గుంటూరు నుంచి తిరుపతికి 4 గంటల్లో గుండె తరలింపు.. చిన్నారి ప్రాణాన్ని నిలబెట్టిన వైద్య బృందం | | ACTPnews

News18


Last Updated:

గుంటూరులో లభించిన దాత గుండెను సకాలంలో తిరుపతికి తరలించి 14 ఏళ్ల బాలికకు విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయ చికిత్సా కేంద్రంలో 27వ గుండె మార్పిడి శస్త్రచికిత్సను వైద్య బృందం విజయవంతంగా పూర్తి చేసింది.

News18
News18

టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయ చికిత్సా కేంద్రంలో 27వ గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. గుండె మార్పిడి కోసం ఎదురుచూస్తున్న 14 ఏళ్ల బాలికకు గుంటూరులో లభించిన దాత గుండెను సకాలంలో తిరుపతికి తరలించి విజయవంతంగా మార్పిడి చేశారు. గుంటూరులోని కిమ్స్ ఆసుపత్రిలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించిన 38 ఏళ్ల వ్యక్తి కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. వారి మానవతా నిర్ణయం మరో చిన్నారికి ప్రాణదానం చేసి, కొత్త జీవితాన్ని అందించింది. ఒక కుటుంబం తీసుకున్న అవయవదాన నిర్ణయం మరో కుటుంబంలో ఆశాకిరణంగా మారింది.

గుండె మార్పిడి ప్రక్రియలో ప్రతి నిమిషం ఎంతో కీలకమైన నేపథ్యంలో, ఎయిర్ అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో టీటీడీ రవాణా విభాగానికి చెందిన వాహనంలో సెప్టెంబరు 20న మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు నుంచి గుండెను రోడ్డుమార్గంలో తిరుపతికి తరలించారు. శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయ చికిత్సా కేంద్రానికి చెందిన ఫిజీషియన్ అసిస్టెంట్ విజయ్, పెర్ఫ్యూషనిస్ట్ శ్యామ్ బాబు గుండెతో పాటు ప్రయాణిస్తూ, మార్గమధ్యంలో వైద్య బృందంతో నిరంతరం సమన్వయం చేశారు. సుమారు నాలుగు గంటల వ్యవధిలో సాయంత్రం 7 గంటలకు గుండె తిరుపతికి చేరుకుంది. గుండె ఆసుపత్రికి చేరుకున్న వెంటనే వైద్య బృందం మార్పిడి ప్రక్రియను ప్రారంభించి, సుమారు ఎనిమిది గంటలపాటు అత్యంత సంక్లిష్టంగా నిర్వహించిన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది.

ఈ గుండె మార్పిడి శస్త్రచికిత్సను శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయ చికిత్సా కేంద్రం డైరెక్టర్ డా. ఎన్. శ్రీనాథ్ రెడ్డి సమన్వయంతో, చీఫ్ కార్డియాక్ సర్జన్ డా. దీపేష్ త్రివేది నేతృత్వంలో నిర్వహించారు. కార్డియాక్ అనస్థీషియాలజిస్ట్ డా. మధు యాదవ్‌తో పాటు కార్డియాక్ సర్జన్లు, కార్డియాలజిస్టులు, ఇంటెన్సివిస్టులు, పెర్ఫ్యూషనిస్టులు, నర్సింగ్ సిబ్బంది, ట్రాన్స్‌ప్లాంట్ బృందాలు సమష్టిగా కృషి చేసి ఈ క్లిష్టమైన గుండె మార్పిడి ప్రక్రియను విజయవంతం చేశారు. ప్రస్తుతం బాలిక వైద్యుల నిరంతర పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది..

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ ఒకవైపు లక్షలాది మంది భక్తులకు వివిధ సేవలను అందిస్తూ, మరోవైపు ఒక చిన్నారి ప్రాణాన్ని నిలబెట్టేందుకు టీటీడీ వైద్య బృందం విశేషంగా కృషి చేసింది. దాత కుటుంబం తీసుకున్న మానవతా నిర్ణయం, గుండెను సకాలంలో తరలించిన రవాణా బృందం సమయపాలన, వైద్య నిపుణుల సమష్టి కృషి కలిసి 14 ఏళ్ల బాలికకు కొత్త జీవితానికి నాంది పలికాయి. అవయవదానం ద్వారా ఒక ప్రాణం మరొక ప్రాణానికి ఆశగా నిలుస్తుందనే సందేశాన్ని ఈ గుండె మార్పిడి మరోసారి చాటిచెప్పింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports