదనాన్ని చెప్పే ఈ పాయింట్ విభిన్న చిత్రాలను ఇష్టపడే వారికి కనెక్ట్ అవుతుంది కానీ, కాకపోతే రెగ్యులర్ కమర్షియల్ ఆడియన్స్‌కు ఇది ఎక్కడం కష్టమే. ఈ సినిమా నిడివి తక్కువే ఉన్నప్పటికీ పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకోవడం, కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు సినిమా ఫీల్‌ పోగొట్టాయి. సెకాండాఫ్ ఆరంభంలో ప్రేక్షకుల ఓపికకు పరీక్ష పెట్టినా క్లైమాక్స్ వచ్చే సరికి కాస్త రిలాక్స్ చేసి థియేటర్స్ నుంచి బయటకు పంపించేశారు.

నటీనటుల పనితీరు:

ఒక బాధ్యతాయుతమైన వైద్యుడిగా, కుటుంబం కోసం పరితపించే తండ్రిగా జగపతి బాబు తన సీనియారిటీని, నటనలోని పరిణతిని మరోసారి నిరూపించుకున్నారు. లయ తన పాత్రలో ఒదిగిపోయింది. సినిమా ప్రారంభంలో ఎంతో సహజంగా కనిపించిన ఆమె, ముగింపులో భర్తను కాపాడుకునే క్రమంలో అద్భుతమైన భావోద్వేగాలను పండించింది.

ఈ సినిమాలో అత్యంత సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ హ్రితిక. మానసిక సంఘర్షణ అనుభవించే యువతిగా తన అద్భుతమైన నటనతో సినిమాకే హైలైట్‌గా నిలిచింది. శ్రీనివాస్ అవసరాల, రవివర్మ తదితరులు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసి కథకు బలాన్ని చేకూర్చారు.

సాంకేతిక వర్గం:

కార్తీక్ బి. కొడకండ్ల అందించిన సంగీతం, నేపథ్య సంగీతం థ్రిల్లర్ మూడ్‌కు సరిగ్గా సరిపోయాయి. చోటా కే నాయుడు కెమెరా వర్క్, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి. దర్శకుడు ఆకెళ్ల వి కృష్ణ ఎంచుకున్న పాయింట్ సున్నితమైనదే అయినా, దాన్ని చెప్పిన విధానంలో ఇంకాస్త పదును పెడితే బాగుండేది.

ఓవరాల్‌గా.. ‘వదలా’ కాస్త వదిలించుకుంటేనే బెటర్

రేటింగ్: 2.25

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports