పెళ్లి పేరుతో లక్షల్లో మోసం?.. ఈ 42 మంది పెళ్లి కొడుకుల కథ వెంటే షాక్ అవుతారు..! | | ACTPnews

News18


Last Updated:

మధ్యప్రదేశ్ లోని దేవాస్ నగరంలో పెళ్లి పేరుతో జరిగిన ఒక వింత మోసం వెలుగు చూసింది. ఇక్కడి క్లబ్ గ్రౌండ్ లో ఒకేసారి నలభై రెండు మంది కంటే ఎక్కువ మంది పెళ్లికొడుకులు పెళ్లి ఊరేగింపుతో వచ్చి తమ వధువుల కోసం గంటల తరబడి నిరీక్షించారు.

News18
News18

మధ్యప్రదేశ్ లోని దేవాస్ నగరంలో పెళ్లి పేరుతో జరిగిన ఒక వింత మోసం వెలుగు చూసింది. ఇక్కడి క్లబ్ గ్రౌండ్ లో ఒకేసారి నలభై రెండు మంది కంటే ఎక్కువ మంది పెళ్లికొడుకులు పెళ్లి ఊరేగింపుతో వచ్చి తమ వధువుల కోసం గంటల తరబడి నిరీక్షించారు. ఎంత సమయం గడిచినా ఒక్క వధువు కూడా అక్కడికి చేరుకోలేదు. దీంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ వింత వ్యవహారం చివరికి పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఇండోర్‌లో గల ఒక అనాథ శరణాలయం‌లో నివసిస్తున్న అమ్మాయిలను తీసుకువచ్చి పెళ్లిళ్లు చేస్తానని నమ్మించి విదిశ నివాసి అయిన ఒక యువకుడు లక్షల రూపాయలు వసూలు చేసి మోసగించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో నివసించే ప్రజలను విదిశకు చెందిన ఒక వ్యక్తి సంప్రదించాడు. తాను అందరికీ తక్కువ ఖర్చుతో పెళ్లిళ్లు జరిపిస్తానని నమ్మించాడు. ఇండోర్‌లోని ఒక పేరున్న అనాథ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న అమ్మాయిలను తీసుకువచ్చి అందరికీ వివాహాలు చేస్తానని పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. ఈ మాటలు నిజమేనని నమ్మిన పెళ్లికొడుకులు, వారి తల్లిదండ్రులు ఆ వ్యక్తి అడిగినంత డబ్బులు ఇచ్చుకున్నారు. పెళ్లి ఏర్పాట్ల ఖర్చుల పేరిట ఒక్కొక్కరి దగ్గర లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు బాధితులు పోలీసుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు.

ముందుగా నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం పెళ్లికొడుకులు అందరు ఎంతో ఉత్సాహంగా కొత్త బట్టలు ధరించి, తలపాగాలు చుట్టుకుని, బంధుమిత్రులతో కలిసి క్లబ్ గ్రౌండ్ కు చేరుకున్నారు. ఎంతో వైభవంగా బ్యాండ్ మేళాలతో బరాత్ నిర్వహించి వధువుల రాక కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూశారు. అయితే అర్ధరాత్రి దాటిపోతున్నా వధువులు గానీ, పెళ్లి జరిపిస్తానన్న ఆ ముఖ్య వ్యక్తి గానీ అక్కడ కనిపించలేదు. అతని ఫోన్ కూడా పనిచేయకపోవడంతో సమయం గడుస్తున్న కొద్దీ తాము మోసపోయామని పెళ్లికొడుకులకు అర్థమైంది. దీనితో ఆగ్రహం తట్టుకోలేక బాధితులు, వారి బంధువులు క్లబ్ గ్రౌండ్‌లో పెద్ద ఎత్తున హంగామా సృష్టించారు.

తాము మోసపోయామని పూర్తిగా గ్రహించిన వెంటనే బాధితులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఒకేసారి ఇంత మంది పెళ్లికొడుకులు పెళ్లి పేరుతో ఒకే చోట మోసపోవడం దేశంలోనే బహుశా ఇదే మొదటి వింత ఘటన కావచ్చునని స్థానికులు చర్చించుకుంటున్నారు. పెళ్లి కొడుకుల జీవితాల్లోని అతిపెద్ద కల ఒక్కసారిగా ముక్కలైపోయింది. పెళ్లి ఊరేగింపు సిద్ధంగా ఉన్నా, పెళ్లికొడుకులు ముస్తాబైనా వధువులను తీసుకువస్తానన్న వ్యక్తి మాయమవడంతో అందరూ షాక్ కు గురయ్యారు. ప్రస్తుతం దేవాస్ పోలీసులు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *